close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

బ్యాంకుల విలీనం సరికాదు

పట్టుబట్టి ప్రభుత్వ ఉద్యోగాల సాధన

- ఎర్రుపాలెం, న్యూస్‌టుడే

పేదరికంలో పుట్టి ప్రణాళికాబద్ధంగా చదివారు. తీవ్ర పోటీ మధ్య ప్రభుత్వ కొలువులు సాధించి మిగతా యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ఈ యువకులు. ప్రభుత్వ ఉద్యోగులుగా కొలువులు సాధించిన పేదింటి ప్రతిభా సుమాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...

ఆర్మీ పోస్టల్‌ అధికారిగాఎంపికైన పవన్‌కుమార్‌...

ఎర్రుపాలెంకు చెందిన పెనుమల్లి వీరభద్రం, కళావతి దంపతుల చిన్న కుమారుడు పవన్‌కుమార్‌. ఉత్తమ మార్కులతో పది, ఇంటర్‌ చదివిన పవన్‌కుమార్‌ డిగ్రీ పూర్తయ్యాక ఆర్మీ తపాలా అధికారిగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 18 ఆర్మీ అధికారి పోస్టులకు 5000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ పోటీలో 5వ ర్యాంక్‌ సాధించిన పెనుమల్లి పవన్‌కుమార్‌ ఆర్మీ పోస్టల్‌ అధికారిగా ఉద్యోగం సాధించారు. నాగ్‌పూర్‌లో శిక్షణ తీసుకుని, రాజస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తాను పోటీ పరీక్షలకు సంబంధించి ఆర్‌ఎస్‌.అగర్వాల్‌ పుస్తకాలతో పరీక్షకు సిద్ధమయ్యానని తెలిపారు. పత్రికల్లో వచ్చిన జనరల్‌ స్టడీస్‌, ఐసెట్‌ కోచింగ్‌ తరగతులు ఈ ఆర్మీ తపాలా ఉద్యోగ సాధనకు ఉపయోగపడ్డాయని చెప్పారు. యువత కష్టపడి సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదంటున్నారు.

పేదరికం నుంచి సీఐగా బాబూరావు

ఎర్రుపాలెం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన కోట కృష్ణయ్య, వజ్రమ్మల పెద్ద కుమారుడైన బాబూరావు స్వగ్రామంలో ఐదో తరగతి వరకు చదివారు. పదో తరగతి దమ్మపేట గురుకుల పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ పాల్వంచ గురుకుల కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. డిగ్రీ ఖమ్మంలో కవితా కళాశాలలో చదివారు. కేయూలో పీజీ చదువుతూ 2009లో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి, రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎస్సైగా శిక్షణ పొంది తొలుత సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఎస్సైగా విధులు నిర్వహించాడు. ఇటీవల పదోన్నతితో పెద్దపల్లి సీఐగా బాధ్యతలు చేపట్టారు బాబూరావు. పట్టుదలతో చదివితే ఏదైనా సాధ్యమేనని అంటారు ఈయన. చిన్ననాటి నుంచే లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. తాను హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ అనంతరం అకాడమీ పుస్తకాలతో సిద్ధమైనట్లు తెలిపారు.

ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఎక్సైజ్‌ ఎస్సైగా...

ఎర్రుపాలెం మండలంలోని పెద్దగోపవరం గ్రామానికి చెందిన ఇనుపనూరి పాపయ్య, కమలమ్మలకు పెద్ద కుమారుడు అశోక్‌కుమార్‌. ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివి 2008లో డీఎస్సీ ద్వారా బంజర పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. అనంతరం గ్రూప్‌-2కు దరఖాస్తు చేసి, 2011 అక్టోబర్‌లో పరీక్ష రాశారు. అనంతరం వెలువడిన ఫలితాల్లో 335(500) మార్కులు సాధించి ఎక్సైజ్‌ ఎస్సైగా ఉద్యోగం పొందారు. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్‌-2 పరీక్షకు అకాడమీ పుస్తకాలు సేకరించానని అశోక్‌కుమార్‌ చెబుతున్నారు. రోజుకు 6 గంటలు చదివానని, ప్రణాళికాబద్ధంగా చదివి ఎక్సైజ్‌ ఎస్సైగా ఉద్యోగం సాధించానన్నారు. ప్రతి విద్యార్థి అకాడమీ పుస్తకాలతో పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చంటున్నారు. ఎప్పటికప్పుడు మోడల్‌ పేపర్‌లతో పరీక్షించుకోవాలని చెప్పారు.

పేద కుటుంబం నుంచి ఏఈగా ఉదయ్‌కుమార్‌...

మీనవోలు గ్రామానికి చెందిన నండ్రు భిక్షాలు, గోపమ్మల కుమారుడు ఉదయ్‌కుమార్‌. చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసించి పదో తరగతిలో ఉత్తమ మార్కులు తెచ్చుకున్నారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించి 2014లో ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేశారు. 2015లో ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌కు కోచింగ్‌ తీసుకుని ఏఈ పోస్టుకు దరఖాస్తు చేశారు. 2015లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 170 ఏఈ పోస్టులకు 30 వేల మంది దరఖాస్తు చేయగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉదయ్‌కుమార్‌ ఎస్సీ విభాగంలో 2వ ర్యాంక్‌ సాధించారు. 3 పోస్టులకు(ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ, జెన్‌కో) అర్హత సాధించిన ఉదయ్‌కుమార్‌ 2016 ఫిబ్రవరి 29న కేటీపీఎస్‌లో ఏఈగా ఉద్యోగం పొందారు. తాను ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక దిల్లీలోని మేడ్‌ ఇన్‌ ఈసీలో ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌కు 8 నెలలు శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు ఉదయ్‌. ఆ కోచింగ్‌ మెటీరియల్‌, ‘ఈనాడు’ ప్రతిభ పేజీలు పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడ్డాయంటారు. రోజూ పది గంటలు చదివానని, జనరల్‌ స్టడీస్‌, విషయాల సేకరణకు నెట్‌ను ఉపయోగించానని వివరించారు. అంతర్జాలంలో సేకరించిన అంశాలను రాసుకొని పరీక్షలకు సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.