close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బల్దియా సమావేశ బాధలు..!

నిర్వహణకు ఇబ్బందులు

సమస్యల్లో పురపాలికలు..

న్యూస్‌టుడే-మెదక్‌ కలెక్టరేట్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌

నర్సాపూర్‌లో ఓ అద్దెభవనంలో కొనసాగుతున్న మున్సిపల్‌ కార్యాలయం

* తూప్రాన్‌లో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పురపాలక సంఘంగా పేరు మార్చి అందులోనే కొనసాగిస్తున్నారు. పాలకవర్గం ఏర్పడిన తర్వాత సమావేశాల నిర్వహణ కోసం కార్యాలయం పైన ఉన్న స్టోర్‌ గదిలో ఉన్న సామగ్రిని తొలగించి వినియోగిస్తున్నారు. ఇది సైతం ఇరుకుగా ఉండడంతో ఇక్కట్లు తప్పడం లేదు.

* మెదక్‌లో కౌన్సిలర్ల సంఖ్య 32కు చేరుకోవడంతో సర్వసభ్య సమావేశ నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సమావేశాలను కలెక్టరేట్‌ ఆడిటోరియం లేదంటే ఫంక్షన్‌హల్‌లో నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కార్యాలయ పైభాగంలో సమావేశంలో నిర్వహణకు షెడ్డు లాంటింది నిర్మిస్తున్నారు.


మెదక్‌ బల్దియా కార్యాలయం పైన నిర్మిస్తున్న షెడ్‌

జిల్లాలోని ఆయా పురపాలికల్లో సర్వసభ్య సమావేశాల నిర్వహణకు నానా తంటాలు తప్పడం లేదు. కొత్తగా ఏర్పడిన పురపాలికల్లో ఇది వరకు కొనసాగిన గ్రామపంచాయతీ కార్యాలయాన్నే వినియోగిస్తున్నారు. అప్పట్లో సర్పంచి, వార్డు సభ్యులు సమావేశం కావడానికి, ఆయా విభాగాల కోసం గదులను నిర్మించారు. పురపాలికలుగా ఏర్పడ్డాక ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం, అన్ని విభాగాల అధికారులు హాజరుకావాల్సి ఉండడంతో సమావేశం అయ్యేందుకు విశాలమైన గదులు లేవు. దీంతో ఉన్న దాంట్లోనే సర్దుకుపోతున్నారు. పైగా తగిన ఆదాయం రాకపోవడంతో పురపాలికల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌, రామాయంపేట పురపాలిక ఉన్నాయి. వీటిలో మెదక్‌ మినహా మిగతావి కొత్తగా ఆవిర్భవించాయి. గత జనవరిలో ఎన్నికలు జరుగగా, అదే నెలలో పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రజాసమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించడానికి ప్రతి నెలా పురపాలికల్లో పాలకవర్గం సభ్యులు సమావేశమవుతారు. ఆయా విభాగాల అధికారులు హాజరవుతారు. మెదక్‌లో 2009లో నూతన భవనం నిర్మించారు. అందులోనే సమావేశ గది ఉంది. ఇదివరకు 27 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కో-ఆప్షన్‌ సభ్యులు ఉండగా.. సమావేశాలను నిర్వహించే వారు. బల్దియా పరిధిలోకి మూడు గ్రామాలు విలీనం కావడంతో కౌన్సిలర్ల సంఖ్య 32కు పెరిగింది. జనవరిలో పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం ఇరుకు గదిలోనే కొనసాగించారు. ఇప్పటివరకు నాలుగు సార్లు సర్వసభ్య సమావేశాలు జరగగా కలెక్టరేట్‌ ఆడిటోరియంలో రెండు సార్లు, మరొకటి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా, గతనెల ఓ ఫంక్షన్‌హల్‌లో నిర్వహించారు. తూప్రాన్‌లో ఇటీవల మంత్రి హరీశ్‌రావు పురపాలికపై సమీక్ష నిర్వహించగా, స్థలం సరిపోదని ఫంక్షన్‌హల్‌లో ఏర్పాటు చేశారు. నర్సాపూర్‌లో కొత్త నూతన భవనానికి నిధులు మంజూరు కావడంతో ప్రస్తుతం పాతభవనాన్ని కూల్చివేస్తున్నారు. దీంతో అద్దె భవనంలోకి కార్యాలయం మారగా, అక్కడా సమావేశాల నిర్వహణకు సరిపడా స్థలం లేదు. రామాయంపేటలో మాత్రం కాస్త పర్వాలేదని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.

వేగిరం చేస్తేనే...

మెదక్‌ పురపాలిక కార్యాలయం పైన షెడ్‌ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయి. తూప్రాన్‌లో ప్రభుత్వబాలురోన్నత పాఠశాల పక్కన ఉన్న పాత అతిథిగృహాన్ని కూల్చివేసి రూ.4కోట్లతో రెండు అంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. దసరా లోపు పనులు పూర్తి చేయాలని ఇటీవల మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పనులు జరుగుతున్న తీరును చూస్తే మరికొంత ఆలస్యం కానుంది. నర్సాపూర్‌లో రూ.2 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించాల్సి ఉంది. ఆయా చోట్ల కొనసాగుతున్న పనులను వేగిరం చేస్తే సమస్యలు తప్పుతాయని పలువురు ప్రజాప్రతినిధులు అంటున్నారు.


ఇంటి అనుమతుల ఆదాయం అంతంతే..

జిల్లాలో కొత్తగా ఏర్పడిన పురపాలికల్లో ఆదాయం నామమాత్రంగా ఉంది. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాల అనుమతులకు సంబంధించి లక్ష్యంలో 30 శాతం కూడా సమకూరడం లేదు. తూప్రాన్‌, రామాయంపేట, నర్సాపూర్‌ పురపాలికల్లో చాలా మంది యజమానులు ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నా తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రాబడిపై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని తూప్రాన్‌, నర్సాపూర్‌ పురపాలికల్లో ఈ పరిస్థితి అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం అభివృద్ధి పనులపై పడుతోందని వారు అంటున్నారు. పాత పురపాలిక మెదక్‌ మినహా మిగిలిన మూడు చోట్ల ఆశించిన ఆదాయం రావడం లేదు. రెండేళ్ల వ్యవధిలో మెదక్‌లో రూ.2.71 కోట్ల ఆదాయం రాగా.. తూప్రాన్‌, రామాయంపేట, నర్సాపూర్‌ పురపాలికల్లో మొత్తం రూ.63.76 లక్షలే సమకూరడం గమనార్హం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.