close

ప్ర‌త్యేక క‌థ‌నం

హిందీ ఎందుకు వద్దు?

  ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్న దక్షిణాది.. ముఖ్యంగా తమిళనాడు
  తాజా నిరసనలకు తలొగ్గిన కేంద్రం

హిందీయేతర రాష్ట్రాల్లో సైతం హిందీని కచ్చితంగా బోధించాలని సిఫార్సుచేస్తూ కస్తూరిరంగన్‌ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సమర్పించిన విద్యా విధాన ముసాయిదా నివేదిక దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో పెను దుమారాన్నే సృష్టించింది. త్రిభాషా సూత్రాన్ని అమలుచేయాలంటూ కమిటీ చేసిన విస్పష్ట సూచనపై పెద్దఎత్తున నిరసన చెలరేగింది. ఇది హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దడమేనంటూ తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని లేవదీశాయి. ఈ నిరసన పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర   తదితర రాష్ట్రాలకూ విస్తరిస్తుండడంతో కేంద్రం చివరికి తలొగ్గింది. ఇది ముసాయిదా నివేదిక మాత్రమేనని, ఏ రాష్ట్రంపైనా బలవంతంగా హిందీని రుద్దబోమని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల పిల్లలు కచ్చితంగా హిందీని నేర్చుకోవాల్సిన పనిలేదని, మూడో భాషగా తమకు ఇష్టం వచ్చిన దాన్ని నేర్చుకోవచ్చునని స్పష్టంచేసింది.

వ్యతిరేకత ఈనాటిది కాదు

అనేక భాషల సమాహారమైన భారత్‌లో హిందీని హిందీయేతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాల్ని స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా తమిళనాడులో గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మద్రాసు ప్రావిన్సులో హిందీని ప్రవేశపెట్టడానికి సి.రాజగోపాలాచారి నేతృత్వంలో 1937లో ప్రయత్నం జరిగింది. హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా 1938 ఏప్రిల్‌ 21వ తేదీన ప్రవేశపెట్టారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. అప్పట్లో అరెస్టయిన నటరాజన్‌, థలముత్తులు జైల్లోనే మరణించడంతో ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి. దీంతో హిందీని తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఉత్తర్వును మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం 1940 ఫిబ్రవరి 21న ఉపసంహరించుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హిందీని దేశంలోన్ని అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయడానికి మళ్లీ ప్రయత్నాలు జరిగాయి. దీంతో తమిళనాడులో 1948లో ద్రవిడ కళగం(డీకే) నేతృత్వంలో మరోమారు ఆందోళనలు చెలరేగాయి. 6 నుంచి 11వ తరగతి వరకు హిందీని తప్పనిసరిచేస్తూ 1950 మే 2న ఇచ్చిన ఉత్తర్వులపై డీఎంకే నేతృత్వంలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కేంద్రం వెనక్కితగ్గింది. హిందీని భారత అధికారిక భాషగా చేయడానికి ప్రయత్నాలు జరగాలంటూ 1959లో భారత రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుపైనా మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో తమిళనాడుపై హిందీని రుద్దబోమంటూ అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రకటించారు. హిందీని ఏకైక అధికారిక భాషగా చేయడానికి 1965లో జరిగిన ప్రయత్నానికి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన హింసాత్మక ఆందోళనల్లో దాదాపు 63 మంది చనిపోయారు. వందలమంది జైళ్లకు వెళ్లారు.

రాజ్యాంగం ఏం చెబుతోంది?

దేశంలో మాట్లాడే ఏ భాషకూ జాతీయ హోదాను రాజ్యాంగం కట్టబెట్టలేదు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీతో పాటు ఆంగ్లాన్ని అధికారిక కార్యకలాపాల(పార్లమెంటరీ కార్యకలాపాలు, న్యాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కమ్యూనికేషన్లు) కోసం అధికారిక భాషగా వాడొచ్చని రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగంలోని 343(1) ప్రకారం దేవనాగరి లిపిలో ఉన్న హిందీనే అధికారిక భాషగా ప్రభుత్వం స్వీకరించింది. ఆ తర్వాత దీనిని సవరించి ఆంగ్లాన్నీ వాడుతున్నారు. చట్టం ద్వారా తమ సొంత అధికారిక భాషను నిర్ణయించుకునే స్వేచ్ఛ, అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. భిన్న సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన దేశంలో భాషాబంధాన్ని కొనసాగించడం కోసం హిందీని వ్యాప్తిచేసే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో 22 భాషల్ని చేర్చారు. ఈ భాషల్ని అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రంపై ఉంది.

హిందీని తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తోంది?

ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణాదిపై చెలాయించడానికే హిందీని రుద్దుతున్నారనేది తమిళ నేతల ఆందోళన. ద్రవిడ భాషలు ఎంతో ఉన్నతమైనవని.. ప్రాచీన సంస్కృతం నుంచి ఉత్తరాది భాషలు ఉద్భవించాయని, దక్షిణాది భాషలు మాత్రం స్వతంత్రంగా అభివృద్ధి అయ్యాయన్న భాషా శాస్త్రవేత్తల నిరూపణలతో వారు సంపూర్ణంగా ఏకీభవిస్తారు. మూలవాసులు ద్రవిడులని, మధ్య ఆసియా నుంచి ఉత్తరాదిలోకి ప్రవేశించిన ఆర్యులు దక్షిణాదికి వలస వచ్చారన్న సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారు. ఉత్తర, దక్షిణాదిల విభజన అప్పట్నుంచే ఉంది. అలాగని తమిళులు హిందీ నేర్చుకోవడానికి వ్యతిరేకులు మాత్రం కాదు. 99 ఏళ్ల చరిత్ర కలిగిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రధాన కార్యాలయం చెన్నైలోనే ఉంది. ఇందులోని దాదాపు 60 శాతం మంది తమిళనాడుకు చెందినవారే. అయితే హిందీ ప్రభావం వల్ల ద్రవిడ భాషల ఉనికి ప్రమాదంలో పడుతుందనేది వారి ఆందోళన. హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు దశాబ్దాలుగా ద్విభాషా సూత్రాన్నే అమలు చేస్తోంది.

ఉమ్మడి భాష అవసరమా?

భిన్న సంస్కృతులు కలిగిన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలంటే నిర్దిష్ట యంత్రాంగాలు, వాహకాలు ఉండాలనేది కాదనలేని వాస్తవం. భాష, సాహిత్యాలు ఈ దిశగా గొప్ప ఉపకరణాలు అవుతాయన్న కారణంతో హిందీని జాతీయ అనుసంధాన భాషగా వ్యాప్తిచేసే ప్రయత్నాల్లో భాగంగానే ప్రస్తుతం కస్తూరిరంగన్‌ కమిటీ సిఫార్సులు చేసిందన్న వాదన ఉంది. పాలనాపరమైన అవసరాలు, ఆలోచనల్ని సులభంగా పంచుకోవడానికి, సమగ్రత, సోదరభావాల్ని పెంపొందించడానికి ఉమ్మడి భాష అవసరమనే అభిప్రాయం ఉంది. దేశంలో ఎక్కువమంది హిందీ మాట్లాడతారు కాబట్టి.. కమ్యూనికేషన్‌, ఇతరత్రా అధికారిక కార్యకలాపాలకు ఈ భాష అవసరమని పలువురు వాదిస్తున్నారు. బ్రిటీషు సామ్రాజ్యవాదుల నుంచి దిగుమతి చేసుకున్న ఆంగ్లానికి బదులు దేశీయ భాషను ప్రోత్సహించడం మంచిదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

భారత్‌ భిన్న భాషల సమాహారం

భారత్‌లోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడతారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో పొందుపరచిన భాషలే 22. ఇవి కాకుండా వివిధ తెగలు, గ్రూపులు మాట్లాడే భాషలు కొన్ని వందల్లో ఉంటాయి. అందరినీ ఒకచోట కట్టిఉంచే జాతీయ భాషంటూ నిర్దిష్టంగా లేదు. ఇండో ఆర్యన్‌ భాషల్ని 78.05% మంది, ద్రవిడ భాషల్ని 19.64% మంది మాట్లాడుతుంటారు. మిగతా 2.31% మంది కొన్ని రకాల మైనర్‌ భాషల్ని మాట్లాడతారు. పపువా న్యూగినియా(839) తర్వాత అత్యధిక భాషలు మాట్లాడేది భారత్‌(దాదాపు 780 భాషలు)లోనే.

దేశ జనాభాలోని 41 శాతం మంది మాట్లాడే హిందీ జాతీయ భాష కాదు

-ఈనాడు ప్రత్యేక విభాగం


 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.