సౌకర్యాలే కాదు.. వినోదమూ

స్మార్ట్ హోమ్ విధానం మనకు సౌకర్యాన్ని కల్పించటానికే కాదు. వినోదానికీ ఎంతగానో తోడ్పడుతుంది. డౌన్లోడ్ చేసుకున్న, రికార్డు చేసుకున్న పాటలు కావొచ్చు. వీడియోలు, సినిమాలు కావొచ్చు. వీటిని దాచుకునే పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్కుల వంటివి పోతాయనే బెంగ అవసరం లేదు. సెంట్రల్ స్టోరేజీ పరికరంతోనే అన్నిరకాల మల్టీమీడియా వినోదాన్ని అందుకోవచ్చు. దీనిలో నిక్షిప్తమైన సినిమాలను, వీడియోలను అన్ని గదుల్లోని టీవీల్లో ఏక కాలంలో వీక్షించొచ్చు కూడా. అంతేకాదు, వారి వారి అభిరుచులను బట్టి వ్యక్తిగత ప్రొఫైల్స్‌నూ రూపొందించుకోవచ్చు. కదలికలను, హావ భావాలను గుర్తించే కృత్రిమ మేధ పరికరాలు అందుబాటులోకి వస్తే మన మూడ్‌ను గుర్తించి దానికి అనుగుణమైన పాటలు వినబడినా ఆశ్చర్యపోనవసరం లేదు.
|
గృహ నిర్మాణం నుంచే..

స్మార్ట్ హోంలపై మనదేశంలోని గృహ నిర్మాణ సంస్థలూ చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణే, థానే, గురుగ్రామ్ వంటి నగరాల్లో ఇలాంటి ప్రయత్నాలనూ ఆరంభించాయి. అపార్ట్మెంట్లలోకి వచ్చేవాళ్లను, పోయేవాళ్లను కనిపెట్టటం.. సూర్యరశ్మిని బట్టి కాంతిని సరిచేసుకోవటం.. అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ కావటం, అజ్ఞాతవ్యక్తుల చొరబాటు వంటి వాటిని పసిగట్టటం కోసం వీడియో కెమెరాలు, సెన్సర్లు, అలారాలను ఏర్పాటుచేస్తున్నాయి. వీటితో గుమ్మం దగ్గర ఉన్నదెవరో ఇంట్లోంచే తెలుసుకోవటానికి వీలవుతుంది. అవసరమైతే టీవీ ద్వారా వీడియోలో చూస్తూ మాట్లాడొచ్చు కూడా. పాత ఇళ్లకు సైతం వీటిని అమర్చుకోవచ్చు. వీటిన్నింటి ఉద్దేశం ఒక్కటే. అన్ని గ్యాడ్జెట్లను, పరికరాలను ఒకే వేదికతో పనిచేసేలా చూడటం. వీటన్నింటినీ ఒక్క యాప్‌తోనే నియంత్రించే అవకాశమూ లేకపోలేదు. ఇవి ఖర్చుతో కూడకున్నవే అయినా ఇంధన వినియోగం బాగా తగ్గుతుంది. ఉదాహరణకు ఇంట్లో ఎవరూ లేకపోతే రిఫ్రిజిరేటర్లు శీతల ప్రక్రియను తగ్గిస్తాయి. లైట్లు అనవసరంగా వెలగటమనేది ఉండదు. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో డబ్బు ఆదా కావటానికి తోడ్పడతాయి. మున్ముందు ఆయా ఇళ్లల్లోని స్మార్ట్‌హోం పరికరాలన్నీ ఒక గ్రిడ్‌కు అనుసంధానమై పనిచేయొచ్చు కూడా. దీంతో ఇంధనాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చు.
|
వందేళ్ల కిందటే బీజాలు

భద్రత, సౌకర్యం, ఇంధన పొదుపు, వినోదం.. స్మార్ట్ హోం ప్రధానోద్దేశాలు ఇవే. ఇది అధునాతన సాధన సంపత్తితో కూడుకున్నదే అయినా దీనికి వందేళ్ల కిందటే బీజాలు పడ్డాయి. 1900ల్లోనే తమను తాము నియంత్రించుకునే విద్యుత్/గ్యాస్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అనంతరం మన అదుపాజ్ఞల మేరకు నడచుకునే వాషింగ్ మెషిన్లు, వాటర్ హీటర్లు, రిఫ్రిజిరేటర్ల వంటి పరికరాల తయారీకి దారితీశాయి. ఇంట్లో వివిధ సౌలభ్యాల కోసం మొట్టమొదటి స్వయంచాలిత పరిజ్ఞానం 1975లో పుట్టుకొచ్చింది. దీని పేరు ఎక్స్ 10. ఇది విద్యుత్ తీగల ద్వారా రేడియో తరంగాల రూపంలో ఆయా పరికరాలకు సంకేతాలను చేరవేసేది. అయితే విద్యుత్ తీగలు రేడియో తరంగాల పంపిణీకి అంత అనుగుణమైనవి కాకపోవటం.. ఇవి ఒకవైపు నుంచే సంకేతాలను చేరవేస్తుండటంతో పూర్తి ఫలితం ఉండేది కాదు. ఆ తర్వాత వైర్లెస్ పరిజ్ఞానం అందుబాటులోకి రావటంతో స్వయంచాలిత పరికరాలు కొత్త పుంతలు తొక్కాయి. కృత్రిమ మేధస్సు పరిచయంతో రెండో తరం స్వయంచాలిత వ్యవస్థ పుట్టుకొచ్చింది. అమెజాన్ ఎకో, యాపిల్ హోంకిట్, గూగుల్ హోం వంటివన్నీ దీని ప్రతిబింబాలే. అంతటితో ఆగకుండా రోబోలతోనూ అనుసంధానమై మూడో తరం పరికరాలతోనూ ముందుకు దూకుతోంది. మూడు చక్రాలతో ఇల్లంతా కలియ దిరుగుతూ నిఘా పెట్టే రోబో రోవియో.. నేల మీద చక్రంలా పాకుతూ ఇంటిని శుభ్రం చేసే రూంబా వంటివి దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు.
|