నిమజ్జనంపై డ్రోన్‌ కన్ను! - Hyderabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

ప్రధానాంశాలు

నిమజ్జనంపై డ్రోన్‌ కన్ను!

హుస్సేన్‌ సాగర్‌లో లోతు, పూడిక గుర్తింపు
శోభాయాత్రలో ట్రాఫిక్‌నిలిచే ప్రాంతాల పరిశీలన
మలేషియా సాంకేతిక పరిజ్ఞానం వినియోగం
న్యూస్‌టుడే, ఖైరతాబాద్‌

వినాయక నిమజ్జనం సాఫీగా సాగేలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జీహెచ్‌ఎంసీ ఉపయోగించనుంది. హుస్సేన్‌సాగర్‌లో గణపతి విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో లోతు ఎంత ఉంది.. పూడిక ఏమైనా ఉందా.. బండ రాళ్లు ఉన్నాయా అని పరిశీలిస్తారు. ఇందుకోసం మలేషియా డ్రోన్‌ టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించారు. ఈ డ్రోన్ల సాయంతో 3డీ చిత్రాలు తీస్తారు. చెరువు నీటిలోకి డ్రోన్‌ ద్వారా సంకేతాలు పంపించి.. నీటి లోతు, పూడిక, రాళ్లు గుర్తించే అవకాశం ఉంది. ఖైరతాబాద్‌ వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రదేశమే కాకుండా ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌ మార్గంలోనూ 3డీ చిత్రాలు తీయనున్నారు. నిమజ్జనం చేసేచోట పూడిక ఉంటే దాన్ని తొలగించాలా లేదా నిమజ్జన ప్రదేశం మార్చాలా అనేది నిర్ణయిస్తారు.

శోభాయాత్రలోనూ డ్రోన్‌ కెమెరాలు
నిమజ్జన ప్రదేశంలోనే కాకుండా శోభాయాత్రలోనూ డ్రోన్లను వినియోగించే ఆలోచనతో అధికారులు ఉన్నారు. ప్రధానంగా ఖైరతాబాద్‌, బాలాపూర్‌, మెహిదీపట్నం, చార్మినార్‌ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చే వినాయక విగ్రహాల శోభాయాత్ర కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ను గుర్తించేందుకు వీటిని ఉపయోగించాలన్న ఆలోచనతో ఉన్నారు. డ్రోన్లు జియోఫెన్సింగ్‌లో మాత్రమే తిరుగుతూ చిత్రాలు, వీడియోలను ప్రత్యక్ష ప్రసారంగా అందజేస్తాయి. వీటి ద్వారా ట్రాఫిక్‌ మళ్లింపులు, ఇతర భద్రతాంశాలపై అధికారులు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శోభాయాత్ర ఫొటోల చిత్రీకరణ నిమిత్తం డ్రోన్‌ కెమెరాల వినియోగానికి పోలీసుల అనుమతి పొందనున్నారు.

పూడిక వేసేదెక్కడ?
హుస్సేన్‌ సాగర్‌లో పూడికతీత అన్న ఆలోచన బాగానే ఉన్నా విషపూరితమైన పూడిక ఎక్కడ వేయాలి, ఎలా తరలించాలనేది ప్రశ్నార్థకంగా ఉంది. తప్పని పరిస్థితిలో తొలగించాల్సి వస్తే నగరం బయట స్థలాలు గుర్తించి అక్కడ గుంతలు తవ్వి పూడిక వేసి పూడ్చాలనే ఆలోచనతో అధికారులు ఉన్నారు. ఆయాచోట్ల పార్కులను అభివృద్ధి చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. దుర్వాసన రాకుండా కంటెయినర్‌ లాంటి వాటిలో తరలించాల్సి వస్తుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పూడిక తీయడమా, నిమజ్జన స్థలం మార్పు చేయడమా అని యోచిస్తున్నారు.

నిమజ్జన ప్రదేశం చిత్రీకరణ
ఎన్టీఆర్‌ మార్గ్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రదేశంలో ఆదివారం మలేషియా డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా పలు 3డీ చిత్రాలు తీశారు. ఈ చిత్రీకరణను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పరిశీలించారు. డ్రోన్‌ 3డీ చిత్రాల ద్వారా మట్టి, పూడిక ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అవసరమైన చోట పూడిక తీయడం వల్ల నిమజ్జనం సాఫీగా జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా థర్మాకోల్‌, కర్ర, అల్యూమినియం, ఇతర లోహాలతో తయారుచేసిన డ్రోన్లను ఎన్టీఆర్‌ మార్గ్‌లో ప్రదర్శించారు. పరిశీలనలో సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సైదిరెడ్డి, పలువురు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ వినతి నేపథ్యంలో..
హుస్సేన్‌సాగర్‌లో వేలాది గణపతి విగ్రహాలు నిమజ్జనం అవుతుంటాయి. భారీ విగ్రహాలను క్రేన్‌ సాయంతో నీటిలో దించినా కొంత మేరకే మునుగుతున్నాయి. ప్రధానంగా ఖైరతాబాద్‌ వినాయకుడు సగం మాత్రమే మునిగి.. పైకి తేలియాడుతూ దర్శనమిస్తుంటాడు. ఈ నేపథ్యంలో విగ్రహాలు పూర్తిగా మునిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ కోరింది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.