అభివృద్ధి పనులను సద్వినియోగం చేసుకోండి - Bhadradri - EENADU
close

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

ప్రధానాంశాలు

అభివృద్ధి పనులను సద్వినియోగం చేసుకోండి

జిల్లాలో రూ. 30వేల కోట్ల పనులు

 ఎంపీ నామా నాగేశ్వరరావు 

సమీక్షా సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, పక్కన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.30వేల కోట్ల పనులకు అవకాశం కల్పించారని దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఖమ్మం ఎంపీ, లోక్‌సభలో తెరాస పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట వెంకటేశ్వర ఫంక్షన్‌ హాలులో మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులతో వివిధ కార్యక్రమాలు అమలుపై ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో నామా మాట్లాడుతూ అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా ప్రజల సేవ కోసమే ఉన్నామని, ఇరువురూ సమన్వయంతో పనిచేస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దొచ్చని అన్నారు. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో అధికారులు ఇచ్చిన గడువులోగా నిర్ణీత సమస్యలు పరిష్కరించేలా ఏటీఆర్‌ (యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు) తయారు చేసుకోవాలని సూచించారు. నామా నాగేశ్వరరావు శాఖల వారీగా సమీక్షించారు.

* అయిదు మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని నివేదికలు చదివి వినిపించారు. నియోజకవర్గంలో ఇంకా భూప్రక్షాళనలో పట్టాదారు పాసు పుస్తకాలు చేయాల్సిన ఖాతాలు సుమారు 12వేలు ఉన్నాయని ఇన్ని ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని నామా ప్రశ్నించారు. అశ్వారావుపేట తహసీల్దార్‌ వి.రాఘవరెడ్డి వివరణ ఇస్తూ తమ మండలంలో 82శాతం పట్టాదారు పాసుపుస్తకాలు పూర్తిచేశామని తెలిపారు. మిగిలినవి రెవెన్యూ ఫారెస్టు, ఎల్‌టీఆర్‌, పీవోటీ, వారసత్వ పట్టాలు, కోర్టు వ్యాజ్యాలతో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ములకలపల్లి తహసీల్దార్‌ ముజాహిద్‌ తమ మండలంలో సుమారు 2వేల ఖాతాలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. వారికి పాసుపుస్తకాలున్నాయి, పోజిషన్‌లోనూ ఉన్నారు. కాకపోతే అటవీశాఖ పరిధిలోని భూముల్లో ఉన్నారని తహసీల్దార్‌ చెప్పడంతో నామా కల్పించుకొని అన్ని విధాలుగా ఉన్న వారి పట్టాలు ఏవిధంగా రద్దు చేస్తారని ప్రశ్నించారు. మీరు అలా చేస్తే మన్యంలో కొత్త పంచాయతీ మొదలవుతుంది. దీనిపై తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించారు.

సమావేశానికి హాజరైన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు

* నియోజకవర్గంలో 37వేల ఎకరాలకు ఇప్పటివరకూ 29వేల ఎకరాలో సాగు చేపట్టారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రెండోదఫా రైతుబంధు కార్యక్రమంలో ఆన్‌లైన్‌ అప్‌డేట్‌ అయిన వారిలో 50శాతం మందికి రైతుబంధు రాలేదని ఏడీ తెలిపారు.

* ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు సక్రమంగా రావడంలేదని, గతంలో నిర్మించిన మరుగుదొడ్లుకు నిధులు రాలేదని, ప్రణాళిక సంఘం ఇచ్చే నిధులతో పనులు పూర్తిచేయలేకపోతున్నామని అయిదు మండలాల ఎంపీడీవోలు తెలిపారు. నిధులు వచ్చేలా చూస్తామని, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో పాఠశాలల్లో వంటగదులు, మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని ఎంపీ నామా, ఎమ్మెల్సీ బాలసాని ఆదేశించారు.

* నియోజకవర్గంలో అత్యధిక పాఠశాలల్లో వంటగదులు, ప్రహరీలు లేవని అయిదు మండలాల ఎంఈవోలు తెలిపారు. ఉపాధ్యాయుల కొరతపై ఎంఈవో కృష్ణయ్య తెలిపారు. అలాగే ర.భ.శాఖ, విద్యుత్తు శాఖల సమస్యలపైనా చర్చించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.