close

శనివారం, డిసెంబర్ 14, 2019

ప్రధానాంశాలు

మెట్రో ప్రయాణానికి.. ఏదీ భరోసా?

తరచూ సమస్యలు.. ప్రయాణికుల అసహనం

మెట్రో రైలు ప్రయాణంపై నగరవాసుల నమ్మకాలు క్రమంగా సడలుతున్నాయి. బస్సుల్లో, వాహనాల్లో వెళితే ఎప్పుడు, ఎక్కడ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతామో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో మెట్రో అందుబాటులోకి రావడంతో సమయానికి గమ్యస్థానం చేరుతామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇటీవలి అనుభవాలతో  ఇక్కడా భరోసా లేదని అంటున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

సాంకేతిక సమస్యలతో తరచూ మెట్రోరైళ్లు మొరాయిస్తున్నాయి. ప్రతిసారి కొత్త సమస్య తలెత్తుతోంది. మెట్రో ప్రారంభమై రెండేళ్లు కూడా కాలేదు.. అప్పుడే ఈ ఇబ్బందులేంటని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ లోపాలే ఇందుకు ప్రధాన కారణంగా కనపడుతోంది. మరమ్మతులు చేసేందుకు గంటల సమయం పడుతుండటంతో ఆ మార్గంలో నడిచే మెట్రో సర్వీసులపై ప్రభావం పడుతోంది. తాత్కాలికంగా సింగిల్‌ ట్రాక్‌లో నడుపుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా రద్దీ వేళల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంగళవారం ఘటనలో పావుగంటలో మరమ్మతులు పూర్తిచేసి యథాతథంగా నడుపుతామని అధికారులు చెప్పినా రెండు గంటలకుపైగా పట్టింది. ఇదివరకు ఎల్‌బీనగర్‌, మూసాపేట, బేగంపేటలోనూ మరమ్మతులకు గంటల తరబడి సమయం తీసుకుంటున్నారు.

ఏం జరుగుతోందో తెలియక..  నాగోల్‌ నుంచి అమీర్‌పేటకు మెట్రోలో అరగంటలో చేరుకోవచ్చు. కానీ ప్రతి స్టేషన్‌లో ఐదు నిమిషాలు ఆగుతూ.. గంటకు చేరుకుంటే.. అసలు ఏం జరిగిందో ప్రయాణికులకు చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా మెట్రో ఆగితే ఉప్పల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌రూం(ఓసీసీ)కు తెలిసిపోతుంది. లోకోపైలెట్‌ సమాచారం ఇస్తారు. ఈ విషయాన్ని వెంటనే ప్రయాణికులకు చేరవేస్తే గందరగోళ పరిస్థితులు తప్పుతాయి.

ఇప్పటివరకు తలెత్తిన సమస్యలివీ..
* కొద్దినెలల క్రితం అసెంబ్లీ స్టేషన్‌ వద్ద పైన బిగించిన పిడుగుల నిరోధానికి ఏర్పాటు చేసిన ఇనుపకడ్డీ ఊడి మెట్రో ట్రాక్‌పై పడటంతో రైలును నిలిపేశారు.
* కొద్దిరోజుల క్రితం మెట్రోలో పాము కలకలం సృష్టించింది. ప్రయాణికులను దింపేసి మెట్రోని డిపోకు చేర్చాల్సి వచ్చింది.
* గత ఏడాది మియాపూర్‌-భరత్‌నగర్‌ మధ్య ఓవర్‌హెడ్‌ విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి.
* బేగంపేట, మూసాపేట ప్రాంతాల్లో మెట్రో వయాడక్ట్‌పైన ఉన్న విద్యుత్తు తీగలపై ఫ్లెక్సీలు పడ్డాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.