close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

తాజా వార్తలు

రాజధానిలో ‘ఆసరా’ పింఛన్ల కుంభకోణం

తహసీల్దారు సంకేత పదంతో అక్రమాలు.. నలుగురి అరెస్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో ‘ఆసరా’ పింఛన్ల వ్యవహారంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చార్మినార్‌ తహసీల్దారు సంకేతపదంతో పండుటాకులకు ‘ఆసరా’గా సర్కారు నెలనెలా ఇస్తున్న పింఛన్‌ సొమ్మును నలుగురు అక్రమార్కులు మహ్మద్‌ అస్లాం, సయ్యద్‌ సొహైలుద్దీన్‌, మహ్మద్‌ మొహిసిన్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌లు తమ సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్నారు. నాలుగు నెలల వ్యవధిలో రూ.25లక్షలు కొల్లగొట్టారు. హైదరాబాద్‌ ఆర్డీవో శ్రీనివాసరెడ్డి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై నిఘా ఉంచిన పోలీసులు మంగళవారం నలుగురినీ అరెస్ట్‌ చేశారు. నిందితులు ఆసరా పింఛన్లు ఇప్పిస్తామంటూ ఒక యువతికి డబ్బులిచ్చి పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దరఖాస్తులు తీసుకున్నారు. వాటిల్లోంచి 255 మంది పింఛనర్ల పేర్లు, బ్యాంకు ఖాతాలను వేరే మండలంలోకి తహసీల్దారు సంకేతపదం ద్వారా మార్చి వారి పింఛన్లను నిందితుల ఖాతాల్లో జమ చేసుకున్నారని సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన) అవినాష్‌ మహంతి తెలిపారు. ప్రధాన నిందితుడు  అస్లాం రెండేళ్ల క్రితం ఇదే నేరం చేసి అరెస్టయ్యాడని వివరించారు. ఈ నలుగురికీ సహకరించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పరారీలో ఉన్నాడని విశ్వసనీయంగా తెలిసింది.

పింఛన్‌ సొమ్ము పెంచడంతో...
వృద్ధులకు ఇస్తున్న పింఛన్‌ మొత్తాన్ని ఈ ఏడాది జూన్‌ నుంచి వెయ్యి రూపాయల నుంచి రూ.2,016లకు పెంచింది. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ప్రధాన నిందితుడు మహ్మద్‌ అస్లాం నాలుగు నెలల క్రితం తన స్నేహితుడు ఇమ్రాన్‌కు చెప్పాడు. తాను గతంలో బండ్లగూడ తహసీల్దారు సంకేత పదంతో పింఛన్ల సొమ్ము కొల్లగొట్టానని, తనకు సహకరిస్తే వచ్చిన సొమ్మును పంచుకుందాం అంటూ చెప్పాడు. ఇందుకు అంగీకరించిన చార్మినార్‌ ఎమ్మార్వో కార్యాలయంలో పనిచేస్తున్న తన స్నేహితుడి ద్వారా ఇమ్రాన్‌ తహసీల్దారు సంకేతపదం, ఇతర వివరాలను సేకరించాడు. వీటిని అస్లాం, సొహైల్‌కు ఇచ్చాడు. తన స్నేహితుడైన మొహిసిన్‌ను భాగస్వామిగా చేసుకుందామని సొహైల్‌ చెప్పగా అస్లాం అంగీకరించాడు. అనంతరం అస్లాం, సొహైల్‌, మొహిసిన్‌లు తమ వద్ద ఉన్న దరఖాస్తులను లబ్ధిదారులుగా మార్చారు. వీరి ఖాతాలను హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్‌, సిడికేట్‌ బ్యాంక్‌లతోపాటు ఇతర బ్యాంకులకు చెందిన 61శాఖలు, మహబూబ్‌నగర్‌లోని బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా నెలనెలా సొమ్ము తీసుకున్నారు. పింఛన్లు ఒక్కసారిగా పెరగడంతో అనుమానంతో ఆర్డీవో శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, ఎస్సై మదన్‌ పింఛన్ల సొమ్మును ఎక్కడ విత్‌డ్రా చేసుకుంటున్నారని అరాతీశారు.  అస్లాం, సొహైల్‌లు డబ్బు తీసుకుంటున్నారని ఆధారాలు సేకరించి మంగళవారం వారిని అరెస్ట్‌చేశారు. వీరివద్ద మరిన్ని వివరాలు సేకరించేందుకు కోర్టును అభ్యర్థించి మళ్లీ విచారించనున్నామని సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ రఘువీర్‌ తెలిపారు.

చార్మినార్‌ తహసీల్దార్‌పై బదిలీవేటు!
ఈనాడు, హైదరాబాద్‌: చార్మినార్‌ మండల తహసీల్దార్‌ జుబేదాబేగంను విధుల నుంచి తప్పించారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌రేట్‌కు ఎటాచ్‌ చేశారు. ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. చార్మినార్‌ మండల పరిధిలో మూడు నెలలుగా లబ్ధిదారులకు అందాల్సిన పింఛన్‌ సొమ్ములు ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతున్నాయి. దీనిపై బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్‌ ఆర్డీఓ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చార్మినార్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా పింఛన్‌లు దారి మళ్లినట్టు గుర్తించారు. తహసీల్దార్‌ అధికారిక ఈ-మెయిల్‌ ద్వారా లాగిన్‌ అయిన అక్రమార్కులు పింఛన్లను స్వాహా చేసినట్లు నిర్ధరించారు. దీనిపై కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కన్నన్‌ తహసీల్దార్‌ జుబేదాబేగంకు షోకాజ్‌ నోటీసు జారీచేశారు. పింఛన్ల కుంభకోణంలో తహసీల్దార్‌ ప్రమేయం ఉన్నట్టు నిర్ధరణ అయితే సస్పెన్షన్‌ వేటు పడవచ్చని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.