close

ప్ర‌త్యేక క‌థ‌నం

టెక్‌టమారాలకు అడ్డుకట్ట

మూతపడుతున్న ఇంజినీరింగ్‌ కళాశాలలు
బయోమెట్రిక్‌ నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి
నాణ్యత లేని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రుల విముఖత
విద్యార్థులు చేరక సీట్లు తగ్గించేసుకుంటున్న విద్యా సంస్థలు
ఐదేళ్లలో 61 బీటెక్‌ కళాశాలల మూత
ఇంకా తగ్గాలంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్‌

ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ గ్రూపు చదివే విద్యార్థులు ఎంతమందో చూడలేదు... ఇంజినీరింగ్‌లో ఉద్యోగావకాశాలు ఎన్నో అసలే పట్టించుకోలేదు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో డిమాండ్‌ ఉన్నప్పుడే సొమ్ము చేసుకోవాలనుకున్నారంతే. అందుకే ఒకే యాజమాన్యం కింద రెండు మూడు కొత్త కళాశాలలను కూడా ప్రారంభించారు. కేవలం బీటెక్‌ చదివినంత మాత్రాన ఉద్యోగాలు రావని, అందునా నాసిరకం కళాశాలల్లో చదివితే తమ భవిష్యత్తు అంధకారమేనని అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు ఎంతో కాలం పట్టలేదు. ఇలా రకరకాల కారణాలతో గత అయిదేళ్లలోనే 61 కళాశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో 2015-16లో 266 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ ప్రవేశాలు జరగగా 2018-19లో అది 205కి తగ్గిపోయింది. సీట్ల సంఖ్య సైతం 1.26 లక్షల నుంచి 96 వేలకు పడిపోయింది. ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో బీటెక్‌ సీట్లున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలి ఐదు స్థానాల్లో నిలుస్తోంది. ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ తదితర వృత్తి విద్యా కళాశాలలదీ ఇంజినీరింగ్‌ కళాశాలల దుస్థితే.
* 1996-2000 ప్రాంతంలో ఇంజినీరింగ్‌కు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరిగింది. అదే సమయంలో ఏఐసీటీఈ ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చింది.
* వర్సిటీలు సైతం సౌకర్యాలను పట్టించుకోకపోవడంతో యాజమాన్యాలు ఆడిందే ఆటగా మారిపోయింది. దాంతో ఇంజినీరింగ్‌ కళాశాలల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది.
* 2007లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బోధనా రుసుముల పథకం ప్రవేశపెట్టారు. దాంతో కళాశాలల సంఖ్య మరింత పెరిగింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ కళాశాలలను ఏర్పాటు చేశారు. నాణ్యత పడిపోయింది.
* 2009 దాకా ఒక కళాశాలలో 420కి మించి సీట్లు ఉండరాదని ఏఐసీటీఈ నిబంధన ఉండేది. దాంతో కొన్ని గ్రూపు సంస్థలు పలు కొత్త కళాశాలలను నెలకొల్పాయి. సీట్ల సంఖ్య మరింత పెరిగింది. దాన్ని 2010 నుంచి ఎత్తివేశారు. దాంతో పలు కళాశాలలు ఉన్న ప్రాంగణంలోనే సీట్ల సంఖ్యను పెంచుకున్నాయి. ఫలితంగా కొన్ని చోట్ల 1000-1500 సీట్లు ఉండటం గమనార్హం.

తగ్గుముఖం పట్టడానికి కారణాలు
* 2005లో తమిళనాడు తదితర రాష్ట్రాల్లో డీమ్డ్‌, ప్రైవేట్‌ వర్సిటీలు పెరిగాయి. అవి సీట్ల సంఖ్యను పెంచుకోవడంతోపాటు 2010 తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రాంగణాలను ప్రారంభించాయి. దాంతో రాష్ట్రంలోని కళాశాలల్లో బీటెక్‌లో చేరే వారి సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తోంది.
* నాణ్యమైన కళాశాలలైతే యాజమాన్య కోటాలోనూ రూ.లక్షలు చెల్లించి పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు తప్ప నాసిరకం కళాశాలల్లో చేర్చడానికి ఆసక్తి చూపడం లేదు.
* రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో రాష్ట్ర ప్రభుత్వం  నాణ్యతలేని బోధన అందిస్తున్న కళాశాలలపై కఠినంగా వ్యవహరించాలని జేఎన్‌టీయూహెచ్‌ను ఆదేశించింది. దాంతో అప్పటివరకు అధ్యాపకులు, సౌకర్యాలు ఉన్నా లేకున్నా అనుమతులు ఇస్తూ వచ్చిన విశ్వవిద్యాలయ అధికారులు నిబంధనలను గట్టిగా అమలు చేయడం ప్రారంభించారు.
* నిర్దేశిత ప్రమాణాలు పాటించని కళాశాలల్లో ప్రవేశాలకు విశ్వవిద్యాలయం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఒక్కో కళాశాలను మూసివేసుకుంటూ వస్తున్నారు.

బయోమెట్రిక్‌ దడ
* జేఎన్‌టీయూహెచ్‌ 2017-18 నుంచి అధ్యాపకులకు, 2018-19 నుంచి పీజీ విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. దాంతో ఉద్యోగాలు చేస్తూ కళాశాలకు రాకుండా పీజీ చేయడం చాలావరకు ఆగిపోయింది. అధ్యాపకులు సైతం వేలిముద్రలు వేయాల్సిన పరిస్థితి ఉండటంతో బోగస్‌ అధ్యాపకుల సంఖ్య కొంత తగ్గింది.
* ప్రతి అధ్యాపకుడికి ఒక ఐడీ సంఖ్య ఇచ్చి విశ్వవిద్యాలయం బోగస్‌ బెడదకు అడ్డుకట్ట వేసింది. దానివల్ల ఎంటెక్‌ కోర్సులను అందించే కళాశాలల సంఖ్య తగ్గింది.
* ఈ విద్యా సంవత్సరం నుంచి బీటెక్‌ విద్యార్థులకు కూడా బయోమెట్రిక్‌ను అమలు చేస్తామని జేఎన్‌టీయూహెచ్‌ ప్రకటించింది. దాంతో నాసిరకం కళాశాలల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

100-120 కళాశాలలు సరిపోతాయి

గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో చదివితే ఉద్యోగాలు రావన్న అభిప్రాయం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉంది. దాంతో నగరాల్లోని కళాశాలలు, నాణ్యమైన వాటిల్లోనే చేరుతున్నారు. అందుకే పలు కళాశాలలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో 100-120 కళాశాలలు సరిపోతాయి. భవిష్యత్తులోనైనా ఆ సంఖ్య వద్ద ఆగిపోతుందని నా అంచనా.

- ఆచార్య తుమ్మల పాపిరెడ్డి, ఛైర్మన్‌, రాష్ట్ర ఉన్నత విద్యామండలి

బోగస్‌ అధ్యాపకులు తగ్గిపోయారు

జేఎన్‌టీయూహెచ్‌ కొంత వరకు నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరిస్తుండటంతో చాలా వరకు బోగస్‌ అధ్యాపకులు తగ్గిపోయారు. దాంతో మూసివేసిన కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు ఇతర కళాశాలల్లో చేరారు. అయిదు శాతం మంది మాత్రం సాఫ్ట్‌వేర్‌, ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు.
- డాక్టర్‌ బాలకృష్ణారెడ్డి, తెలంగాణ సాంకేతిక విద్యాసంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.