close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

ఆ ‘రెండు’ కేసులూ అంతేనా!

తహసీల్‌దార్‌ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు మృతి
ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ శేఖర్‌ మరణం
ఈనాడు,హైదరాబాద్‌

‘‘నవంబరు 4, 2019 అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్‌దార్‌ కార్యాలయం.. మధ్యాహ్నం 1.40 గంటలు... తహసీల్‌దార్‌ విజయారెడ్డిపై గౌరెల్లికి చెందిన కూర సురేష్‌ పెట్రోల్‌ పోసి నిప్పటించాడు... మంటలు ఆమె శరీరమంతా వ్యాపించడంతో తన గదిలోంచి బయటకు వచ్చిన ఆమె వేడికి తాళలేక కుప్పకూలిపోయింది... అక్కడిక్కడే మృతి చెందింది...’’

‘‘నవంబరు 11, 2019 కాచిగూడ రైల్వేస్టేషన్‌... ఉదయం 10.30గంటలు..  కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొంది... 18 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన లోకోపైలట్‌ శేఖర్‌ను ఏడున్నర గంటలు కష్టపడి బయటకు తీశారు...’’

- తెలుగు రాష్ట్రాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి సంచలనం సృష్టించిన సంఘటనలివి.

 

 

రెండు సంఘటనల మధ్య సరిగ్గా వారం రోజుల వ్యవధిలో జరిగాయి. పోలీసులు ఈ రెండు ఘటనలపై ఆయా పోలీస్‌ ఠాణాల పరిధుల్లో కేసులు నమోదు చేశారు. తహసీల్‌దార్‌ విజయారెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు కూర సురేష్‌ కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఉస్మానియా ఆసుపత్రిలో మరణించాడు. రైల్వే ప్రమాదంలో నిందితుడు ఎంఎంటీఎస్‌ లోకో పైలెట్‌ శేఖర్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ రెండు కేసుల్లో ప్రధాన నిందితులు చనిపోవడంతో పోలీస్‌ దర్యాప్తు అక్కడికి ఆగిపోయే అవకాశాలున్నాయి. కోర్టులో అభియోగపత్రాలు మోపిన తర్వాత ‘యాక్షన్‌ డ్రాప్‌డ్‌’ అంటూ కేసులు అటకెక్కనున్నాయి.

బలమైన సాక్ష్యాధారాలుంటే...
ఎమ్మార్వో విజయారెడ్డి హత్యోదంతం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కలకలం సృష్టిస్తోంది. కొందరు రైతులు, ఇతర వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాలకు పెట్రోలు సీసాలతో వెళ్తున్నారు. న్యాయం చేయాలంటూ కొందరు ఆత్మాహత్యాయత్నాలు చేస్తుంటే... మరికొందరు ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై పెట్రోల్‌ చల్లి చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇక విజయారెడ్డి హత్యకేసు విషయానికొస్తే... ప్రధాన నిందితుడు సురేష్‌ చనిపోయినందున తదుపరి దర్యాప్తు అతడి ఫోన్‌కాల్స్‌ డేటా... బ్యాంకుల లావాదేవీలకు సంబంధించిన రికార్డులపై ఆధారపడి ఉంటుంది. విజయారెడ్డిని చంపేందుకు సురేష్‌ను ఎవరైనా పావుగా వాడుకున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలంటే వారికి సరైన ఆధారాలు లభించాలి. ఫోన్‌లో సురేష్‌తో మాట్లాడినంత మాత్రాన వారు నిందితులవ్వరు. పోలీసులు పిలిచినప్పుడు మాత్రం విచారణకు హాజరై సురేష్‌కు, వారికున్న సంబంధాలను వివరిస్తారు. ఈ హత్య కేసులో ‘కుట్ర’కోణం ఉంటే అందుకు తగిన సాక్ష్యాధారాలను విచారణ అధికారులు సేకరించాలి. రెవెన్యూ అధికారులు చెప్పినట్టు వివాదాస్పద స్థలంపై హక్కులు సురేష్‌కు వస్తే పర్యవసానంగా ఎవరెవరికి లబ్ధి చేకూరనుంది అన్న అంశాలపై పోలీస్‌ అధికారులు లోతైన పరిశోధన చేయాలి. ఇవన్నీ లభిస్తే తప్ప కేసులో పురోగతి ఉండదని పోలీస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మానవ తప్పిదమంటూ చెప్పేశారు...
కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై రైల్వేస్టేషన్‌ అధికారులు ఎంఎంటీఎస్‌ లోకోపైలెట్‌ శేఖర్‌ బాధ్యుడంటూ అతడిపై ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగిన రోజే దక్షిణమధ్య రైల్వే అధికారులు ఈ ప్రమాదం మానవ తప్పిదం అంటూ ప్రకటించారు  రైల్వేపోలీసులు శేఖర్‌పై ఐపీసీ 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న శేఖర్‌ను బయటకు తీసి కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం కుదుట పడ్డాక విచారించాలని రైల్వే పోలీసు అధికారులు నిర్ణయించారు. క్యాబిన్‌లో ఇరుక్కున్నప్పుడే అతడికి అంతర్గతంగా తీవ్రగాయాలవడంతో కోలుకోలేక పోయాడు. శేఖర్‌ను బతికించేందుకు అతడి కాలును వైద్యనిపుణులు తీసేసినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాల ప్రభావంతోనే అతడు మరణించాడు. దీంతో అతడిని విచారించే సమయం పోలీసులకు లభించలేదు. ప్రమాదం ఎలా జరిగింది? ఆ సమయంలో మీరు ఎంత వేగంతో రైలును నడిపిస్తున్నారు? హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ హెచ్చరించినా మీరు వేగాన్ని ఎందుకు తగ్గించలేదు? అన్న ప్రశ్నలను పోలీసులు శేఖర్‌ను అడగాలనుకున్నారు. అతడు చనిపోవడంతో ఈ కేసును విచారణను ఇక్కడితో నిలిపేయనున్నారు. రైల్వేశాఖ పరంగా విచారణను కొనసాగించి అందుకు తగ్గ చర్యలను చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.