close

ప్ర‌త్యేక క‌థ‌నం

మనిషి మృగ్యం

మాయమవుతున్న మానవత్వం
కుటుంబ సంబంధాలపై నెత్తుటి మరకలు
చేటు తెస్తున్న సాంకేతిక పరిజ్ఞానం
ఖాళీ సమయం కాస్తా... ఫోన్‌కే అంకితం
ఈనాడు,  హైదరాబాద్‌

క్రూర జంతువులది ఆటవిక న్యాయం. ఆహారం కోసం వేటాడడం వాటి లక్షణం. ఆకలి తీర్చుకునే వరకే వాటి క్రూరత్వం. విచక్షణ తెలియదు. చట్టం, ధర్మం లేవు. వాటికి తెలిసిందల్లా బతకడం. బతకడం కోసం తినడం.. అంతే. మరి మనిషో! అన్నీ తెలిసిన వాడు అయినా అన్నీ వదిలేస్తున్నాడు. కొంతమందిలో లోపలి దానవుడు తొంగి చూస్తున్నాడు. అదను చూసి చెలరేగుతున్నాడు.. మానవత్వాన్ని మట్టుపెడుతున్నాడు. తల్లి లేదు... తండ్రి లేదు... అన్నాచెల్లీ... భార్యాభర్తా... ఏ భేదాలూ లేవు. అడ్డుగా ఉంటే నిర్దాక్షిణ్యంగా తుదముట్టించేస్తారు. అత్యాశో...‘అవాంఛ’లో... దీనికి కారణాలవుతున్నాయి. నిందితుల్లోనూ ఆడా మగా తేడా లేదు. కర్కశత్వంలో ఎవరూ తీసిపోరు. గత కొద్ది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని నేరాల వెనుక ఘోరాలు దాగి ఉన్నాయి.
 

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కీర్తిరెడ్డి ఉదంతం ఇటీవల సంచలనం సృష్టించింది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన మహిళ... వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన తొమ్మిదేళ్ల కుమారుడిని ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసింది.
వికారాబాద్‌ జిల్లా బంట్వారంలో అరవైయ్యేళ్ల తల్లిని కత్తితో పొడిచి చంపాడో కసాయి.
వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలో ఆస్తి కోసం... వృద్ధులైన తల్లితండ్రులను ఇంట్లో గడియ పెట్టి మరీ సజీవ దహనం చేశాడు పెద్దకొడుకు.
హైదరాబాద్‌ మౌలాలీలో రైల్వే మాజీ ఉద్యోగిని పింఛను కోసం అతడి భార్య, కూతురు, కుమారుడు కలిసి ముక్కలుగా నరికారు.
వికారాబాద్‌ జిల్లా బంట్వారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక వ్యక్తి తన 15 ఏళ్ల కుమార్తెను ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకెళ్తూ... దారిలో ఆమెపై అత్యాచారం చేయబోయాడు. నిరాకరించడంతో హతమార్చాడు.
మెదక్‌ జిల్లాకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి తన తల్లితో పాటు చేనుకు కాపలా వెళ్లాడు. అర్ధరాత్రి కన్నతల్లిపైనే అత్యాచారానికి ప్రయత్నించాడు. ఎదురు తిరగడంతో ఆమెను హతమార్చాడు.

మనిషి డైరీలో ఎర్రసిరాతో నిండిపోతున్న వాక్యాలివి. రోజుకొకటిగా చేరుతూ... చిత్రగుప్త చిట్టాను తలపిస్తున్నాయి. అదంతా నెత్తుటి రంగుతో నిండిపోతే... మానవత్వపు ఊట సాంతం ఎండిపోతే...  సాటి మనిషే యముడవుతుంటే... కుటుంబ సభ్యులే తలారులై ఉసురు తీసేస్తుంటే... ఓ మనిషీ... నువ్వు ఎవరిని నమ్మాలి? అయినవారే ఒకరినొకరు చంపేసుకునే స్థితికి కారణమెవరు?

 అంతర్జాలంతో అంతరం

సొంత కుటుంబ సభ్యులనే హత్యలు చేస్తారు. వావి వరుసలు కూడా మరిచి అత్యాచారాలకు తెగిస్తారు. ఇది అనైతికత ఉప్పెన. సమాజాన్ని నెమ్మదిగా ముంచెత్తుతోంది. మనుషుల మధ్య ప్రేమానురాగాలను మింగేస్తోంది. అంతర్జాలం దీనికో కారణం. కుటుంబ సంబంధాలకు అదే పెద్ద అంతరం. అవాంతరం. రెండువైపులా పదునున్న కత్తి అది. ఇంటర్‌నెట్‌ సద్వినియోగం తెలియక చాలా మంది విషపు ‘సాలెగూడు’లో చిక్కి విలవిల్లాడుతున్నారు. ‘ట్యూబు’ల్లో ఇరుక్కుని ఊపిరాడక సతమతమవుతున్నారు. సామాజిక మాధ్యమాలు అపరిచిత బంధాలకు దారితీస్తున్నాయి. అసలే మరుగుజ్జు కుటుంబాలు. మంచీ చెడూ చెప్పే తాతలు, బామ్మలు లేరు... ఇంట్లో ఉండేది ముగ్గురో... నలుగురో! ఎవరి మధ్యా మాటలుండవు. రోజులో నికరంగా మాట్లాడుకునేది నిమిషాల్లోనే!

 వీలైతే నాలుగు మాటలు!

‘అన్నం పెట్టు’...; ఫీజుకు డబ్బులు కావాలి’; షాపింగ్‌కు తీసుకెళ్లు... ఇలాంటి సాధారణ అవసరాల కోసం ఆడే మాటలే తప్ప... ఆప్యాయతలను పంచుకునే పలుకులు కరువైపోయాయి. పెద్దలు, పిల్లలదీ అదే తీరు. దీని వల్ల వారి మధ్య బంధం బీటలు వారుతోంది. తల్లీ, తండ్రి కొడుకూ, కూతురూ అందరూ ఒకే ఇంట్లో ఉన్నా మానసికంగా ఎవరి దోవ వారిది. ఈ స్థితిలోనే వారికి వేరే వారితో కొత్త బంధాలు పుడుతున్నాయి.

 చాటింగ్‌... చీటింగ్‌

పిల్లలకు తల్లిదండ్రులతో సాన్నిహిత్యం ఉండదు. చిన్నప్పుడే భావోద్వేగ బంధం తెగిపోతోంది. టీవీ చూసేందుకో, సామాజిక మాధ్యమాలవైపో పెద్దలు మొగ్గు చూపుతున్నారు. పిల్లలు తమకు అడ్డు పడకుండా వారి చేతిలో ఓ ఫోన్‌ పెట్టేస్తారు. పిల్లలు ఫోన్లో గడిపేది ఎక్కువగా హింసాత్మకమైన వీడియో గేమ్స్‌తోనే. వెంటాడటం, వేటాడటం, చంపడం వంటి ఆటల్లో గెలిచే ప్రయత్నంలో తెలియకుండానే వారిలో హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది. యుక్తవయసు పిల్లలైతే అశ్లీల వెబ్‌సైట్ల వలలో చిక్కుకుంటున్నారు. పెద్దలు, పిల్లలు ఎవరేం చూస్తున్నారో.. ఏం చేస్తున్నారో అంతా గోప్యం. తేలు కుట్టిన దొంగల చందం.

 ఎవరి లోకం వారిది...

‘ఎవరి స్పేస్‌లో వాళ్లుండాల’న్న విచిత్ర భావనలు పెరుగుతున్నాయి. ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోకూడదన్న ధోరణి. భార్యాభర్తల మధ్య, పెద్దలు, పిల్లల మధ్య కంటికి కనిపించనంత దూరం పెరిగిపోతోంది. తల్లితండ్రులు పిల్లలకు ప్రేమను రుచి చూపలేకపోతున్నారు. బాల్యచేష్టలతో కలిగే ఆనందాన్ని తామూ దూరం చేసుకుంటున్నారు. ఇలా బలహీనమయ్యే బంధం పిల్లలు పెద్దయ్యేకొద్దీ మరింత ఛిద్రమవుతోంది. వారు యుక్తవయసుకొచ్చాక తల్లిదండ్రులను కూడా పరాయివారిలా చూస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడరు. స్మార్ట్‌ఫోన్‌, అంతర్జాలమే వారి నేస్తాలు. అక్కడే అపరిచితులతో చాటింగ్‌లు... ఆపై డేటింగ్‌లు. ఇలా పెద్దలూ పిల్లలూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ప్రమాదాల్లో పడుతున్నారు.

భావోద్వేగాలను అదుపు చేయగలిగితేనే

కీర్తిరెడ్డి తరహాలో కుటుంబసభ్యులనే చంపేసేంత కిరాతకాలను తరచి చూస్తే భావోద్వేగాలను అదుపు చేయడంలో నేటి తరం విఫలమవుతోందని చెప్పొచ్చు. తాము చేస్తున్న పనిని అంగీకరించకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్ల వల్ల 90 శాతం అనర్థాలు జరుగుతున్నాయి. ఏదో చేయాలనే ఆత్రుత, ఉత్సుకత పెడధోరణులకు కారణమవుతోంది. పిల్లలకు నైతిక విలువలు నేర్పించే పెద్దలు లేకపోవడం విపరీతాలకు దారితీస్తోంది. భావోద్వేగాల్ని అదుపు చేయలేకపోవడంతో పాటు కుటుంబసభ్యుల నుంచి సరైన ఓదార్పు లభించకపోవడంతో దురాగతాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్ని సన్మార్గంలో నడిపించాల్సిన కీలక బాధ్యతను తల్లిదండ్రులు విస్మరించవద్దు. సంపాదనలో పడి పిల్లల పెంపకంపై అశ్రద్ధ వహించడం అనర్థాలకు దారితీస్తుంది. ఆడపిల్లలతో సమానంగా మగ పిల్లలపైనా దృష్టి సారించాలి. మంచి పేరెంటింగ్‌తోనే చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి.
- మైథిలి, ఇన్‌ఛార్జి పర్యవేక్షకురాలు,  బాలికల రక్షిత గృహం, హైదరాబాద్‌

‘సామా’స దోషం

* గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్‌ స్పెండింగ్‌ ట్రెండ్స్‌-2019’ నివేదిక ప్రకారం దేశంలో సగటున ప్రతి పౌరుడూ రోజుకు 2.4 గంటల పాటు సామాజిక మాధ్యమా(సామా)ల్లో గడుపుతున్నట్లు వెల్లడైంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం.

రోజుకు 24 గంటలు... చదువులు, ఉద్యోగాల కోసం కుటుంబ సభ్యులు బయట గడిపేది సుమారు 10 గంటలు
నిద్రకు: 8 గంటలు.
స్నానపానాదులకు: 2 గంటలు
సామాజిక మాధ్యమాల్లో: 2.4 గంటలు
మిగిలేది: సుమారు 1.5 గంట (ఈ సమయంలో కూడా అత్యధికం చదువుకో, టీవీ చూడడానికో వెచ్చిస్తారు).

ఈ లెక్కన కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వెచ్చించేది నిమిషాల్లోనైనా ఉంటుందా?

* కొన్నేళ్ల కిందట మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో కన్న కొడుకును చెట్టుకు కట్టేసి విద్యుదాఘాతంతో బూడిద చేసేసింది. కొంతసేపటి తర్వాత తన తప్పు తెలుసుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న దుశ్చర్యల్లో ఇలాంటివే ఎక్కువ.

 కోరిక చంపేస్తోంది

సొంత మనుషుల్నే హత్య చేస్తున్న ఘటనలకు ప్రధానంగా రెండే కారణాలు వెల్లడవుతున్నాయి. ఒకటి డబ్బు, రెండోది లైంగిక వాంఛ. ఎవరికివారు తమ ఆనందమే ముఖ్యంగా భావిస్తున్నారు. అడ్డొచ్చిన వారు కుటుంబ సభ్యులైనా సరే మట్టుపెడుతున్నారు. పెచ్చుమీరుతున్న అశ్లీలత, విశృంఖలత్వం... స్త్రీ, పురుషులిద్దరినీ రొంపిలోకి లాగుతున్నాయి. కట్టుబాట్లను ఛేదించేలా పురిగొల్పుతున్నాయి. లైంగిక వాంఛ మానవత్వాన్ని చంపేస్తోంది. విలాసాలకు అలవాటుపడ్డ వారు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.