close

శనివారం, డిసెంబర్ 07, 2019

ప్రధానాంశాలు

పథం మారేనా.. ఫలం చేరేనా?

రేషన్‌కార్డుల్లో చేరికలు, తొలగింపులపై ఆంక్షలు

విద్యార్థుల తల్లిదండ్రుల్లో ‘అమ్మఒడి’ గుబులు

 

న్యూస్‌టుడే, పుట్టపర్తి గ్రామీణం

 

వివరాల నమోదుకు మీసేవా కేంద్రం వద్ద పడిగాపులు

 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబం యూనిట్‌గా గుర్తిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారి కుటుంబాల వివరాలు తొలగించి కొత్తకార్డు తీసుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అర్హత ఉన్నా కుటుంబం నుంచి వేరుపడి కార్డులో నమోదు కాక అనర్హులుగా మిగిలిపోతున్నారు. గత నాలుగు నెలలుగా మార్పులు, చేర్పులకు అవకాశం లేక ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు.

ప్రతి పాఠశాలలోనూ రేషన్‌ కార్డుల్లో నమోదు కాని పిల్లలు పదుల సంఖ్యలో ఉన్నారు. వీరంతా కార్డుల్లో పిల్లల వివరాల నమోదుకోసం మీసేవా కేంద్రాలకు వచ్చిన కార్డుదారులు. పిల్లలకు ఆధార్‌ ఉన్నా ఈకేవైసీ సమస్యతో రేషన్‌ కార్డుల్లో నమోదు కాలేదు. రెండు నెలలుగా జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ నమోదు, సాధికార సర్వే, ఈకేవైసీ ఇలా అన్ని సిద్ధం చేసుకుని మీ సేవా కేంద్రాల్లో నమోదుకు వస్తే రేషన్‌ కార్డుల్లో చేర్పులు, మార్పులు, ఇతరత్రా వంటి నాలుగు రకాల సేవలు రద్దు చేశారని తెలిసి నిరాశ చెందుతున్నారు.

అవగాహన లేక.. నమోదు చేసుకోక..

జిల్లావ్యాప్తంగా మీసేవా కేంద్రాల్లో రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులను ప్రభుత్వం ఆపేసింది. ఇటీవల ప్రభుత్వం అమ్మఒడి పథకం ప్రకటించింది. ఈ నిధులు తల్లుల ఖాతాలకు జమ కావాలంటే పిల్లల వివరాలు రేషన్‌కార్డుల్లో నమోదై ఉండాలి. దీంతో అమ్మఒడి పథకంలో అర్హత పొందేందుకు అనేక మంది వారి బిడ్డల వివరాలను కార్డుల్లో నమోదు చేయించుకునేందుకు మీసేవ, రెవెన్యూ, నగర, పురపాలికల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అర్థంతరంగా చేరికల ప్రక్రియను నిలుపుదల చేయడంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. పేదలు ఆధార్‌ పత్రం ఉంటే రేషన్‌కార్డులో నమోదు చేసుకోవచ్ఛు అవగాహనలేక ఇప్పటికీ అనేక గ్రామాల్లో బిడ్డలకు 12 ఏళ్లు దాటుతున్నా రేషన్‌కార్డులకు ఎక్కని పరిస్థితి. అమ్మఒడి పథకం అమల్లోకి రానుందని తెలుసుకుని ఇప్పుడు కార్డుల్లో నమోదుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో మీసేవా కేంద్రాల్లో కార్డుల్లో చేరికలను నిలిపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆగిన ఆ సేవలు ఏవంటే...

*మీసేవా కేంద్రాల్లో రేషన్‌ కార్డులకు సంబంధించి వివిధ రకాల సేవలను పౌరసరఫరా శాఖ స్తంభింపజేసింది.

* రేషన్‌ కార్డుల్లో సభ్యుల చేరిక,

*అదనంగా ఉన్నా, చనిపోయినా ● పెళ్లయి అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లల పేర్ల తొలగింపు.

*రేషన్‌ కార్డులు ఇతర జిల్లాలు, మండలాలకు మార్పులు చేయడం, ● పత్రాల మైగ్రేషన్‌ (ఎడిషన్‌, డిలీషన్‌, ట్రాన్స్‌ఫర్‌, మైగ్రేషన్‌, సరెండర్‌) వంటి సేవలను రద్దు చేశారు.

6.87 లక్షల మందికి అమ్మఒడి

ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఇంటర్‌ వరకూ చదివే విద్యార్థులకు వర్తింపజేసింది. జిల్లాలో మొత్తం 5,115 పాఠశాలల్లో 6.15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 4.61 లక్షల మంది తల్లులకు తెల్లరేషన్‌కార్డులు ఉన్నాయి. 150 కళాశాలల్లో 72 వేల మంది ఇంటర్‌ చదువుతున్నారు. వీరిలో 59 వేల మందికి తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి.

నిలుపుదల తాత్కాలికమే

వార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ల మ్యాపింగ్‌ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో రేషన్‌ కార్డుల్లో చేర్పులు, మార్పిలు, తొలగింపులు, కార్డు బదిలీ వంటి సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు సేవలు అందుబాటులోకి రావు.

- భానుమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు, మీసేవా నిర్వాహకుల సంఘం

ప్రభుత్వ పరిధిలో ఉంది

రేషన్‌ కార్డుల్లో కొన్ని సేవల రద్దు ప్రభుత్వ పరిధిలో ఉంది. డిసెంబరు లేదా జనవరిలో ప్రభుత్వం కొత్తగా రేషన్‌ కార్డులను జారీ చేయనుంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం చేర్పులు, మార్పులు, సవరణలు, సమర్పణలు, తొలగింపులు, బదిలీల వంటి సేవలను రద్దు చేసింది. నవంబరులో సేవల రద్దు ఉపసంహరిస్తామని చెప్పారు. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కొత్త కార్డుల జారీలోపే స్పష్టత రావచ్ఛు

- శివశంకర్‌రెడ్డి, డీఎస్వో

ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు

అమ్మఒడి పథకం జనవరి 9 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పథకం అమలుకు సంబంధించి విధివిధానాలు రాలేదు. రేషన్‌ కార్డులో పిల్లల వివరాల నమోదు కాకపోయినా పథకం వర్తిస్తుందని మౌఖికంగా సమాచారం. ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

- శామ్యూల్‌, జిల్లా విద్యాశాఖాధికారి

 


 

‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న పిల్లలు వెంగళమ్మచెరువు ప్రాథమిక పాఠశాలలో 8 మంది ఒకటో తరగతి, మరో ఇద్దరు రెండో తరగతి చదువుతున్నారు. అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం రూ.15 వేలు తల్లిదండ్రుల ఖాతాలకు జమచేస్తామని ప్రకటించింది. రేషన్‌కార్డుల్లో నమోదై ఉన్న పిల్లలకు పథకం వర్తిస్తుంది. అయితే వీరంతా రేషన్‌ కార్డుల్లో నమోదు కాలేదు. నమోదు చేద్దామని మీసేవా కేంద్రాలకు వెళితే అక్కడ చేర్పులు, మార్పులు, బదిలీలు, సవరణ వంటి సేవలను రద్దు చేశారని సాధ్యపడదన్నారు. దీంతో తల్లిదండ్రులు అమ్మఒడి పథకం అందేనా అని ఆందోళన చెందుతున్నారు.’’

 

 

ఇతను చంద్రశేఖర్‌. ఇతని కుమారుడు సాయికుమార్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు అందుతాయనే ఆశతో కుమారుడి పేరు రేషన్‌ కార్డులో చేర్పించేందుకు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చాడు. అడిగితే ప్రస్తుతం రేషన్‌ కార్డుల్లో చేర్పులు, మార్పుల సేవలను ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగాడు.

 

 

ఇతని పేరు శ్రీరాములు. వెంకటగారిపల్లి. ఇతని కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈమె పేరు కార్డు నుంచి తొలగించక పోతే రేషన్‌ కార్డు రద్దు చేస్తారని చెప్పారు. దీంతో మీసేవా కేంద్రంలో పేరు తొలగించాలని అర్జీ ఇస్తే ప్రస్తుతం మార్పులు చేర్పుల సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేశారని చెప్పడంతో తహసీల్దార్‌ కార్యాలయానికి వస్తే ప్రభుత్వ అనుమతి ఇచ్చినప్పుడు చేసుకోవాలని సూచించారు.

 

జిల్లాలో పాఠశాలలు : 5,115

మొత్తం విద్యార్థులు : 6,14,714

ప్రభుత్వ పాఠశాలలు : 3880

విద్యార్థులు : 3,54,396

ప్రైవేటు పాఠశాలలు: 1,235

విద్యార్థులు : 2,60,318

ఇంటర్‌ కళాశాలలు : 150

విద్యార్థులు : 72,000

ప్రభుత్వ కళాశాలలు : 45

ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు : 105

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.