close

ఆదివారం, నవంబర్ 17, 2019

తాజా వార్తలు

యుద్ధప్రాతిపదికనరైతు భరోసా దరఖాస్తుల విచారణ


మాట్లాడుతున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ పెండింగ్‌, తిరస్కరణకు గురైన దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన విచారించాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవన్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఆయన రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 1.35 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, మరో 1.60 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇంకో 61,253 దరఖాస్తులు ఆధార్‌ అనుసంధానంలో పొరపాట్లు దొర్లినట్లు వెల్లడించారు. రైతు కుటుంబాల్లో భార్య లేదా భర్త మృతి చెందితే... వారి వారసులకు కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాధికార సర్వేలో లేని రైతులను తక్షణమే నమోదు చేయించాలని సూచించారు. బ్యాంకు ఖాతాలను ఆధార్‌ అనుసంధానం చేయాలని, అందుకోసం ఆర్టీజీఎస్‌ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవో, ఏవో, ఈవోఆర్డీ, ఉప తహసీల్దార్లకు నూతనంగా లాగిన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 75 వేల క్వింటాళ్ల జె.జె-11 రకం, కాక్‌-2 రకం శనగ విత్తనాలు 50 శాతం రాయితీపై పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించేలా త్వరలో రైతు ప్రకాశం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ఇసుక అనుమతులపై నివేదిక...

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల అనుమతులపై నివేదికలు తయారు చేయాలని సంయుక్త కలెక్టర్‌ షన్మోహన్‌ సూచించారు. జరుగుమల్లి, ముండ్లమూరు, చినగంజాం, చీరాల, మద్దిపాడు, వేటపాలెం మండలాల్లో ఇప్పటికే గుర్తించిన ఇసుక రీచ్‌ల వివరాల ఆధారంగా అనుబంధశాఖల అధికారులు పరిశీలించి తక్షణమే నివేదిక అందజేయాలన్నారు. నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో జేసీ-2 నరేంద్రప్రసాద్‌, డీఆర్వో వెంకటసుబ్బయ్య, ఆర్డీవోలు ప్రభాకర్‌రెడ్డి, ఓబులేసు, శేషిరెడ్డి, జేడీఏ శ్రీరామమూర్తి, మార్కెటింగ్‌శాఖ ఏడీ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సచివాలయాలపై ప్రధాన కార్యదర్శి సమీక్ష...

ఒంగోలు గ్రామీణం: జనవరి ఒకటి నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీ, భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై అమరావతి నుంచి జిల్లాలోని అధికారులతో శుక్రవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ నెల 24 లోపు మొదటి విడత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 610 గ్రామ, వార్డు సచివాలయాలకు నూతన భవనాలు నిర్మించాల్సి ఉందని ద్వివేదీ దృష్టికి తీసుకెళ్లారు. మరో 400 భవనాలకు మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా, అందుకు రూ. 247 కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు. జిల్లాలో ఉద్యోగాల భర్తీ దాదాపు పూర్తి చేసినట్లు నివేదించారు. సచివాలయాల్లో ఫర్నిచర్‌ ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని, 15 రోజుల్లో సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. సమావేశంలో జేసీ షన్మోహన్‌, జేసీ-2 నరేంద్ర ప్రసాద్‌, డీఆర్వో వెంకట సుబ్బయ్య, జడ్పీ సీఈవో కైలాస్‌ గిరీశ్వర్‌, డీపీవో నారాయణరెడ్డి, పశుసంవర్ధకశాఖ జేడీ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, పీఆర్‌ ఎస్‌ఈ కొండయ్య, జేడీఏ శ్రీరామమూర్తి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మీసుధ, నగరపాలక సంస్థ కమిషనర్‌ నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.