close

ఆదివారం, నవంబర్ 17, 2019

తాజా వార్తలు

చిరునవ్వు చెదిరె..కలలు కల్లలాయే!

కళాశాల బస్సు ఢీకొని అక్కాచెల్లెళ్ల మృతి

తోటి విద్యార్థులతో సెలవుల ముచ్చట్లు పంచుకున్నారు. ఇక నవ్వుతూ ఆనందంగా ఇంటికి బయల్దేరారు. రెండు నిమిషాలు గడువకముందే వారి చిరునవ్వు చెదిరింది. అక్కాచెల్లెళ్లు అనంత లోకాలకు వెళ్లారు. రహదారి ప్రమాదం ఛాత్రోపాధ్యాయులను బలిగొంది. మరో అయిదు నిమిషాల్లో ఇంటికి వస్తారని ఆతృతగా ఎదురుచూస్తున్న కుటుంబీకులకు విషాద వార్త చేరింది. శిక్షణ పూర్తి చేసుకుని ఉపాధ్యాయ నియామక పరీక్షలో విజయం సాధించాలనే వారి కల కల్లలయ్యింది. సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న అక్కాచెల్లెళ్లు సాజియా అంజుం, సాఫియా అంజుంలు ఎదురుగా వస్తున్న కళాశాల బస్సు ఢీకొనడంతో మృతి చెందారు. సోదరుడు వాజీద్‌ గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ పట్టణంలోని రవీంద్రనగర్‌లో సోమవారం సాయంత్రం జరిగింది.

ఆదిలాబాద్‌ నేరవిభాగం, ఎదులాపురం- న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌లోని రవీంద్రనగర్‌లో సోమవారం సాయంత్రం కళాశాల బస్సు ఢీకొనడంతో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేకెత్తించింది. ఖానాపూర్‌ కాలనీకి చెందిన అక్కాచెల్లెళ్లు సాజియా అంజుమ్‌(23), సాఫియా అంజుమ్‌(21) స్థానిక ప్రభుత్వ డైట్‌ కళాశాలలో ఉర్దూ మాధ్యమంలో డీఎడ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరి తండ్రి సుభాన్‌ డైట్‌ కళాశాలలోనే అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి చాందిని గృహిణి. అయిదుగురు సంతానంలో పెద్దకూతురు నాజీయా వివాహం జరగగా.. సోదరుడు జావీద్‌ ఓ సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ కంపెనీలో పని చేస్తున్నారు. సాజియా, సాఫియా డైట్‌లో చదువుతుండగా.. చిన్న తమ్ముడు వాజీద్‌ డిగ్రీ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఉన్నంతలోనే ఆనందంగా జీవనం కొనసాగిస్తూ...భవిష్యత్తుపై కోటి ఆశలతో ఉన్న ఆ కుటుంబంలో అనుకోకుండా జరిగిన రహదారి ప్రమాదం మరిచిపోలేని విషాదాన్ని నింపింది. అక్కాచెల్లెళ్లను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. దసరా పండగ తర్వాత సోమవారమే విద్యా సంస్థలు పున:ప్రారంభం కావడంతో అక్కాచెల్లెళ్లిద్దరూ ఆనందంగా కళాశాలకు వచ్చారు. సహచర విద్యార్థులతో ఉల్లాసంగా గడుపుతూ... సెలవుల ముచ్చట్లను పంచుకున్నారు. సాయంత్రం కళాశాలకు సెలవు కావడంతో సోదరుడు వాజీద్‌తో కలిసి ‘టీఎస్‌01ఈఎల్‌ 4574’ నంబర్‌ ద్విచక్రవాహనంపై సహచర మిత్రులకు టాటా చెబుతూ ఇంటికి బయలుదేరారు. రెండు నిమిషాల వ్యవధిలోనే కళాశాలకు సమీపంలోనే ఉన్న రవీంద్ర నగర్‌లోని సీఆర్‌ఆర్‌ పాఠశాల ప్రాంగణం దగ్గరకు రాగానే ద్విచక్రవాహనాన్ని విద్యార్థి కళాశాలకు చెందిన ‘ఏపీ 15వై 1913’ నంబరు బస్సు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న సాజియా, సాఫియా బస్సు టైరు కింద పడిపోగా.. సోదరుడు వాజీద్‌ మరో వైపు పడిపోయాడు. దీంతో బస్సు వెనుక టైర్ల కింద పడి సాజియా అక్కడికక్కడే మృతి చెందింది. సోదరుడు చిన్న గాయాలతో బయటపడ్డాడు. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సాఫియాను ఆంబులెన్సులో హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రికి తరలించాక సాఫియా కూడా తనువు చాలించింది. కళాశాల నుంచి బయలుదేరిన రెండు నిమిషాలకే అక్కాచెల్లెళ్లిద్దరూ కానరాని లోకాలకు వెళ్లడం కుటుంబీకులనే కాకుండా సహచర విద్యార్థుల్లోనూ తీవ్ర విషాదం నింపింది. ఘటనాస్థలం వద్ద భారీగా జనాలు గుమిగూడారు. అక్కడికి చేరుకున్న కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రాన్ని తలపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. బస్సు డ్రైవర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థుల మృతి విషయం తెలుసుకున్న డైట్‌ కళాశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డితో పాటు ఉపాధ్యాయులు రిమ్స్‌కు చేరుకున్నారు. కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, మృతురాళ్ల బంధువులతో ఆస్పత్రి ప్రాంగణం నిండిపోయింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.