close

ప్ర‌త్యేక క‌థ‌నం

వర్షాలు ఎక్కువ.. నీరు తక్కువ!

పట్టణాల్లో వరదలు.. ఖాళీప్రాంతాల్లో కరవు 
ప్రపంచవ్యాప్తంగా ఎండిపోనున్న నదులు 
భవిష్యత్తులో చిత్రమైన వాతావరణ మార్పులు 
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌   విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనం

మెల్‌బోర్న్‌: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా భవిష్యత్తులో విచిత్ర పరిస్థితులు నెలకొననున్నాయి. ఓవైపు వర్షాలు విస్తారంగా కురిసినా, నీటికి కటకట తప్పదు. ప్రపంచవ్యాప్తంగా కరవుకాటకాలు సర్వసాధారణం కానున్నాయి. నేల పొడిబారడమే దీనికి ప్రధాన కారణమని ప్రొఫెసర్‌ ఆశిష్‌శర్మ నేతృత్వాన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. 160 దేశాల్లోని 43వేల వర్షపాతం నమోదు కేంద్రాలు, 5300 నదుల పర్యవేక్షణప్రాంతాల నుంచి సేకరించిన సమాచారాన్ని నాలుగేళ్లపాటు విశ్లేషించారు. ఈ సమాచారాన్ని కంప్యూటర్లను ఉపయోగించి భవిష్యత్తు వాతావరణ నమూనాలను సృష్టించారు. విచిత్రమైన వాతావరణ పరిస్థితులు తలెత్తనున్నట్లు అధ్యయనంలో తేలింది.

వాతావరణంలో తేమ తగ్గిపోవడం వల్లే 
హరితవాయువులు, భూతాపం తదితర కారణాల వల్ల భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఫలితంగా గాలిలో తేమశాతం తగ్గుతుంది. పర్యావరణవ్యవస్థ సక్రమంగా సాగాలంటే తేమ నిర్ణీతశాతం ఉండాల్సిందే. ఇందుకోసం నేల నుంచి తేమను ఎక్కువగా పీల్చుకుంటుంది. పర్యవసానంగా నేల పొడిబారిపోతుంది. నదులు, చెరువులు, జలాశయాల్లో ఉన్న నీరు ఆవిరిరూపంలోకి ఎక్కువగా మారిపోతే.. నదీపరివాహక ప్రాంతాల చుట్టుపక్కల భూమి నెర్రెలు బారుతుంది. పరివాహకప్రాంతాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, సాధారణ భూమిలో మరింత విషమిస్తుంది. ఫలితంగా భూమిలో మొక్కలు పెరగడానికి నీరు లభ్యం కాదు. ఇది కరవు విలయతాండవం చేయడానికి కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం చేయడం కష్టమవుతుంది.

పట్టణాల్లో వరదలు 
అకాల భారీవర్షాల కారణంగా నగరాలు, పట్టణాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. వరదలు ముంచెత్తుతాయి. జనావాసాలులేని మైదానాలు, పర్వతప్రాంతాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటిచోట్ల వరదల ముప్పు తక్కువగా ఉంటుంది. పొడిబారిన నేల ఎక్కువగా నీటిని పీల్చేసుకోవడమే దీనికి కారణం.

నీటిని నిల్వ చేయలేం 
తరచూ ఏర్పడే పెద్దపెద్ద తుపాన్ల కారణంగా భారీవర్షాలు కురుస్తాయి. ఆ నీటిని నిల్వ చేసే జలాశయాల సామర్థ్యం తక్కువగా ఉన్నందున ఎక్కువనీటిని ఒడిసి పట్టలేం. డ్యాముల్లో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల వేలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుంది.


బ్లూవాటర్‌ వర్సెస్‌ గ్రీన్‌ వాటర్‌ 

భూమిపై వర్షం సమయంలో పడే ప్రతి వంద బిందువుల్లో 36 బిందువులు మాత్రమే నదులు, చెరువులు, జలాశయాల్లోకి చేరుతాయి. ఇది మానవావసరాలకు ఉపయోగపడుతుంది. దీన్ని ‘‘బ్లూవాటర్‌’’ అంటారు. మిగిలిన నీరు నేలలో ఇంకి, గాలిలో తేమ రూపంలో ఆవిరిగా మారి జీవావరణానికి ఉపకరిస్తుంది. దీన్ని ‘‘గ్రీన్‌వాటర్‌’’గా వ్యవహరిస్తారు. వాతావరణమార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి కాబట్టి, గాలిలో తేమ తగ్గుతుంది. ఫలితంగా బ్లూవాటర్‌లో ఎక్కువశాతాన్ని జీవావరణ వ్యవస్థ వినియోగించుకుంటుంది. పర్యవసానంగా మానవావసరాలకు నీటిలభ్యత తగ్గుతుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.