close

బుధవారం, ఫిబ్రవరి 26, 2020

ప్రధానాంశాలు

ప్రశాంతంగా రీపోలింగ్‌

68.28 శాతం నమోదు

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

కామారెడ్డి 41వ వార్డు పరిధిలోని 101 పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వరుస కట్టిన ఓటర్లు

ఈ నెల 22న జరిగిన పుర ఎన్నికల్లో టెండర్‌ ఓటు నమోదు కావడంతో జిల్లా కేంద్రంలో 41వ వార్డులోని 101వ పోలింగ్‌ కేంద్రంలో శుక్రవారం రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు పోలింగ్‌ నిర్వహించారు. 68.28 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ నెల 22న జరిగిన ఎన్నికల్లో 65.17 శాతం ఓట్లు పోలయ్యాయి. రీపోలింగ్‌ సందర్భంగా కేంద్రానికి నలువైపులా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా పాలనాధికారి సత్యనారాయణ, ఎస్పీ శ్వేత పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అన్ని వివరాలు సరి చూశాకే ఓటు వేయడానికి అనుమతిచ్చారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు బందోబస్తు చేపట్టారు. పోలింగ్‌ జరిగే కేంద్రాన్ని ఇన్‌ఛార్జి కమిషనర్‌ శైలజ పరిశీలించారు.

ఒకే వ్యక్తికి రెండు కేంద్రాల్లో
ఈ నెల 22న 103వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన ఓటరు శుక్రవారం మళ్లీ ఓటేయడానికి వచ్చారు. దీంతో ఆయన వివరాలు పరిశీలించి ఓటు వేయడానికి అధికారులు నిరాకరించారు. ఓటరు జాబితాలో తప్పిదాలు దొర్లడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. పురపాలక అధికారులు ఓటరు జాబితా సవరణను పకడ్బందీగా చేపట్టకపోవడంతో చాలా కేంద్రాల్లో ఒకే వ్యక్తికి రెండు నుంచి మూడు ఓట్లు వచ్చాయి.


కామారెడ్డిలో ప్రతి ఓటరు దృశ్య చిత్రీకరణ చేస్తున్న పోలీసు సిబ్బంది

ప్రతి ఓటరుకు వీడియో చిత్రీకరణ

జిల్లా కేంద్రంలోని 101వ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఓటరును దృశ్య చిత్రీకరణ నిర్వహించారు. కేంద్రం ఎదుట ప్రత్యేక సిబ్బందిని నియమించి ఓటర్లను చిత్రీకరించారు. 396 మంది ఓటు వేయడానికి వచ్చారు.

యువ సత్తా చాటాలని : శంకర్‌, ఓటరు

యువత ఎక్కువ శాతం ఓటింగ్‌లో పాల్గొనడం లేదు. దీంతో సమర్థులైన నాయకులను ఎన్నుకోవడానికి సమస్య ఎదురవుతోంది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా యువకులంతా ఓటేయాలి. జిల్లా కేంద్రంలో రీపోలింగ్‌లోనూ యువత తక్కువగా ఓటేసింది. ఇది సరికాదు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేయడం అందరి బాధ్యత. యువ సత్తా చాటాలని నేను పోలింగ్‌లో పాల్గొన్నాను.


ఆలోచించి ఓటు వేశా : సంతోష్‌, యువకుడు

రీపోలింగ్‌ సందర్భంగా రెండో సారి ఓటు వేసే క్రమంలో ఆలోచించి ఓటు వేశా. మంచి వారిని ఎన్నుకునేందుకు మరో అవకాశం వచ్చింది. అభ్యర్థుల గెలుపోటములపై ఈ ఎన్నిక ప్రభావం చూపనుందని భావించా. 22 న జరిగిన ఎన్నిక కన్నా రీ పోలింగ్‌ రోజున అత్యధికంగా ఓట్లు వేశారని తెలిసి సంతోషించా. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవనుంది.


నా ఓటు వేశారనగానే మనసంతా బాధయింది: రాజ్‌బీ, ఓటరు

ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వచ్ఛా అప్పటికే నా పేరు మీద మరో ఓటరు ఓటు వేశారని తెలిసింది. దీంతో నా మనసంతా బాధయింది. ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నా. ఈసారి బాగా బాధపడ్ఢా ఓటేయకుంటే చచ్చినట్లేనని నా నమ్మకం. అందుకే టెండర్‌ ఓటు వేశా. ఎవరి తప్పిదమో గాని మళ్లీ ఎన్నికలు జరుపుతున్నారని తెలియడంతో మొదట ఆందోళన చెందా. గల్లీల రయ్య్‌మని పెద్దసార్ల వాహనాలు వస్తున్నాయి. పోలీసులు దండిగా ఇక్కడే తిరుగుతుండ్రు. నాకు భరోసా కలిగింది. నాకు మరో సారి ఓటు వేయడానికి అధికారులు అవకాశం కల్పిసున్నారని తెలియడంతో సంతోషమనిపించింది. రెండో సారి ఓటు వేయడం చాలా ఆనందంగా ఉంది. నా ఓటును డబ్బుకు అమ్ముకోను. నిస్వార్థంగా ఓటు హక్కును వినియోగించుకొన్నా.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.