close

ప్ర‌త్యేక క‌థ‌నం

సరికొత్త సంతోషానికి స్వాగతం!

సరికొత్త సంతోషానికి స్వాగతం!

కొత్త సంవత్సరం కొంగొత్త సందోహం! 
ప్రపంచవ్యాప్తంగా ఈ ఘడియలు మోసుకొచ్చే ఉత్సాహం.. ఉల్లాసం.. అనంతం!! 
ఈ ఉత్సాహం రోజులు గడిచే కొద్దీ కరిగిపోకుండా.. ఈ సంతోషం కాలంతో పాటే జారిపోకుండా.. ఏడాదంతా ఇంతే ఆనందంగా ఉంటే ఎంత బాగుణ్ణు! 
ఉంటే కాదు... కచ్చితంగా ఉంచుకోవచ్చు. ఎలాగంటారా??? 
నేడు శాస్త్రవేత్తల నుంచి ఆధ్యాత్మిక వేత్తల వరకూ ఎవర్ని కదిపినా.. మన సంతోషం పూర్తిగా మన చేతుల్లోనే ఉందంటున్నారు. అంతేకాదు.. సంతోషమే సంపూర్ణ బలం అనీ నొక్కి చెబుతున్నారు. పైగా ప్రపంచంలో ఏ మూల గాలించి చూసినా.. సంతోషంగా ఉన్నవాళ్లే సంపూర్ణ జీవితాన్ని గడపగలుతున్నారు. మరి ఈ సంతోషాన్ని ఇలాగే పొదివి పట్టుకోవాలంటే? 
మనకూ ఒక ‘ఇకిగాయ్‌’ ఉండాలంటున్నారు జపాన్‌ వాసులు. సంతోషానికీ శాస్త్రీయ సూత్రాలు చెబుతున్నారు పరిశోధకులు. పలకరింపు నుంచి పచ్చిక బయలు వరకూ.. ప్రతిదీ మన సంతోషానికే ఉన్నాయంటున్నారు మనస్తత్వవేత్తలు. అందుకే నూతన సంవత్సర ఆరంభ ఘడియల్లో.. మన జీవితాలను మరింత సంతోషభరితం చేసుకునేందుకు ఈ ఆనంద భాండాగారాన్ని మీ ముందు ఆవిష్కరిస్తోంది.. నేటి ఈనాడు!

సరికొత్త సంతోషానికి స్వాగతం!

సరికొత్త సంతోషానికి స్వాగతం!

సంతోషం సంపూర్ణ బలం

సంతోషం.. ‘సగం బలం’ అన్నది తాతల కాలం నుంచీ చెప్పుకొంటున్న మాట! కానీ ఈ ఆధునిక యుగంలో దీని అర్థమే మారిపోయింది. శాస్త్రవేత్తల నుంచి ఆధ్యాత్మిక వేత్తల వరకూ ఎవర్ని కదిపినా.. అసలు సంతోషమే సంపూర్ణ బలం అంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఏ మూల గాలించి చూసినా.. సంతోషంగా ఉన్నవాళ్లే సంపూర్ణ జీవితం గడుపుతున్నారు. వాళ్లే ఉత్సాహంగా, ఉల్లాసంగా పండు వయసు వరకూ పరిపూర్ణ జీవిస్తున్నారు. మరి ఆ సంతోషాన్ని మనమూ చేజిక్కించుకోవాలంటే..? మీకూ ఒక ‘ఇకిగాయ్‌’ ఉండాలంటున్నారు జపాన్‌ వాసులు. సంతోషానికీ శాస్త్రీయ సూత్రాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. చిరునవ్వుల పలకరింపు నుంచి ఆకుపచ్చటి పచ్చిక వరకూ.. ప్రతిదీ మన సంతోషానికే అంటున్నారు మనస్తత్వవేత్తలు. మనకీ అవగాహన ఎంత పెరిగితే అంత సంతోషం! అందుకే ఈ నూతన సంవత్సర ఘడియల్లో.. మన జీవితాలను మరింత సంతోషభరితం చేసుకునేందుకు ఈ ఆనంద భాండాగారాన్ని ఒక్కసారి తడిమిచూద్దాం! 

మీకుండాలి కిగాయ్‌

సరికొత్త సంతోషానికి స్వాగతం!

జీవితానికి  
అత్యంత ముఖ్యమైనది... సంతోషం!  
దానికి దక్కే బోనస్‌... నూరేళ్ల ఆయుష్షు.  
మనం ఆనందంగా ఉంటూ నూరేళ్లు జీవించాలనుకుంటే..  
ముందుగా తెలుసుకోవాల్సింది... ‘ఇకిగాయ్‌’ గురించే!  
జపాన్‌లోని ఒకినావా దీవుల్లో నూరేళ్లు పైబడినవారి సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి 2000 మందిలో ఒకరు ఇలాంటి వారే. ఎందుకిలా అన్నది చాలాకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. వీళ్లు ఆహారాన్ని చాలా మితంగా తీసుకుంటారు. వీళ్లెవరూ అసలు పనిచేయకుండా ఉండరు. ఉండలేరు. వీరికి పనిలోనే ఆనందం. ఆశ్చర్యకరంగా- ఒకినావా ప్రజల భాషలో ‘రిటైర్మెంట్‌’కు ప్రత్యేకంగా ఓ పదమన్నదే లేదు! రైతులు, మత్స్యకారులు వంటి వృత్తులవారు కూడా దాదాపు మరణించే వరకూ పనిచేస్తూనే ఉంటారు. ఉదయాన్నే నిద్ర లేస్తున్నామంటే ఆ రోజుకు ఏదోక అర్థం, సార్థకత, ప్రత్యేకత ఉండాలన్నది వీరి సూత్రం. ఈ దీవిలో నూరేళ్ల పైబడిన వాళ్లంతా కలిసి ‘కెబిజి84’ పేరుతో ఒక పాప్‌ సంగీత బ్యాండ్‌ కూడా నడుపుకొంటున్నారు. వీళ్లు అంతటి అంకితభావంతో పనిచేయడానికి కారణం- ఇకిగాయ్‌! పేర్లు వేరయినా ఇటలీలోని సార్డినా, కాలిఫోర్నియాలోని లోమా-లిండా, కోస్టారియాలోని నికోయా, గ్రీస్‌లోని ఇకారియా తెగవాళ్లు కూడా సరిగ్గా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. సంతోషంగా జీవిస్తున్నారు.

‘కోటి విద్యలు కూటి కోసమే’నని మనకు బాగా తెలుసు. కానీ, తిండితోపాటు సంతోషాన్ని కూడా కలిగించే పని ఎంచుకోమంటుంది ఇకిగాయ్‌. మనం రోజూ మేల్కోవాల్సింది, అనుక్షణం బతకాల్సింది దీని కోసమే! అప్పుడే మన మనుగడ సంతృప్తిగా, సంతోషంగా సాగుతుంది. జీవిత గమనం పట్ల సద్భావన కలుగుతుంది. మనం ఏపని చేసినా- అది మనకు బాగా ఇష్టమైనదే కాకుండా, మనం బాగా చేయగలిగేది, సమాజానికి పనికొచ్చేది, పైగా ఆదాయం కూడా దండిగా తెచ్చేదైతే... అంతకన్నా గొప్ప ఇకిగాయ్‌ (సంతోషం కలిగించే పని) ఇంకేముంటుంది మనకు! ఆ నాలుగింటిలో ఏది లోపించినా, ఆ వెలితి మనసును తొలుస్తూనే ఉంటుంది. అందుకే ఒకినావాన్లు తమకు సరిపడే ఇకిగాయ్‌లను రూపొందించుకుని, వాటి ప్రకారం సుఖభరితమైన జీవనం సాగిస్తుంటారు.

సరికొత్త సంతోషానికి స్వాగతం!

నిరాశకు జిజ్ఞాసే మందు

ప్రపంచ వ్యాప్తంగా నలుగురిలో ఒకరు ఎప్పుడోకప్పుడు మానసిక సమస్యతో సతమతమవుతున్నారనీ, 2020 నాటికి కుంగుబాటు మానవాళికి పెను ముప్పుగా మారుతుందనీ, ఈ కారణంగా చాలామంది జీవితాల్లో 20% వృథాగానే గడిచిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కగట్టింది. ఇలాంటి వారి బతుకుల్లో ‘ఇకిగాయ్‌’ వెలుగులు నింపగలదు. కాకపోతే, వీరు వదిలించుకోవాల్సిన జాడ్యం ఒకటుంది. అదే... రొటీన్‌! బొత్తిగా జిజ్ఞాస లేకుండా కాలాన్ని వెళ్లబుచ్చే గుణాన్ని వదిలించుకుంటే, చాలామందిలో గూడుకట్టుకున్న నిరాశ, అశాంతి, అసంతృప్తి పటాపంచలైపోతాయంటున్నారు... తత్వవేత్త హోవార్డ్‌ థర్మాన్‌! 

ఎందుకిది?

జీవితాన్ని ఆనందకరంగా, సంతృప్తికరంగా, దీర్ఘాయువుగా మార్చడమే ఇకిగాయ్‌ లక్ష్యం. ఎవరి ఇకిగాయ్‌ వాళ్లదే. ఎవరికి వాళ్లు తమ ఇష్టాయిష్టాలకు, సామర్థ్యాలకు, అవసరాలకు తగ్గట్టు దీన్ని రూపొందించుకోవచ్చు. ఇది నాలుగు అంశాల సమాహారం. ఈ నాలుగింటితోచక్కని  
ఇకిగాయ్‌ని రూపొందించుకుంటే మన భవిష్యత్తును నిర్వచించుకున్నట్టే లెక్క! దీన్ని సమర్థంగా ఆచరించేందుకు దశ నియమాలివీ... 
అనురక్తి (పాషన్‌) 
మీకు ఏపని చేయడమంటే ఇష్టమో, ప్రేమో... దానిలో నిమగ్నం కావడం ద్వారా ఆనందం కలుగుతుంది. అందులో ఎంతసేపు గడిపినా అలసట అనిపించదు. ఇంకా ఇంకా అందులో నైపుణ్యం సాధించాలనిపిస్తుంది. అదే ఇష్టం లేని పనిని చేయడం, చేయించడం కూడా ఒత్తిడి అనిపిస్తుంది. అసంతృప్తి కలిగిస్తుంది. చివరకు అది భారంగా పరిణమిస్తుంది. 
సేవా దృష్టి (మిషన్‌) 
ఇష్టమైన పని చేస్తే మనకు సంతృప్తి కలుగుతుంది. సరే. కానీ, అదెవరికీ పనికిరాకపోతే? దానిని ఎవరూ గుర్తించకపోతే? చివరకు మళ్లీ కలిగేది అసంతృప్తే. ప్రజల అవసరాలను తీర్చే పనినే మనం ఇష్టపడినప్పుడు దాని వల్ల కలిగే ఆనందం ఎక్కువగా ఉంటుంది. దీన్ని సేవా తత్పరతతో చేపడితేమరింత ప్రోత్సాహం లభిస్తుంది. 
పనితనం (ఒకేషన్‌) 
మనకు నచ్చిన, సమాజానికి అవసరమైన ఏదోక పనిని చేపడితే సరిపోదు. అది మనం బాగా చేయగలిగేదై ఉండాలి కూడా. చెప్పాలంటే మిగతావారి కంటే మనం దాన్ని ఎంతో బాగా పూర్తిచేయాలి. మన పనితనం కనపడాలి. నాణ్యంగా, కళాత్మకంగా చేసేపని మనకు అత్యంత సంతోషం కలిగిస్తుంది. 
వృత్తి (ప్రొఫెషన్‌)  
చాలా ముఖ్యమైనదిదే. సమాజ అవసరాలు తీర్చే పని చేస్తే డబ్బులొస్తాయి. దాన్ని మరింత నైపుణ్యంతో చేయగలిగితే ఆదాయం మరింత పెరుగుతుంది. కానీ, అది మనకు ఇష్టంలేనిదైతే మాత్రం.. మనకు ఎలాంటి ఆనందం లభించదు. ఒకినోవా ప్రజలు వీటన్నింటితో పాటు తాము ప్రేమించే పనినే వృత్తిగా ఎంచుకుంటారు. 
1. నిత్యం చైతన్యంగా ఉండాలి.  
2.ఉరుకులు పరుగులు వద్దు.  
  ప్రతి నిమిషాన్నీ సావధానంగానే గడపాలి. 
3. కడుపు 80% నిండే వరకూ మాత్రమే తినాలి. 
4. మంచి మిత్రుల మధ్యలోనే గడపాలి. 
5. రోజూ వ్యాయామం చేయాలి. 
6. ఇతరులతో నవ్వుతూ, సద్భావంతో మెలగాలి.  
7. ప్రకృతి లోగిళ్లలో సమయం గడపాలి.  
8. పొందే ప్రతి సాయానికీ ‘థ్యాంక్స్‌’ చెప్పాలి. 
9. ‘ఈ క్షణం’లోనే బతకాలి. 
10. ఎవరికి వారు తమ ఇకిగాయ్‌ని ఆచరించాలి.
 

సంతోష సందేశం

ప్రపంచంలో సంతోష సూచికల్లో అగ్రభాగాన ఉన్న దేశం ఫిన్‌లాండ్‌ 

సరికొత్త సంతోషానికి స్వాగతం!

ఫిన్‌లాండ్‌! రష్యాలా పెద్దది కాదు. అమెరికాలా కలల దేశమూ కాదు. అయితేనేం! ఈ ఏడాది ఐరాస విడుదలచేసిన ప్రపంచ సంతోషదాయక దేశాల జాబితాలో తొలిస్థానం దీందే. అక్కడి ప్రజలు తమ దగ్గరున్న వస్తువులతోనే సంతృప్తి చెందుతారు. లేని వాటి గురించి అస్సలు  విచారించరు. ప్రజల మధ్య సత్సంబంధాలే తప్ప వైషమ్య భావాలన్నవే కానరావు.  ఈ దేశంలో తలసరి ఆదాయం ఎక్కువేం కాదు. పైగా అమెరికాలో కంటే పన్నులు ఎక్కువ. అయినా ప్రజలకు చింత లేదు. కారణం... తాము చెల్లిస్తున్న పన్నులు సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుందని వారు బలంగా నమ్మటమే. ఈ ఏడాది విడుదలైన సురక్షిత ప్రాంతాల జాబితాలోనూ ఫిన్‌లాండ్‌ అత్యుత్తమమైనదని తేలింది.  ఉగ్రవాదానికి, అభద్రతకు ఇక్కడ చోటే లేదు. అత్యంత సహనశీల దేశమూ ఇదే. లింగ సమానత్వం కూడా ఎక్కువే. బ్లూంబర్గ్‌ ప్రపంచ ఆరోగ్య సూచీ ప్రకారం ఫిన్‌లాండ్‌ అత్యంత ఆరోగ్యకర దేశాల్లో రెండోస్థానం దక్కించుకుంది. తొలిస్థానంలో ఇటలీ నిలిచినా.. ఇటలీకి, ఫిన్‌లాండ్‌కు పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదని స్వయంగా అధ్యయన కర్తలే స్పష్టం చేయడం విశేషం. 

ఆనంద జీవితం

ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే వ్యకి...బౌద్ధభిక్షువు మాథ్యూ రిచర్డ్‌ 

సరికొత్త సంతోషానికి స్వాగతం!

రిచర్డ్‌ కాఠ్‌మాండూలోని శెచన్‌మాన్‌స్టరీలోని బౌద్ధ సన్యాసుల్లో ప్రముఖులు. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌లో డాక్టరేట్‌ అందుకున్నారు. దలైలామాకు ఆకర్షితుడై సర్వస్వాన్ని వదిలి బౌద్ధసన్యాసిగా మారిపోయారు. విస్కాన్సిన్‌ యూనివర్సిటీ తన పరిశోథనల్లో భాగంగా రిచర్డ్‌ మెదడును 256 సెన్సర్‌లతో అనుసంధానం చేసింది. రిచర్డ్‌  ధ్యానం చేస్తున్న సమయంలో వెలువడిన గామా కిరణాలు మునుపెన్నడూ కనిపించలేదట. స్కానింగ్‌ నివేదికలను పరిశీలించిన న్యూరోసైంటిస్టు.. ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉండే వ్యక్తిగా రిచర్డ్‌ డేవిడ్సన్‌ను ప్రకటించారు. ప్రతికూల భావాలేమీ ఆయనలో లేవని ప్రకటించారు. రిచర్డ్‌..  ఫ్రెంచి తత్త్వవేత్త జీన్‌ ఫ్రాంకోయిల్‌ రెవెల్‌, చిత్రకారిణి యానోలిమిలిన్ల ముద్దుబిడ్డ. 1972లో చదువు పూర్తయిన తర్వాత ఈ వాతావరణంపైన రిచర్డ్‌కి ఆసక్తి సన్నగిల్లింది. ఆయనలో ఆధ్యాత్మికత మొగ్గతొడిగింది. అప్పటికే ప్రతిసారీ సెలవులకి భారతదేశం వచ్చేవారు. బుద్ధిజాన్ని అధ్యయనం చేయటం ప్రారంభించారు. తను సేకరించిన వేలాది పుస్తకాలను విద్యార్థుల సేవలో నిమగ్నమైన వందకు పైగా సంస్థలకు ఇచ్చివేశారు. హిమాలయాలు ఆయన ఆరాధ్య ప్రదేశమైంది. ‘సైన్స్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ పైన ఆయన చేసిన పరిశోధనలు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఆయన రచన ‘హ్యాపినెస్‌ .. ఎ గైడ్‌ టు డెవలపింగ్‌ లైవ్స్‌ మోస్ట్‌ ఇంపార్టెంట్‌ స్కిల్‌’ సంతోష జీవనానికి ఏ మార్గాన్ని ఎంచుకోవాలో చెబుతుంది.

పంచ సూత్రాలు

సరికొత్త సంతోషానికి స్వాగతం!

నిండు నూరేళ్లు జీవించు... దీర్ఘాయుష్మాన్‌ భవ!...  
దీవించాలి కాబట్టి ఇలా అంటారా? లేక నిజంగానే నూరేళ్ల జీవితం సాధ్యమవుతుందా? ఎంతోమందికి సాధ్యమైంది మనకెందుక్కాదు! 
సరికొత్త సంతోషానికి స్వాగతం!వందేళ్లు జీవించినవారిలో కనిపించే సాధారణ లక్షణమిది. చుట్టూ ఉండే సమాజంతో మమేకమవుతూ, నలుగురితో కలిసిమెలిసి జీవించడం ద్వారా మన ఆయుర్దాయాన్ని కొన్నేళ్లపాటు పొడిగించుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇరుగుపొరుగు వారితో కలివిడిగా ఉండటం వల్ల... మనకు తెలియకుండానే ఒకలాంటి భద్రతాభావం, మానసిక సంతృప్తి కలుగుతాయట. ఒంటరిగా కాలం వెళ్లదీసేవారి కంటే, భాగస్వామితో కలిసి జీవించేవారి ఆయుర్దాయమే ఎక్కువని తొలిసారిగా 1858లోనే తేలిపోయింది! బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పరిశోధకుడు విలియం ఫార్‌ అప్పట్లోనే దీన్ని రుజువుచేశారు కూడా! 

సరికొత్త సంతోషానికి స్వాగతం!చేసేపని, తినే ఆహారం, ఉపయోగించే వస్తువులతో పాటూ... తమ అలవాట్ల పట్లా చాలా సంతృప్తితో ఉంటారట శతాధికులు. దేని గురించీ పెద్దగా చింతించకపోవడం వీరి నుంచి నేటితరం నేర్చుకోవాల్సిన విషయం. తృప్తి భావనతో ఉండటం వల్ల మానసిక ఒత్తిళ్లు చాలామటుకు దూరమైపోతాయి. మన శరీరంలోని జీవకణాలు కూడా సహజసిద్ధమైన ‘ఎంకెలైటిన్‌’ అనే యాంటీబయాటిక్‌ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు వాటంతట అవే సర్దుకుపోతాయి. రోమ్‌లోని ‘స్కూల్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ నోట్రే డేమ్‌’ అనే క్రైస్తవమఠ సన్యాసినుల్లో కనిష్ఠంగా పదోవంతు మంది నూరేళ్లకుపైగా జీవిస్తుండటానికి కారణమిదే. 
సరికొత్త సంతోషానికి స్వాగతం!ప్పు, కారం, మసాలాలను బాగా దట్టించిన జంక్‌ ఫుడ్‌ను తినొద్దని ఎంత మొత్తుకుంటున్నా... చాలామంది వినడం లేదు. వీటిని పొట్టనిండా నింపేస్తుంటారు. పైగా వ్యాయామం ఊసే ఉండదు! ఈ కారణంగానే అధిక బరువు, ఊబకాయంతో మనచుట్టూ బాధపడుతున్నవారెందరో! అక్కడితో ఈ సమస్య ఆగిపోదు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి సమస్యలెన్నో క్రమక్రమంగా మనిషిని కుంగదీసి మృత్యువుకు చేరువచేస్తాయి. శతాధికులది ఇందుకు పూర్తి విరుద్ధమైన జీవనశైలి. వారు కడుపు నిండా ఏనాడూ తినరు. నెమ్మదిగా ఆహారాన్ని నమిలి తినడమే కాకుండా, 80% కడుపు నిండిన వెంటనే ఇక తీసుకోవడం మానేస్తారు. 
సరికొత్త సంతోషానికి స్వాగతం!రోటీన్‌తో చప్పగా సాగిపోతుంటుంది జీవితం! రాన్రాను రోజులు భారంగా గడుస్తుంటాయి కూడా. చాలామంది వృద్ధులు ఇదే మానసిక భావనతో ఉంటున్నట్లు చాలా అధ్యయనాలు అంచనాకొచ్చాయి కూడా. జీవితం ఎప్పుడూ ఆసక్తిగా, ఉత్సాహంగా ఉండాలంటే... భిన్నత్వానికి చోటివ్వాల్సిందే. అప్పుడప్పుడు యాత్రలు, సముద్ర యానాలు, కొత్త ప్రాంతాలను చుట్టి రావడం, కొత్త అభిరుచుల్లో మునిగితేలడం వంటివి చేస్తుండాలంటున్నారు మానసిక నిపుణులు. అయితే, సురక్షితంగానే ఇలాంటి వాటిని చేపట్టాలి. జీవితాన్ని ఫణంగా పెట్టే రిస్క్‌ మాత్రం చేయకూడదు. శారీరకంగా ఇబ్బంది ఉన్నవారు చిత్రలేఖనం, సంగీతం వంటి వాటిని ప్రయత్నించవచ్చు. 
సరికొత్త సంతోషానికి స్వాగతం!‘నవ్వడం ఒక యోగం. నవ్వించడం ఒక భోగం. నవ్వకపోవడం ఒక రోగం’ అన్న నానుడి తెలిసిందే. శతాధికుల్లో ఉండే మరో సహజ లక్షణం మనస్ఫూర్తిగా నవ్వుకోవడం. వీళ్లను చూస్తే తెలుస్తుంది ఏం కోల్పోతున్నామో! మనస్ఫూర్తిగా నవ్వితే ఒత్తిళ్లన్నీ ఇట్టే చిత్తయిపోతాయంటున్నారు... ‘న్యూ ఇంగ్లండ్‌ సెంటినేరియన్‌ స్టడీ’ చేపట్టిన థామస్‌ పెర్ల్స్‌. కొద్దిపాటి ఒత్తిడి మంచిదే అయినా, అది తాత్కాలికంగా మాత్రమే ఉండాలట. సానుకూల దృక్పథంతో ఉండేవారికి జబ్బులు, ఇన్ఫెక్షన్లు అంత తొందరగా దరిచేరవనీ, ఒకవేళ అవి చుట్టుముట్టినా శీఘ్రంగా కోలుకుంటారన్నది నెదర్లాండ్స్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ పరిశోధకుల మాట.
 
 

మన సంతోష నగరాలు...

సరికొత్త సంతోషానికి స్వాగతం!

ఎవరు చేపట్టారు? 
మన దేశంలో అత్యంత సంతోషభరిత నగరాల్లో చండీగఢ్‌ది తొలిస్థానం. హైదరాబాద్‌కు పన్నెండో స్థానం దక్కింది. ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎల్‌జీతో కలిసి... ప్రపంచ ప్రఖ్యాత మార్కెట్‌ పరిశోధన సంస్థ ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్‌ మూడేళ్ల కిందట ఈ సర్వే నిర్వహించింది.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.