close

సోమవారం, డిసెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

గులాబీ గూటిలో అంతర్గత పోరు

పాలేరులో వివాదం రేపిన కమిటీల ప్రకటన

ఎమ్మెల్యే కందాలకు వ్యతిరేకంగా అసంతృప్తి

నేతల రహస్య సమావేశం

ఖమ్మం గ్రామీణ మండలంలో సమావొేశమైన తెరాస నాయకులు

ఈనాడు, ఖమ్మం: పాలేరు నియోజకవర్గంలో తెరాస రెండు వర్గాలుగా విడిపోయిందా? నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయడం లేదా? అంటే ‘అవును’ అనే సమాధానమే వినిపించేది.. తాజాగా నాలుగు మండలాల్లో పార్టీ మండల, అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాటు రెండు వర్గాల మధ్య విభేదాలను మరింత పెంచిపోషించాయి. ఈ పరిణామాలు రాజకీయంగా ఉభయ జిల్లాల్లో చర్చనీయాంశంగా మారాయి.. పాలేరు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో రెండు వర్గాల మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇదేదో నిన్న, మొన్నటినుంచి వస్తున్న స్పర్థలు అనుకుంటే పొరబాటే. 2018 డిసెంబరులో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కందాళ ఉపేందర్‌రెడ్డి నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కందాళ విజయం సాధించారు. అనంతరం ఈ ఏడాది మార్చి 14న కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు ఎమ్మెల్యే కందాళ ప్రకటించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ నుంచి చేరిన సభ్యులను తెరాస వారిగా గుర్తిస్తామని జూన్‌ 6న వెల్లడించారు. నాటి నుంచి కందాళ తెరాస సభ్యుడిగా కొనసాగుతున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉంటూ వచ్చిన కందాళ తెరాసలో ఉన్న నేతలు, కార్యకర్తలను కలుపుపోవడం లేదన్న ఆరోపణలు ఎదురయ్యాయి. అయితే అవి బయటకు కనిపించలేదు. వినిపించలేదు. ఈ క్రమంలో జడ్పీటీసీ సభ్యత్వానికి, ఎంపీటీసీ సభ్యత్వాలకు ఎన్నికలు వచ్చాయి. పార్టీ అధిష్ఠానం బి-ఫారాల అందజేత బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించింది. పార్టీలో ఉన్న ఇతర ముఖ్య నేతలతో చర్చించి సమన్వయంతో బి-ఫారాలు అందించాలని ఆదేశించింది. మిగతా నియోజకవర్గాల మాదిరిగా పాలేరులో జరగలేదు. తిరుమలాయపాలెం జడ్పీటీసీ సభ్యత్వానికి పార్టీ టికెట్‌ ఆశించిన రామసహాయం నరేశ్‌రెడ్డికి నిరాశ ఎదురైంది. నరేశ్‌రెడ్డి కాదని ఎమ్మెల్యే క్రాంతికుమార్‌ అనే వ్యక్తికి తెరాస బి-ఫారం అందించారు. నరేశ్‌రెడ్డి వర్గీయులు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిశారు. సమన్వయంతో వెళ్లాలని బుజ్జగించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జడ్పీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. ఎంపీటీసీ సభ్యత్వ స్థానాలకు కూడా ఎమ్మెల్యేకు నచ్చిన, మెచ్చిన వారికే ఇచ్చారన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటనలకు వచ్చినా తమకు కనీస సమాచారం లేదన్న అసంతృప్తి వైరివర్గంలో ఏర్పడింది. ఇదే సమయంలో తాజాగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పార్టీ, అనుబంధ సంఘాల కమిటీలు వేయడంతో ఎమ్మెల్యే వ్యతిరేకులకు పుండుమీద కారం చల్లినట్టయ్యింది.

చిచ్చు రాజేసిన కమిటీలు..

పార్టీ, అనుబంధ సంఘాల కమిటీల విషయంలో ఎమ్మెల్యే తనతో ఉన్న, ఉంటున్న వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, ఒకపుడు ఆయా మండలాల్లో ముఖ్య నేతలుగా ఉన్న వారిని పక్కన పెట్టడంతో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. ఈ నెల 12న నాలుగు మండలాల పార్టీ కమిటీలు, వాటి అనుబంధ సంఘాల కమిటీలను ఎమ్మెల్యే ప్రకటించారు. అసంతృప్తివాదులందరూ బుధవారం రాత్రి ఖమ్మం గ్రామీణ మండలంలోని ఓ ఫంక్షన్‌ హాలులో సమావేశం అయ్యారు. సుమారు గంటన్నరకు పైగా నాలుగు మండలాల ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తామంతా తుమ్మల నాగేశ్వరరావు వెంట ఉంటున్నామనే కమిటీలో అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. విలీన గ్రామ పంచాయతీల నేతలకు ఖమ్మం గ్రామీణ మండలంలో అవకాశం కల్పించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలను కేటీఆర్‌కు వివరించాలని నిర్ణయించారు. సమావేశంలో ఖమ్మం గ్రామీణ మండలం నేతలు మద్ది మల్లారెడ్డి, కార్పొరేటర్‌ ధరావత్‌ రామ్మూర్తినాయక్‌, పంతులునాయక్‌, చంద్రశేఖర్‌, ఉపేందర్‌, తిరుమలాయపాలెం నుంచి రామసహాయం నరేశ్‌రెడ్డి, కూసుమంచి మాజీ ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, రవికుమార్‌, పార్టీ (మాజీ) మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, నేలకొండపల్లి మండలం నుంచి నెల్లూరి భద్రయ్య, వెన్నపూసల సీతారాములు, మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.