close

ప్ర‌త్యేక క‌థ‌నం

గౌన్లు.. గ్లాసులు.. జగ్గులు 

ఏ గుర్తు కేటాయిస్తే ఆ వస్తువు పంపకం 
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడ 
తొలివిడతకు 12,202 మంది అభ్యర్థులు సై! 
ఏకగ్రీœవమైన 769 పంచాయతీలు, 10,654 వార్డులు 
రెండో విడతలో 25,419 నామినేషన్లు దాఖలు 
ఈనాడు - హైదరాబాద్‌

ప్రతి ఇంటికీ డజను గాజు గ్లాసుల పంపిణీ, మరోచోట ఇంటికి రెండేసి నీళ్ల జగ్గులు. ఇంకో ఊళ్లో చిన్నారులు ఉన్న ఇంట్లో నజరానాగా గౌన్లు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు ఏయే గుర్తులు కేటాయించారో.. వీలైనంతవరకూ అభ్యర్థులు ఆ వస్తువులనే పంచుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడతకు అభ్యర్థులు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి ఊపందుకుంది. ఇప్పటికే రెండు విడతల్లోని పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఎన్నికల్లో పల్లె వాతావరణానికి దగ్గరగా ఉండే అనేక గుర్తులు కేటాయించారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఆయా గుర్తులతో ఫ్లెక్సీలను అచ్చువేయించుకుంటున్నారు. కరపత్రాలు, నమూనా బొమ్మలతో ప్రచారం చేస్తున్నారు. కొందరు ఏకంగా ఆ వస్తువులనే పంచిపెట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

పండగ రోజు వనభోజనాలు 
పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు కొందరు కనీసం రూ.5 లక్షల వరకు వ్యయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ‘దావత్‌’లు ఊపందుకున్నాయి. మందు, మాంసం పంపకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకుని వనభోజనాల పేరుతో కూడా గ్రామస్థులను ఖుషీ చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పండగ రోజు వనభోజనాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘ఓటరు నోటిలో మన గుర్తు నానితే చాల్‌రా బై..’ అంటూ కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలో ఓ సర్పంచి అభ్యర్థి వేసుకుంటున్న అంచనాలను అనుచరులు ప్రస్తావిస్తున్నారు.

తేలిన ఏకగ్రీవాలు 
మొదటి విడతలో పంచాయతీల్లో నామినేషన్‌ ప్రక్రియ అనంతరం 769 ఏకగ్రీవాలను తేల్చారు. ఇందులో సగానికిపైగా తెరాస మద్దతుదారులే ఉన్నారు. రెండోస్థానంలో కాంగ్రెస్‌, స్వతంత్రులు, ఆ తర్వాతి స్థానంలో భాజపా మద్దతు దారులు ఉన్నారు. తొమ్మిది పంచాయతీల్లో ఒక్క నామినేషన్‌ కూడా చెల్లలేదు. ఇక్కడ ఉప సర్పంచులే కీలకంగా మారనున్నారు. అత్యధికంగా కామారెడ్డిలో 133 పంచాయతీలకు 688, రాజన్న సిరిసిల్లలో 67 పంచాయతీలకు 279 నామినేషన్లు చొప్పున దాఖలయ్యాయి. మెదక్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ తదితర జిల్లాల్లోనూ కొన్ని పంచాయతీల్లో బహుముఖ పోటీ నెలకొంది. నామినేషన్ల దాఖలు సందర్భంగా చాలా జిల్లాల్లో పెద్ద ఎత్తున పోటీకి నిలిచిన వారు క్రమంగా మెత్తబడ్డారు. కొన్నిచోట్ల ఒక్కోపార్టీలోని ఐదారుగురు కూడా నామినేషన్లు వేశారు. పార్టీ నాయకుల బుజ్జగింపులు, తాయిలాలతో చాలామంది వెనక్కుతగ్గారు. నామినేటెడ్‌ పోస్టుల ఆశకూడా కొంతవరకు పనిచేసింది. చివరికి పన్నెండువేలకు పైగా బరిలో నిలిచారు. రెండో విడత ఎన్నికల్లో 14న నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. 17న ఉపసంహరణ, అభ్యర్థుల ఖరారు ఉంటాయి. మూడో విడతతో 16 నుంచి నామినేషన్ల దాఖలు షురూ కానుంది.


‘పంచాయతీ’లోనూ గుర్తుల గుబులు 

గౌన్లు.. గ్లాసులు.. జగ్గులు 

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంల్లో ట్రక్కు గుర్తు.. తెరాస కారు గుర్తుతో పోలి ఉండడంతో కొన్నిచోట్ల ఫలితాలే తారుమారయ్యాయి. దీన్ని సీఎం కేసీఆర్‌ ఏకంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ అభ్యర్థులకు గుర్తుల గుబులు మొదలైంది. సర్పంచి, వార్డు సభ్యులకు కేటాయించిన గుర్తుల్లో కొన్నింటికి బాగా దగ్గర పోలికలున్నాయి. పైగా అభ్యర్థి ఫొటో కూడా ఉండదు. దీంతో ఓటరు గందరగోళానికి గురయ్యే ఆస్కారం ఉంది. పంచాయతీల విభజన తర్వాత దాదాపు అన్ని పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య తగ్గిపోయింది. అయిదారుగురు ఓటర్లు తికమకపడ్డా గెలుపోటములు తారుమారవుతాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 
్య సర్పంచి బ్యాలెట్‌ పత్రాల్లో బ్యాట్‌, విమానం.. బ్లాక్‌బోర్డు, పలక.. ఫోర్కు, చెంచా ఇవన్నీ దగ్గర పోలికలతో ఉన్నాయి. ఫోర్కు అంటే తెలియనివాళ్లు చెంచాకు ఓటేసే అవకాశం ఉంది. బిస్కెట్‌, గాలిబూర గుర్తులు అర్ధం చేసుకోవడానికి కష్టంగా ఉన్నాయి. వేణువు చూడ్డానికి ఇంకుపెన్నులా ఉంది.

* వార్డు సభ్యుల గుర్తుల్లో హాకీ బంతి, నెక్‌టై లాంటివి పాతతరం కావు. గ్యాసు స్టవ్‌, గ్యాసు సిలిండర్‌ రెండూ ఒకటే అని భావించే ప్రమాదం ఉంది. డిష్‌ యాంటీనా, విద్యుత్తు స్తంభం అర్థమయ్యేలా లేవు. 


* తొలి విడత ప్రకటన విడుదలైన పంచాయతీలు: 4,479 
* ఏకగ్రీవమైనవి: 769 
* ఎన్నికలు జరిగే పంచాయతీలు: 3,701 
* దాఖలైన నామినేషన్ల సంఖ్య: 27,940 
* ఉపసంహరణల అనంతరం తేలిన అభ్యర్థులు: 12,202 మంది 
* ప్రకటన విడుదలైన వార్డుల సంఖ్య: 39,822 
* ఏకగ్రీవమైన వార్డుల సంఖ్య: 10,654 
* ఎన్నికలు జరిగే వార్డులు: 28,976 
* అభ్యర్థులు, గుర్తులను ప్రకటించింది: ఈ నెల 13న 
* వార్డు సభ్యుల ఎన్నికకు పోటీలో నిలిచినవారు: 70,094 మంది 
* రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీలు: 4,135 
*సర్పంచి స్థానాలకు దాఖలైన నామినేషన్లు: 25,419 
*ఎన్నికలు జరిగే వార్డుల సంఖ్య: 36,602 
* దాఖలైన నామినేషన్లు: 91,458 
* నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ: జనవరి 17

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.