close

ప్ర‌త్యేక క‌థ‌నం

పచ్చగా బతకండి 

మాంసం తగ్గించండి 
తిండి మార్చుకోకుంటే తిప్పలే 
లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌ నివేదిక హెచ్చరిక

పచ్చగా బతకండి 

ఆహారపు అలవాట్లను మార్చుకోకుండా, ఆహార ఉత్పత్తిని పెంచకుండా, ఆహార వృథాను అరికట్టకుండా.. ప్రపంచ మానవాళికి ఆరోగ్యకరమైన, సమతుల ఆహారాన్ని అందించలేం

- లాన్సెట్‌ నివేదిక

నలభై, యాభై ఏళ్లు వెనక్కి తిరిగి చూడండి. మనపెద్దల తిండి అలవాట్లను గుర్తుచేసుకోండి. బంధువు వచ్చినప్పుడో, పండగ పబ్బానికో తప్పితే వారు మాంసాహారం జోలికి వెళ్లేవారు కాదు. గింజలు, కూరగాయల్నే ఎక్కువగా వండుకు తినేవారు. ఆహారపు అలవాట్ల కారణంగా రోగాల బారినపడిన వారు చాలా తక్కువ. కానీ ఇప్పుడు మనిషి జీవనశైలితో పాటే ఆహారపు అలవాట్లూ పూర్తిగా మారిపోయాయి. మాంసాహారాన్ని విపరీతంగా వినియోగిస్తున్నాం. శృతిమించి శుద్ధిచేసిన ఆహారం, నూనెలు, వేపుళ్లను విరివిగా వాడుతున్నాం. గింజలు, పండ్లు, కూరగాయలు, దినుసులతో కూడిన సమతుల ఆహారానికి దూరమయ్యాం. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాల్ని అందించలేకపోతున్నాం. మాంసం అతి వినియోగం వల్ల మన శరీరంతో పాటే.. ప్రపంచ పర్యావరణానికీ చేటు తెస్తున్నాం. దీనివల్ల భూగోళానికి పెనుముప్పు తప్పదని, మనిషి ఆహారపు అలవాట్లను తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ‘లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌’ ప్రమాద ఘంటికలు వినిపించింది. 2050 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుకుంటుందని, వారందరికీ తిండి పెట్టాలన్నా, వాతావరణ మార్పుల్ని అరికట్టాలన్నా మానవాళి తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందంటున్న లాన్సెట్‌ హెచ్చరికలపై ప్రత్యేక కథనం

విశృంఖల లైంగిక సంబంధాలు, మద్యపానం, ధూమపానం కంటే ఎక్కువగా అనారోగ్యకర ఆహారపు అలవాట్లే మనుషుల్ని చంపుతున్నాయి

ఆహారపు అలవాట్లను మార్చుకుంటే యేటా 19 నుంచి 23% దాకా మరణాలను తప్పించొచ్చు 

21వ శతాబ్దంలో ఆరోగ్యం,పర్యావరణానికి ఆహారమే అతిపెద్ద సవాల్‌గా తయారైంది 

మనిషి ఆహారపు అలవాట్లను మార్చుకుని తనకు తాను హాని చేసుకుంటున్నాడు. ప్రపంచానికీ ముప్పు తెస్తున్నాడు. కొత్తతరహా ఆహారపు అలవాట్లతో మనిషి ఎలాంటి అనర్థాలను కొనితెచ్చుకుంటున్నదీ ‘లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌’ కళ్లకు కట్టింది. ఈ అనవసర ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడున్న ఆహార అలవాట్లను సంపూర్ణంగా మార్చుకోవాలని విస్పష్ట హెచ్చరిక చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు సంబంధించి లాన్సెట్‌ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ‘ఈట్‌-లాన్సెట్‌’ కమిషన్‌ అందించిన వివరాలతో ఈ నివేదికను వెలువరించింది. 16 దేశాలకు చెందిన 37 మంది శాస్త్రసాంకేతిక నిపుణులతో మూడేళ్లపాటు పనిచేసి ఆ సంస్థ ఈ నివేదిక రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని, వాతావరణ మార్పులకు (క్లెయిమెట్‌ ఛేంజ్‌) అవే ప్రధాన కారణమని గుర్తుచేసింది. ఈ అలవాట్లే ప్రపంచ మానవాళిని, నాగరికతను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. మాంసం, పాలపదార్థాల(డెయిరీ) వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, శాకాహార వినియోగాన్ని బాగా పెంచుకోవాలని నివేదిక స్పష్టంచేసింది. భూమండలంపై ఉన్న సహజ వనరుల సమతౌల్యాన్ని కాపాడుకోలేకపోతే జనాభాకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం సాధ్యంకాదని హెచ్చరించింది.

మాంసం ముంచుతోంది 
ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగం విపరీతంగా పెరిగింది. ఆసియాలో మరీ ఎక్కువగా ఉంది. 2017-2050 మధ్య ఆసియాలో మాంసం వినియోగం 78% పెరుగుతుందని సింగపూర్‌ కేంద్రంగా గల ఏషియా రీసెర్చ్‌ అండ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఇటీవల హెచ్చరించింది. మాంసం వినియోగం పెరిగే కొద్దీ గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు 290 కోట్ల టన్నుల నుంచి 540 కోట్ల టన్నులకు పెరుగుతాయి. 9.5 కోట్ల కార్లు ఏడాదికి వెలువరించే ఉద్గారాలతో ఇది సమానం. మాంసం అతి వినియోగం వల్ల వస్తున్న జబ్బుల్ని అరికట్టడానికి యాంటిబయాటిక్స్‌ను విపరీతంగా వినియోగించాల్సి వస్తుంది. 
 

పచ్చగా బతకండి 

పచ్చగా బతకండి లాన్సెట్‌ నివేదికలోని ముఖ్యాంశాలు...

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా యేటా 1.1 కోట్ల మంది అకారణంగా మృత్యువు పాలవుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది అవాంఛిత ఆహారం తీసుకుంటున్నారు. 
గత 50 ఏళ్లుగా ప్రధానంగా తీసుకుంటున్న ఆహారం వాతావరణ మార్పునకు ప్రధాన కారణమైంది. 
మనుషుల ఆరోగ్యంతోపాటు, ఈ భూమండలాన్ని రక్షించుకోవాలంటే ప్రపంచం మొత్తం సరికొత్త ఆహార అలవాట్లవైపు మొగ్గుచూపాలి. 
కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, గింజలు, అన్‌సాచ్యురేటెడ్‌ ఆయిల్స్‌, పరిమితంగా సముద్ర, పౌల్ట్రీ ఉత్పత్తులు తీసుకోవాలి. 
కనీసం 35 శాతం కేలరీలు కలిగిన గింజలు, ఇతరత్రా మొక్కల సంబంధ ఆహార ఉత్పత్తుల్నే తీసుకోవాలి. 
మాంసం(రెడ్‌మీట్‌, ప్రాసెస్డ్‌మీట్‌), చక్కెరతో కూడిన పదార్థాలు, అతిగా శుద్ధిచేసిన దినుసులు, పిండిపదార్థాలతో కూడిన కూరగాయల వినియోగాన్ని వీలైతే పరిహరించాలి. లేకపోతే అతితక్కువ మోతాదులో తీసుకోవాలి. 
ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తున్న ప్రభుత్వ విధానాలు రావాలి. లేదంటే కొత్తపన్నులు, సుంకాలు వేయాలి. ప్రజలకు హానిచేసే ఆహార పదార్థాలను విక్రయాల నుంచి ఉపసంహరించడమో, లేదంటే వాటిపై రేషన్‌ విధించడమో చేయాలి. 
మనుషుల ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరతను పెంపొందించే ఏకైక సాధనం ఆహారం మాత్రమే. 
ప్రపంచంలో 82కోట్ల మంది తగినంత ఆహారం తీసుకోవడం లేదు. అంతకుమించిన జన సంఖ్య నాసిరకమైన ఆహారం తీసుకుంటోంది. 
అసమతుల ఆహారం వల్ల సూక్ష్మపౌష్టికాహార లోపం ఏర్పడి, ఆహార సంబంధ స్థూలకాయం, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 
2050 నాటికి ప్రపంచ జనాభా వెయ్యికోట్లకు చేరుకుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకుంటేనే అప్పటికి వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. 
రెడ్‌మీట్‌, పాలపదార్థాల వినియోగం ఏమాత్రం పెరిగినా ఇబ్బందులు తప్పవు. రెడ్‌మీట్‌, చక్కెరలాంటి ఆనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు 50%కి మించి తగ్గాలి. 
గింజలు, పండ్లు, కూరగాయల వినియోగం 100% పైగా పెరగాలి. 
గత 50 ఏళ్లలో పంట దిగుబడులు పెరిగిన కారణంగా ఆకలి తగ్గి ఆయుర్ధాయం పెరిగిన మాట నిజమే. ఇదే సమయంలో ఎక్కువ కేలరీలు, అతిగా శుద్ధిచేసిన, జంతువుల నుంచి వచ్చిన ఆహారాలను అలవాటుచేసుకోవడంవల్ల కొత్త ప్రమాదాలు ముంచుకొచ్చాయి. మనిషి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడంతోపాటు, పర్యావరణం దెబ్బతినడానికీ కారణమయ్యాడు. 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమిలో వ్యవసాయ పంటలు 40%  ఆక్రమించాయి. అందుకు 70% మంచినీరు ఖర్చవుతోంది. అదే సమయంలో 30% ఉద్గారాలు వెలువడుతున్నాయి. 
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏంటో చెప్పాలి. విధానకర్తలు, వ్యాపారులు, ఆహారరంగంతో ముడిపడిన వారందరికీ దీనిపై అవగాహన కల్పించాలి

- ఈనాడు, దిల్లీ, ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.