close

బుధవారం, అక్టోబర్ 28, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సర్‌‘కారు’వే.. పంచ పురాలు

మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాస విజయకేతనం

ఈనాడు, ఖమ్మం

పురపాలక ఎన్నికల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగరేసింది. ఉభయ జిల్లాల్లోని అయిదు మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకొని పట్టణాల్లో కారు వీర విహారం చేసింది. అధికార పార్టీకి ఎక్కడా కూడా విపక్షాలు గట్టి పోటీనివ్వలేకపోయాయి. కారు జోరుకు విపక్షాలు కుదేలయ్యాయి. సత్తుపల్లి పురపాలకంలో ఒక్కటి (స్వతంత్ర అభ్యర్థి) మినహా మిగిలినవన్నీ తెరాస ఖాతాలోనే పడ్డాయి. ఇక్కడ విపక్షాలకు ఘోర పరాజయం తప్పలేదు. కొత్తగూడెంలో సీపీఐ ఎనిమిది వార్డుల్లో విజయం సాధించగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో కూటమి ఎనిమిది స్థానాలు సాధించడమే వారికి ఊరట.

ఉభయ జిల్లాల్లోని అయిదు పురపాలకాల 125 వార్డుల్లో 94 వార్డుల్లో తెరాస విజయం సాధించింది. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా 09 స్థానాలతో సీపీఐ, ఆ తర్వాత 07 స్థానాలతో కాంగ్రెస్‌, 03 స్థానాలతో తెదేపా, 02 స్థానాల్లో సీపీఎం గెలుపొందాయి. 10 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు తమ సత్తా చాటడం విశేషం.

పురపోరులో గులాబీ జెండా గుబాళించింది. ‘కారు’ టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు పురపాలకాలు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల్లో అధికార పీఠాలను చేజిక్కించుకొన్నాయి. పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన తెరాస అదే ఒరవడిని కొనసాగించాయి. అన్నిచోట్ల ఛైర్మన్‌ పీఠం దక్కించుకోదగ్గ సంఖ్యలో వార్డులను గెలుచుకుంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అభ్యర్థుల విజయాలకు బాటలు వేశాయి. విపక్షాల్లోని ఏ పార్టీ కూడా రెండంకెల సంఖ్యను దాటకపోవడం గమనార్హం. తెరాస అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు కృషి చేశారు. అయిదు పురపాలకాల్లోని 125 స్థానాల్లో 75 శాతం వార్డులు గెలవడంతో తెరాస శ్రేణులు విజయోత్సవాల్లో మునిగి తేలారు. మధిరలో ఫలితాలు అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించాయి. కౌంటింగ్‌ చివరి వరకు ఫలితాలు తేలలేదు. చివరకు తెరాసకే విజయం దక్కింది.

ఖమ్మం తెరాస కార్యాలయంలో బాణసంచా కాలుస్తున్న మంత్రి అజయ్‌కుమార్‌, ఇతర నాయకులు

గూడెంలో సత్తా చాటిన సీపీఐ

సీపీఐ సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఆ పార్టీ సత్తా చాటింది. ఇక్కడ ఎనిమిది వార్డుల్లో విజయం సాధించింది. స్థానికంగా సీపీఐ, కాంగ్రెస్‌, తెదేపా, సీపీఎం పొత్తు పెట్టుకున్నాయి. తెదేపా, సీపీఎంకు సీట్లు దక్కలేదు. కాంగ్రెస్‌ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు రెండు చోట్ల విజయం సాధించారు. తెరాస తర్వాత ఎక్కువ వార్డులు సీపీఐ గెలుచుకోవడం విశేషం. అందులో ఎనిమిది స్థానాలు కొత్తగూడెంలో ఉండగా.. ఇల్లెందులో మరో స్థానాన్ని దక్కించుకొంది. ఖమ్మం జిల్లాలోని మూడు పురపాలకాల్లో సీపీఐకి ఒక్కస్థానం దక్కలేదు. ఇల్లెందు పురపాలకంలో స్వతంత్రులు నాలుగు చోట్ల విజయం సాధించారు. వీరిలో తెరాస రెబల్స్‌ ముగ్గురు ఉండటం గమనార్హం. తాజా మాజీ ఛైర్‌పర్సన్‌ మడత రమ 8వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించగా.. ఆమె భర్త వెంకటగౌడ్‌ 11వ వార్డులో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. స్వతంత్రుల్లో మరో స్థానం న్యూడెమోక్రసీ గెలుచుకుంది. వైరాలో కాంగ్రెస్‌ 02 స్థానాలకు పరిమితమైంది. సీపీఎం ఒక స్థానంలో గెలువగా.. స్వతంత్ర అభ్యర్థులు రెండు చోట్ల గెలిచారు. సత్తుపల్లిలోని ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మధిరలో కూటమికి ఎనిమిది సీట్లు వచ్చాయి. వీటిలో కాంగ్రెస్‌ 04, తెదేపా 03, సీపీఎం 01 ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తెరాస రెబల్‌ ఫలితాల తర్వాత తెరాసలో చేరిపోయారు.

మధిరలోనే గట్టి పోటీ..

తెరాసకు మధిరలోనే గట్టి పోటీ నెలకొంది. ఆ తర్వాత కొత్తగూడెం అనే చెప్పవచ్ఛు ‘నువ్వా.. నేనా’ అన్నట్లుగా ప్రతిరౌండ్‌లోనూ ఫలితాలు రావడం విశేషం. మూడు రౌండ్‌లుగా సాగిన లెక్కింపులో మొదటి రెండు రౌండ్లలోనూ తెరాసకు, కూటమికి మధ్య రెండు, మూడు సీట్లు మాత్రమే తేడా ఉండటం విశేషం. మూడో రౌండ్‌ వచ్చే సరికి తెరాసకు స్పష్టమైన మెజారిటీ రావడంతో కూటమి ఒక్కసారిగా డీలా పడిపోయింది. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, తెదేపా ఖమ్మం జిల్లా కన్వీనర్‌ వాసిరెడ్డి రామనాథం తదితరులు కూటమి గెలుపు కోసం శ్రమించినా ఫలితం దక్కలేదు. చివరి రౌండ్‌ ముగిసే సరికి 22 సీట్లలో తెరాసకు 13 వార్డులు రావడంతో తెరాస నేతలు ఊపిరి పీల్చుకున్నారు. తెరాస నేత, ఖమ్మం జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు ఎన్నికలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. చివరకు పూర్తిస్థాయిలో ఫలితాలు రాకపోవడంతో తెరాస రెబల్‌గా గెలిచిన వ్యక్తిని కూడా తెరాస నేతలు తమవెంట తీసుకువెళ్లడం విశేషం.

కొత్తగూడెంలో గులాబీ శ్రేణుల విజయోత్సాహం

తెరాస సంబురాలు..

ఉభయ జిల్లాల్లోని అయిదు మున్సిపాలిటీల్లోనూ అధికారాన్ని దక్కించుకోవడంతో తెరాస శ్రేణుల్లో విజయోత్సవం నెలకొంది. ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. ఈ సందర్భంగా గెలుపుపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ‘కారు.. సారు.. సర్కారు’ కావాలంటూ పురప్రజలు కూడా కోరుకుంటున్నారని మరోసారి రుజువైందని వెల్లడించారు. మధిరలో జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్‌, నేతలు బొర్రా రాజశేఖర్‌, ఎస్‌.జైపాల్‌, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో బానోతు హరిప్రియ తదితరులు సంబరాల్లో పాల్గొని శ్రేణులను ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చడంతోపాటు పరస్పరం రంగులు చల్లుకుంటూ కాలనీల్లో ప్రదర్శన నిర్వహించడం తాజా పరిణామం.

పురపోరు ప్రత్యేకతలు ఇవీ..

* మధిరలో నాలుగో వార్డుకు మూడు సార్లు రీకౌంటింగ్‌ నిర్వహించారు. మూడుసార్లు తెరాసనే గెలిచింది

* వైరాలోని 10 వార్డుకు రెండుసార్లు రీకౌంటింగ్‌ చేయగా.. రెండుసార్లు సీపీఎందే విజయం

* ఇల్లెందులో తాజా మాజీ ఛైర్‌పర్సన్‌ మడత రమ విజయం సాధించగా.. ఆమె భర్త వెంకటగౌడ్‌ ఓటమి పాలయ్యారు.

* సత్తుపల్లిలో తొమ్మిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

* 77 స్థానాల్లో కమలం(భాజపా) పోటీ చేసినా.. ఎక్కడా కూడా వికసించలేదు.

* ఖమ్మం జిల్లాలోని మూడు పురపాలకాల్లో సీపీఐకి ప్రాతినిధ్యం దక్కలేదు. సీపీఎం రెండు వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

* 68 స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తే ఏడు స్థానాలతో సరి పెట్టుకొంది.

* స్వతంత్రులు 152 చోట్ల పోటీ పడితే 10 చోట్ల విజయం సాధించారు.

* మధిర, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో తాజా మాజీ ఛైర్‌పర్సన్లు మొండితోక నాగరాణి, పులిగీత, మడత రమ విజయం సాధించారు.

* సత్తుపల్లి పురపాలక తాజా మాజీ ఛైర్‌పర్సన్‌ డి.స్వాతి ఎన్నికల్లో పోటీ చేయలేదు.


ఇల్లెందు స్వతంత్ర అభ్యర్థులు తెరాసలో చేరిక

తెరాస కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: పురపాలక ఎన్నికల్లో భాగంగా ఇల్లెందులో స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన కొనకంచి పద్మ, పత్తి స్వప్న శనివారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమక్షంలో తెరాసలో చేరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో వారు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ అభివృద్ధి కాంక్షించే వారికి తెరాసలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, పార్టీ నాయకులు తాతా మధు, నూకల నరేష్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు దిండిగల రాజేందర్‌, తెరాస నగర అధ్యక్షుడు కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.