close

ప్ర‌త్యేక క‌థ‌నం

మాస్టారూ.. ఎప్పుడొస్తారు?

సర్కారు బడుల్లో 20 వేల ఉపాధ్యాయ ఖాళీలు
పెరుగుతున్న విద్యావాలంటీర్లు
2017 నాటి టీఆర్టీ భర్తీ ప్రక్రియ పూర్తయ్యేదెన్నడో!
ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు నిపుణుల కొరత

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రాథమిక పాఠశాలలే కాదు కీలకమైన ఉన్నత పాఠశాలల్లోనూ సబ్జెక్టు నిపుణులను భర్తీ చేయడం లేదు. రెండేళ్ల క్రితం భర్తీకి ప్రకటన జారీ చేసినా ఇప్పటికీ 20 శాతం ఖాళీలనే నింపారు. కారణాలు ఏమైనా సర్కారు పాఠశాలలు బోధనా సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. ఏటేటా ఖాళీల సంఖ్య పెరుగుతుండటంతో విద్యావాలంటీర్ల (వీవీ) సంఖ్య సైతం అధికమవుతోంది. తాజా అంచనా ప్రకారం 20 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉంటాయని సంఘాల అంచనా. విద్యాశాఖ మాత్రం విద్యాహక్కు చట్టం ప్రకారం రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగానే ఉందని పేర్కొంటోంది. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1.09 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వాటిల్లో 22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం మరో 20 వేల మందిని నియమించాల్సి ఉంటుంది.

ఇదీ బడులు.. ఖాళీల దుస్థితి
* 2017 నాటికి ప్రాథమిక పాఠశాలల్లో 10,412, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే మరో 2,637.. మొత్తం 13,049 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని ప్రాజెక్టు ఆమోదిత
మండలి(పీఏబీ) సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర మానవ వనరుల శాఖకు వెల్లడించింది. 9, 10 తరగతులను పరిగణనలోకి తీసుకుంటే కనీసం మరో 2 వేల ఖాళీలు ఉంటాయి.
* 32 శాతం ప్రాథమికోన్నత పాఠశాలల్లో మూడు, 8 శాతం ఉన్నత పాఠశాలల్లో నాలుగు సబ్జెక్టులు బోధించే నిపుణులు లేరని గత మే నెలలో జరిగిన పీఏబీ సమావేశంలో కేంద్రం రాష్ట్రాన్ని హెచ్చరించింది.
* 2017 అక్టోబరులో 8,792 ఖాళీల భర్తీకి టీఆర్టీ ప్రకటన జారీ అయింది. ఆ నోటిఫికేషన్‌కు 2016 సెప్టెంబరు వరకు ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకున్నారు. అంటే 2016 అక్టోబరు నుంచి ఇప్పటివరకు సుమారు మూడేళ్లలో దాదాపు 5 వేల మంది పదవీ విరమణ చేశారు. టీఆర్టీ ద్వారా ప్రస్తుతం 2 వేల మందే ఉద్యోగాల్లో చేరారు. మిగిలిన పోస్టులకు న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి.
* విద్యా వాలంటీర్ల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లోనే వీరిని నియమిస్తారు. ప్రస్తుతం 16,781 మంది పనిచేస్తున్నారు.
* పలు గ్రామాల్లో గ్రామస్థులు, ఉపాధ్యాయులు, దాతల విరాళాలతో విద్యా వాలంటీర్లను నియమించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి వారు కనీసం 2 వేల మందికిపైగా ఉంటారని అంచనా. ఉదాహరణకు నిజామాబాద్‌ జిల్లా బోర్గాం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఒక విద్యావాలంటీరును నియమించింది. విద్యా నిధి కింద ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున వేతనం ఇస్తూ అయిదుగురిని అక్కడ విద్యాకమిటీ నియమించుకుంది.
* జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం వాల్గొండ ఉన్నత పాఠశాలలో తెలుగు, హిందీ భాషా పండితులు మాత్రమే ఉన్నారు. మరో అయిదు సబ్జెక్టుల నిపుణులు లేరు.

కొలువులిచ్చినా.. చేరనివారెందరో
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో రెండేళ్ల క్రితం 8,792 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన జారీ చేసి నియామకాలు జరుపుతున్నా వాటిలో దాదాపు 2 వేల పోస్టులు ఖాళీగానే ఉండనున్నాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్జీటీ) తెలుగు, ఆంగ్ల మాధ్యమ పోస్టులు రెండింటికి ఎంపికైన వారు సమారు 450 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు పొంది తెలంగాణ ఎస్జీటీలో ఎంపికైన వారు 40 మంది ఉన్నారు. రెండు కొలువులు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా ఒక దాన్ని వదులుకునే అవకాశం ఉంది. ఒకేసారి కౌన్సెలింగ్‌ నిర్వహించకపోవడంతో అభ్యర్థులు వదులుకోవడానికి ముందుకు రావడం లేదు. స్కూల్‌ అసిస్టెంట్‌ నియామక పత్రాలు తీసుకున్న వారిలో 50 మంది వరకు ఎస్జీటీలకూ ఎంపికయ్యారు. ఎస్జీటీ ఉర్దూలో 600 ఖాళీలు ఉంటే 290 మందే చేరారు. ఖాళీలు ఉంటే ఆ తర్వాత ర్యాంకర్లను పిలవకపోతుండటంతో అన్ని పోస్టులు భర్తీ కావడం లేదు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల్లో 3 వేల మంది చేరకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో మెరిట్‌ జాబితాను విడుదల చేసి భర్తీ చేశారు. ఉపాధ్యాయ కొలువుల్లోనూ అదేరకంగా చేయాలని డీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంమోహన్‌రెడ్డి కోరుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.