close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

తాజా వార్తలు

ప్రజలకు పథకాలు చేరువ చేస్తా..!

జిల్లాలోని రైతులందరికీ రైతు భరోసా అందేలా చర్యలు
నూతన జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌

జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌కుమార్‌

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు బాధ్యతగా పనిచేస్తానని నూతన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌కుమార్‌ తెలిపారు. అలాగే పంట పండించే రైతుకు సాగు పెట్టుబడిని అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం జిల్లాలో అర్హులైన రైతులందరికీ అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. జిల్లా నూతన జేసీగా ఆయన శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కర్నాటక రాష్ట్రంలోని దావణగెరెకి చెందిన తాను ఎంబీబీఎస్‌ పూర్తిచేశాక సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్‌కు (2015 బ్యాచ్‌) ఎంపికైనట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో మొదట సబ్‌కలెక్టర్‌గా పనిచేశానన్నారు. అక్కడే తొలుత తాను తెలుగు భాషను నేర్చుకున్నానని, ఇప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడతానని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం దిల్లీలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా, విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీవోగా పనిచేశానని తెలిపారు. నెల్లూరు జిల్లాపై తనకు కొంతవరకు అవగాహన ఉందని, గతంలో కరవు అంచనా బృందంతోపాటు తానూ జిల్లాలో పర్యటించానన్నారు. తన ప్రాధాన్య అంశాలను ఆయన వివరించారు. జిల్లాలో రైతులందరికీ వైఎస్సార్‌ రైతు భరోసా అందేలా రెవెన్యూ రికార్డులు, వెబ్‌ల్యాండ్‌లో తేడాలు ఉంటే సరిచేస్తామని తెలిపారు. అలాగే అర్హులైన పేదలందరికీ ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ప్రాధాన్యమిస్తానన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టతకు కృషి చేసి, ప్రతి కార్డుదారునికి ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే సరకులను వారి ఇళ్ల వద్దకు చేర్చేలా చర్యలు తీసుకుంటామని, నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో.. ప్రభుత్వ శాఖల అధికారులని సమన్వయం చేసుకుంటూ పని చేస్తానని స్పష్టం చేశారు.

శ్రీ రంగనాథ స్వామి అర్చకుల ఆశీర్వచనం
జేసీగా వినోద్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టడంతో నగరంలోని రంగనాథ స్వామి దేవస్థాన అర్చకులు ఆయన్ను తన ఛాంబర్‌లో ఆశీర్వదించారు. ఆలయ ఈవో వేమూరు గోపి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా జేసీ ఆ ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తాను కుటుంబసభ్యులతో స్వయంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటామని వారికి తెలిపారు. అలాగే డీఆర్వో మల్లికార్జున, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ వెంకటేశ్వరప్రసాద్, కలెక్టరేట్‌ ఇన్‌ఛార్జి ఏవో రామారావు, భూపరిపాలన విభాగం, కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల తహసీల్దార్లు, ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా నాయకులు, రైతు సంఘం నాయకులు, పలువురు ఉద్యోగులు ఆయన్ను కలసి అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.