close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

అజమాయిషీ లేని నుమాయిష్‌!

 అక్రమాల సంతగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ
 నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల కేటాయింపు
 అగ్నిప్రమాదం సంభవించినా చర్యలు శూన్యం
 అగ్నిమాపక అనుమతుల్లేకుండానే జనవరిలో ప్రదర్శనకు సన్నద్ధం!
ఈనాడు, హైదరాబాద్‌

ప్రతిష్ఠాత్మక ప్రదర్శన.. జాతీయస్థాయిలో గుర్తింపు. దేశం నలుమూలల నుంచి వివిధ ఉత్పత్తులను విక్రయించేందుకు అనువైన వేదిక. లాభనష్టాలకతీతంగా దశాబ్దాలుగా కొనసాగుతోంది. లక్షలాది మంది సందర్శకుల మన్ననలు అందుకుంటోంది. క్రమంగా ప్రశంసల నుంచి అవినీతిపర్వానికి దిగజారింది. అక్రమాలకు కేరాఫ్‌ చిరునామా అయింది. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవటంతో కొందరు సభ్యులు ఇష్టారాజ్యంగా మారింది. దుకాణాల కేటాయింపులోనూ సొంత పెత్తనమే సాగుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అవినీతి సంతగా మారిందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. గతేడాది అగ్నిప్రమాదం సంభవించి తీవ్రనష్టం వాటిల్లినా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. అగ్నిమాపకశాఖ అనుమతి రాకుండా 2020 నుమాయిష్‌కు దుకాణాల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. అక్రమాలపై గళమెత్తిన సభ్యులను తొలగించి తమ కుటుంబ సభ్యులతో ఆ స్థానాలను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ అసలు కథ
నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం సుమారు 24.675 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు ఈ నుమాయిష్‌కు రూపమిచ్చారు. స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనకు 100 స్టాళ్లతో మొదలైంది. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులపాటు కొనసాగే ప్రదర్శనకు సుమారు 40-45 లక్షల మంది సందర్శకులు వస్తుంటారని అంచనా. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. చేతి వృత్తులను ప్రోత్సహించాలనే సంకల్పంతోపాటు సమకూరిన ఆదాయాన్ని పేద పిల్లల చదువులకు ఉపయోగించాలనేది సొసైటీ అసలు లక్ష్యం. రాబడిలో 85 శాతం విద్య, 15 శాతం సొసైటీ ఖర్చులకు కేటాయించాలనేది నిబంధన. దీంతో ఆదాయపన్నుశాఖ నుంచి కూడా మినహాయింపు పొందటం విశేషం. పలు విద్యాసంస్థలను నడుపుతూ వాటికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. నిబంధనల ప్రకారం 196 మందికి మాత్రమే సభ్యత్వం ఉండాలి. ప్రస్తుతం అధికార, అనధికారికంగా 250 మందికిపైగా సభ్యులున్నారు. వీరిలో అధికశాతం సభ్యులుగా ఒకే కుటుంబానికి చెందినవారు కొనసాగటం కొసమెరుపు. స్వతంత్ర సంస్థ కావటంతో కొందరు సభ్యులు ప్రదర్శన ప్రాంగణాన్ని కేంద్రంగా చేసుకుని అందినంత బొక్కేందుకు సిద్ధమయ్యారనే ఆరోపణలున్నాయి.

ఇప్పుడేం జరుగుతుందంటే..
కొందరు సభ్యులు చెప్పిందే వేదం. 46 రోజులు మాత్రమే నిర్వహించాల్సిన ప్రదర్శనను 55 రోజులకు పెంచారు. రాబడిలో ఇద్దరు సభ్యులు రూ.1.72 లక్షలు సొంత ఖర్చులకు ఉపయోగించుకున్నట్టు సమాచారం. అఖిలభారత స్థాయిలో నిర్వహించే ప్రదర్శనకు ఉపకరించేందుకు సభ్యులు అంతర్జాతీయ ప్రదర్శనలకు వెళ్లటం ఆనవాయితీ. కొందరు సభ్యులు కుటుంబంతో కలసి ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌ చుట్టొచ్చారు. తాజాగా జోర్డాన్‌, ఈజిప్ట్‌, టర్కీ, యూరఫ్‌  విదేశీ విహారాలకు వెళ్లొచ్చారు. దీనికోసం సభ్యులు వెచ్చించిన సొమ్ము అక్షరాలా రూ.67 లక్షలు. ఇదంతా ప్రదర్శన ద్వారా సమకూరిన ఆదాయం నుంచే ఖర్చు చేయటం గమనార్హం. సందర్శకులను ఉత్సాహపరిచేందుకు ఏటా నిర్వాహకులు బహుమతులు అందజేస్తుంటారు. ఇందుకు కొన్ని కార్పొరేట్‌ సంస్థలు కూపన్లు అందజేస్తుంటాయి. ఈ ఏడాది ఓ ప్రముఖ సూపర్‌ మార్కెట్‌ సంస్థ ఇచ్చిన సుమారు రూ.9,68,500 కూపన్లు కొందరు సభ్యులు, భార్యాభర్తలు సొంతం చేసుకోవటం విశేషం. ప్రదర్శన జరిగిన 46 రోజులపాటు సభ్యులు భోజన ఖర్చులకు ఏకంగా రూ.21 లక్షలు ఖర్చు చేశామని లెక్కలు చూపారు. ఏటా సందర్శకులను అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. గతేడాది కేవలం ఒక్కరోజు సినీతారను ఆహ్వానించి రూ.10.75 లక్షలు వెచ్చించారు.

చదువుల సొమ్ముకు రెక్కలు
సొసైటీ ఆధ్వర్యంలో 11 కళాశాలలు నడుస్తున్నాయి. వీటిలో లాల్‌బహదూర్‌ కళాశాల (వరంగల్‌)కు కేటాయించిన నిధులు పక్కదారి పట్టినట్లు సొసైటీ సభ్యుడు ఒకరు యూజీసీ కమిటీకు ఫిర్యాదు చేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనిపై యూజీసీ విచారణ చేపట్టినట్లు సమాచారం. కస్తూర్బా కాలేజ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (మారేడుపల్లి)కు కేటాయించిన రూ.60 లక్షలపై కూడా నీలినీడలు అలుముకున్నాయి. కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (కల్వకుర్తి)కు మౌలిక సదుపాయాల పేరిట రూ.90 లక్షలు మళ్లించినట్లు సమాచారం. ఒక శ్రీవెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (సూర్యాపేట) విద్యాసంస్థలోనూ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే సొసైటీలో ఎలాంటి అక్రమాలకు జరగలేదని అన్నింటికీ లెక్కలున్నాయని ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి అన్నారు.

అగ్గి రాజుకుంటే..
వాస్తవానికి ఈ స్థలం కేవలం 1500-1600 దుకాణాలకు మాత్రమే సరిపోతుంది. అగ్నిప్రమాపక శకటం తిరిగేందుకు వీలుగా మార్గం ఉండాలి. అయితే నిర్వాహకులు నిబంధనలకు తిలోదకాలిచ్చి, అధిక ఆదాయంపై దృష్టి సారించి 2500-2900 దుకాణాలు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో సంభవించిన అగ్నిప్రమాదంలో సుమారు 200 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. బాధితులకు నష్టపరిహారంగా కొందరికి చెక్కులు ఇచ్చిన ఎగ్జిబిషన్‌ సొసైటీ.. కొందరి నుంచి ఆ చెక్కులను తిరిగి తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఇనుప సామగ్రిని విక్రయించగా రూ.11 లక్షలు వచ్చినా వాటిని లెక్కల్లో చూపకపోవటం గమనార్హం. ఇక వచ్చే జనవరిలో నుమాయిష్‌ నిర్వహణ, దుకాణాల కేటాయింపులకు అధికార యంత్రాంగం నివేదిక రూపొందించింది. అగ్నిమాపకశాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసు యంత్రాంగం అనుమతులు రాకుండానే ప్రదర్శన సమయం ప్రకటించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరిగితే శకటాలు వచ్చేలోగా మంటలార్పేందుకు రూ.24,84,834 అగ్నిమాపక యంత్రాలు కొనుగోలు చేసినట్లు ఖర్చుల్లో చూపారు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.