close

ప్ర‌త్యేక క‌థ‌నం

థాయ్‌లాండ్‌ కంటే తీసిపోయామా?

2వారాలుగా భూగర్భంలో చిక్కుకున్న ‘మేఘాలయ’ కార్మికులు
సాధన సంపత్తి లేదని సహాయక చర్యల నిలిపివేత

మేఘాలయలోని జయంతియా జిల్లాలో అక్రమంగా బొగ్గుగనిలోకి ప్రవేశించినవారిని రక్షించడానికి రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మంగళవారం నిలిపివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థాయ్‌లాండ్‌లాంటి చిన్నదేశంలో అతిక్లిష్టమైన గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ బృందసభ్యులను ఆ దేశం విజయవంతంగా ప్రాణాలతో రక్షించగలిగిందని.. ఆ దేశంతో పోలిస్తే అన్నివిధాలా ఎంతో అభివృద్ధి చెందిన మనదేశంలో మాత్రం గనికార్మికులను రక్షించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తమవుతోంది.

థాయ్‌లాండ్‌ కంటే తీసిపోయామా?

అసలేం జరిగింది?
మేఘాలయలోని జయంతియా జిల్లావ్యాప్తంగా బొగ్గు గనులు ఉన్నాయి. క్సాన్‌ప్రాంతంలోని లుంతారిగ్రామంలో మూసివేసిన ఓ బొగ్గుగనిలోకి డిసెంబరు 13న 20 మంది అక్రమంగా ప్రవేశించారు. వీరిలో చిన్నపిల్లలు, యువతే ఎక్కువ. ఇది భూమికి 370అడుగుల లోతున ఉంది. ఈ గనికి ఆనుకుని లిటిల్‌ నది ప్రవహిస్తోంది. గనిలో భూమికి సమాంతరంగా ఎలుక కలుగుల్లాంటి బొరియలు తవ్వి, బొగ్గు తరలించే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి కాస్త ఎక్కువగా తవ్వడం వల్ల పక్కనే ఉన్న నది నీళ్లు గనిని ముంచేశాయి. ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 15మంది గనిలోనే చిక్కుకుపోయారు.

చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం

థాయ్‌లాండ్‌ కంటే తీసిపోయామా?

గనిలో 70అడుగుల మేర నీరు ప్రవేశించింది. విషయం తెలిసి పోలీసులు, రాష్ట్ర-జాతీయ విపత్తుల సహాయకశాఖ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌)కు చెందిన వందమంది సహాయక చర్యలు ప్రారంభించారు. 35అడుగులకు మించి నీరు చేరితే, ఆ ఒత్తిడిని తట్టుకుని గనిలోపలకు ప్రవేశించడానికి గజ ఈతగాళ్లకు సాధ్యం కాదు. నీటిని తోడటానికి అవసరమైన సాధన సంపత్తి కూడా మేఘాలయ ప్రభుత్వం వద్ద లేదు. దీంతో సహాయం చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది.

ఎందుకు రక్షించలేకపోతున్నారు?

ప్రస్తుతం సహాయకచర్యలు చేపట్టిన బొగ్గు గనిని కొన్నేళ్లక్రితమే మూసేశారు. అది ఎలా ఉంటుందో మ్యాప్‌లు కూడా అందుబాటులో లేవు. ప్రైవేటువ్యక్తులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై ఇక్కడ అక్రమంగా తవ్విస్తున్నారు.

* గనిలోని నీటిలోకి ప్రవేశించే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 30-35 అడుగుల వరకు మాత్రమే వెళ్లగలరు. 30నిముషాలకు మించి నీటిలో ఉండలేరు.

* గనిలోపల 14చోట్ల రంధ్రాల ద్వారా లిటిన్‌ నది నీరు చొచ్చుకొస్తోందని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కనిపెట్టగలిగింది. ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో చెప్పలేకపోతున్నారు.

* ప్రస్తుతం నీటిని తోడటానికి రెండు హైపవర్‌ పంపులు వాడుతున్నారు. అంతేస్థాయిలో నదినీరు ఎప్పటికప్పుడు గనిలోకి ప్రవేశిస్తోంది. నదినీటిని అడ్డుకుంటేనే నీరు తోడినా ఉపయోగం ఉంటుంది.

రక్షించడానికి ముందుకొచ్చిన ప్రైవేటు కంపెనీ

షిల్లాంగ్‌: మేఘాలయలోని బొగ్గుగనిలో 15 రోజులుగా చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి పంపుల తయారీలో ప్రముఖ కంపెనీ అయిన ‘కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ లిమిటెడ్‌’ ముందుకొచ్చింది. కంపెనీకి చెందిన రెండు సహాయక బృందాలు గురువారం గని వద్దకు చేరాయి. నీటిని తోడి రక్షించడానికి తమవంతు కృషి చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు భారతీయ వైమానిక దళం, కోల్‌ఇండియాకు చెందిన సహాయకబృందాలు శుక్రవారం గని వద్దకు చేరుకునే అవకాశాలున్నాయి. 
థాయ్‌లాండ్‌ కంటే తీసిపోయామా?
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.