Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

బోగీభాగ్యాల ప్రయాణం 

లగ్జరీ రైళ్లను అందుబాటులోకి తెస్తున్న ఐఆర్‌సీటీసీ 
తొలుత సికింద్రాబాద్‌-తిరుపతి మార్గంలో పరుగులు 
ఆ తర్వాత సికింద్రాబాద్‌-దిల్లీల మధ్య కూడా.. 
తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం సందర్శనతో ప్యాకేజీ 
ఈనాడు - హైదరాబాద్‌ 
బోగీభాగ్యాల ప్రయాణం 

సీ పడక గదులు..ఖరీదైన సోఫాలు..ప్రత్యేక స్నానాల గది..వేడినీళ్లకు గీజర్‌..పిలిస్తే వస్తే పనివాళ్లు..కోరుకున్న రుచుల్ని సిద్ధం చేసే సహాయకులు..ప్రకృతిని ఆస్వాదించేందుకు వీలుగా ఏర్పాటైన పెద్దపెద్ద అద్దాల కిటికీలు..ఇలా సకల సదుపాయాలున్న రైళ్లు (సెలూన్‌ కార్‌/ఇన్‌స్పెక్షన్‌ బోగీలు) ప్రయాణికులకు సేవలు అందించబోతున్నాయి. ఈ మేరకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తోంది. వారం, పది రోజుల్లో వీటి ధరలను ప్రకటించనుంది.

రైల్వే మంత్రి చొరవతో 
రైలు మార్గాల్లో తనిఖీలు, ఇతర పర్యటనలకు వెళ్లిన సందర్భాల్లో రైల్వే ఉన్నతాధికారులు ఈ సెలూన్‌ కార్లు వినియోగిస్తుంటారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా 336, ద.మ.రైల్వే పరిధిలోని ఆరు డివిజన్‌ కేంద్రాల్లో 25కు పైగా ఉన్నాయి. అధికారులు పర్యటనలకు వెళ్లిన సందర్భాల్లో మినహా మిగిలిన రోజుల్లో ఇవి ఖాళీగా ఉంటున్నాయి. కొందరు ఉన్నతాధికారులు పర్యటనల పేరుతో..తమ వ్యక్తిగత ప్రయాణాలకు వీటిని వినియోగిస్తారన్న విమర్శలూ ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ సమీక్షలో ఈ వ్యవహారంపై రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ దృష్టిపెట్టారు. వీటి వినియోగంపై ఇప్పటివరకు ఉన్న విధానాన్ని మార్చాలని ఆదేశించారు. వాటిని వాణిజ్య వినియోగం కిందకు తీసుకురావాలని స్పష్టంచేశారు. ఈ మేరకు రైల్వేబోర్డు వివిధ జోన్లకు ఉత్తర్వులు జారీచేసింది కూడా. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ ఈ రైళ్లలో ప్రయాణానికి ప్యాకేజీలు రూపొందిస్తోంది.

ధర అ‘ధనమే’ 
సెలూన్‌ బోగీల్లో టికెట్ల ధరల నిర్ణయంపై ఐఆర్‌సీటీసీ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 18 ఫస్ట్‌క్లాస్‌ ఏసీ టికెట్ల ధరలను వీటిలో వసూలుచేస్తారు. ఉదాహరణకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ధర రూ.2,360. దీన్ని 18 మందికి గుణిస్తే రూ.42,480. రానుపోనుతో కలిపి రూ.84,960గా ఖరారుచేసే అవకాశం ఉందని తెలిసింది. ‘ఈ మొత్తం టికెట్‌కు మాత్రమే. భోజనం, తిరుపతి స్టేషన్‌లో దిగిన తర్వాత వసతి, తిరుమలలో రూ.300 దర్శనం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో దర్శనం టికెట్లు, రైల్వేస్టేషన్‌ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే రవాణా తదితరాలు దానికి అదనం. వారం రోజుల్లో ధరలపై స్పష్టత వస్తుంది’ అని ఐఆర్‌సీటీసీ వర్గాలు తెలిపాయి. తిరుపతి ప్యాకేజీ విజయవంతమైతే తర్వాత వీటిని దిల్లీకి..అటు తర్వాత మరికొన్ని మార్గాల్లో నడుపుతామని ఓ అధికారి పేర్కొన్నారు. వీటిలో వంట చేసేందుకు సహాయకులు ఉంటారు. ప్రయాణించే వారు తాము కోరిన, నచ్చిన ఆహారం వండించుకోవచ్చు. ‘అవసరమైన వంట సామగ్రిని వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాటిని మేమే అందిస్తాం. ఆ ఖర్చును కూడా ప్యాకేజీలో కలిపేస్తాం’ అని ఐఆర్‌సీటీసీ వర్గాలు చెబుతున్నాయి.

8 మంది ప్రయాణించే వీలు 
ఒక్కో సెలూన్‌ కార్‌లో రెండు పడక గదులు ఉంటాయి. ఒక్కో దాంట్లో ఇద్దరేసి చొప్పున నలుగురు, ముందు..వెనుక భాగంలో రెండేసి చొప్పున ఉండే నాలుగు బెర్తుల్లో మరో నలుగురు ప్రయాణించే వీలుంటుంది. గరిష్ఠంగా 8 మందిని అనుమతిస్తారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.