close

ప్ర‌త్యేక క‌థ‌నం

పంటా మీదే.. పైసా మీకే 

ఎఫ్‌పీవోల ఏర్పాటుతో రైతులకు మెరుగైన ఆదాయం 
భారీగా ప్రోత్సహిస్తున్న నాబార్డు, కేంద్ర వ్యవసాయశాఖ 
పంటల నుంచి ఉత్పత్తుల తయారీ, విక్రయాలు.. 
తమిళనాడులో జామ తోటల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం 
విత్తనాలు, ఎరువుల కొనుగోలులోనూ డబ్బు ఆదా 
ఈనాడు - హైదరాబాద్‌

తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావటంలేదని వ్యవసాయదారులు ఆవేదన చెందాల్సిన అవసరం ఇక మీదట ఎంత మాత్రం లేదని ‘రైతుల ఉత్పత్తుల సంస్థ’(ఎఫ్‌పీవో)లు నిరూపిస్తున్నాయి. పాడి పశువులు, పంటలు, పండ్ల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో ఆదాయాన్ని పెంచుకోవచ్చంటూ సరికొత్త మార్గాన్ని రైతులకు ఈ సంస్థలు చూపుతున్నాయి. రైతుల ఆదాయాన్ని 2022కల్లా రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఎఫ్‌పీవోల ఏర్పాటును నాబార్డు, కేంద్ర వ్యవసాయశాఖ  ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీల చట్టం కింద నమోదయ్యే ఈ సంస్థల్లో పంటలు పండించే, పాడి రైతులే భాగస్వాములు, యజమానులు. వారి ఉత్పత్తులను వారే నేరుగా అమ్మవచ్చు, ఇతర రైతుల నుంచి కొనవచ్చు. పంటలు పండించడంతో ఆగకుండా వాటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి సొంత ‘బ్రాండు’తో విపణిలో విక్రయించుకోవచ్చు. 
రైతుల ఉత్పత్తుల సంస్థల ఏర్పాటు, పర్యవేక్షణకు కేంద్ర వ్యవసాయశాఖలో ప్రత్యేకంగా ‘చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య కూటమి’(ఎస్‌ఎఫ్‌ఏసీ) ఏర్పాటయ్యింది. 800 నుంచి 1000 మంది వరకూ రైతులు భాగస్వాములుగా ఉన్న ఎఫ్‌పీవోలు పలు రాష్ట్రాల్లో లాభాల బాటలో నడుస్తూ రైతులకు నికర ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. వీటిపై ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆంక్షలు లేవు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 783 ఎఫ్‌పీవోల్లో 8 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు సభ్యులుగా చేరారు. మరో 114 నమోదు దశలో ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఏసీ వెల్లడించింది. 
ఎఫ్‌పీవోలు ఏం చేస్తాయంటే... 
ప్రతీ 10-12 గ్రామాలకు కలిపి ఒక ఎఫ్‌పీవో ఉంటుంది. దాని పరిధిలో ప్రతీ గ్రామంలో 15-20 మంది రైతులతో ‘రైతుల ఆసక్తి సంఘం’ (ఎఫ్‌ఐజీ) ఏర్పాటవుతుంది. పంటరుణాలు, సాగుకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలన్నీ ఎఫ్‌పీవోసమకూరుస్తుంది. గ్రామంలో ఏ పంటను ఎవరు సాగుచేయాలి, విత్తనోత్పత్తి, పరస్పర సమాచార మార్పిడి వంటివన్నీ ఎఫ్‌ఐజీ స్థాయిలో జరుగుతాయి. గుజరాత్‌లో ‘గుజ్‌ప్రో’, మధ్యప్రదేశ్‌లో ‘మధ్యభారత్‌’ వంటి బ్రాండ్లలో అక్కడి ఎఫ్‌పీవోలు రైతులకు సేవలందిస్తున్నాయి. ఎఫ్‌పీవో ఏర్పాటుకు రూ.15 లక్షల వరకూ ఎస్‌ఎఫ్‌ఏసీ సమకూర్చుతుంది. అంతే మొత్తాన్ని రైతులు తమ వాటాగా పెట్టాలి. రైతులు ఎంతవాటా ఇవ్వగలిగితే ఎస్‌ఎఫ్‌ఏసీ అంతే మొత్తాన్ని ఇస్తుంది. దీంతో పాటు బ్యాంకు నుంచి రూ.కోటి వరకూ రుణం ఇప్పించడానికి పూచీకత్తు ఇస్తుంది. 
సాగు వ్యయం తగ్గుదల 
రైతుల తరఫున విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వాటిని టోకు ధరకు వాటి తయారీ కంపెనీలతో నేరుగా ఎఫ్‌పీవో బేరమాడి కొనడం వల్ల ధరలు తగ్గి సాగు వ్యయంలో 10 శాతానికి పైగా మిగులుతోంది. 
ఉదాహరణకు ఓ కంపెనీ తయారుచేస్తున్న కాంప్లెక్స్‌ ఎరువు 19:19:19 బస్తా గరిష్ఠ చిల్లర ధర విపణిలో రూ.2200 ఉంది. అదే ఎరువును ఎఫ్‌పీవో తరఫున రూ.1950కే కొన్నారని ఎస్‌ఎఫ్‌ఏసీ తెలిపింది. దీనివల్ల ఒక్కో బస్తాపై రైతుకు రూ.250 మిగిలింది. 
రైతు నుంచి వినియోగదారుడికి చేరేలోగా 30 శాతం వరకూ పండ్లు, కూరగాయలు పాడవుతున్నాయి. ఇలా పాడయ్యే వాటి విలువ దేశం మొత్తం మీద రూ.40,811 కోట్లుగా ఉంటుందని అంచనా. రైతులకు సమష్టిగా ఆహారశుద్ధి, నిల్వ సదుపాయాలుంటే ఈ సొమ్ము మిగులుతుంది. ఎఫ్‌పీవోలు దీనికో చక్కటి పరిష్కార మార్గం చూపుతున్నాయి.

లాభాలు కురిపిస్తున్న జామపండ్లు

మా ప్రాంత రైతులతో జామ, మామిడి, సపోటా తదితర పండ్లతోటలు, కూరగాయలు సాగుచేయిస్తున్నాం. నేను స్వయంగా 30 ఎకరాల్లో జామ, నిమ్మ తోటలు వేశా. ఎకరాలో పండిన జామ పండ్లను మా ఎఫ్‌పీవోకి అమ్మడం వల్ల అన్ని ఖర్చులూ పోను రూ.2 లక్షల దాకా ఆదాయం వచ్చింది. జామపండ్ల రసం తయారుచేసి సీసాల్లో అన్నీ ప్రాంతాల్లో విక్రయిస్తున్నాం. అలాగే ఇతర పంటల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారుచేసి మేమే స్వయంగా విక్రయ కేంద్రాలు పెట్టి వినియోగదారులకు చేరవేస్తున్నాం. ఎఫ్‌పీవో విధానంతో రైతులకు ఆదాయం పెరిగింది.

- కె.కె.గణేశన్‌, ఛైర్మన్‌, ఆయకుడి ఎఫ్‌పీవో, దిండిగల్‌, తమిళనాడు

ఆవుపేడ విభూతి కిలో రూ.240


 

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు ఎన్‌.కె.భగవతి. తమిళనాడులోని కోయంబత్తూరుకు సమీపంలోని పొలాచ్చిలో ‘కర్పగ వృక్షం కోకోనట్‌ ‘రైతుల ఉత్పత్తుల సంస్థ’ ఛైర్మన్‌. ఆయన చేతిలో ఉన్నది దేశవాళీ ఆవుపేడతో తయారు చేసిన విభూతి డబ్బాలు. కిలో రూ.240కి దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. యోగాకేంద్రాల వద్ద, పూజల సమయంలో దీనికి అధిక గిరాకీ. రైతులు సొంత ఆవుల పేడను సేకరించి విభూతిగా మార్చి ఎఫ్‌పీవోకు కిలో రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. దాన్ని ప్యాక్‌ చేసి పన్నులు చెల్లించి రూ.240 చొప్పున విపణిలో అమ్ముతున్నారు. ఇదే కాకుండా దేశవాళీ గోవుల మూత్రం కూడా ఆదాయ వనరే. 5 లీటర్ల ఆవు మూత్రాన్ని డిస్టిలర్‌ విధానంలో శుద్ధి చేస్తే ఒక లీటరు పరిశుభ్ర నీరు వస్తుంది. రైతులు సొంతంగా దీనిని తయారుచేసి లీటరు రూ.160కి ఎఫ్‌పీవోకు ఇస్తున్నారు. దానిని సంస్థ రూ.180కి విక్రయిస్తుంది. ఔషధ విలువలున్నందున ఆవు మూత్రానికి మంచి గిరాకీ ఉంటోంది.

లీటరు వేరుశనగ నూనె రూ.250

ఈ చిత్రంలో కనిపిస్తున్న  వేరుశనగ నూనె లీటరు ధర రూ.250. మేలైన వేరుశనగ గింజలను రైతుల నుంచి కిలోకి రూ.వంద చెల్లించి ‘ఆయకుడి ఎఫ్‌పీవో’ కొనుగోలు చేస్తుంది. 2.15 కిలోల పల్లీల నుంచి లీటరు నూనె, కిలోన్నర వేరుశనగ చెక్క వస్తుంది. నూనె లీటరు రూ.250కి, చెక్క (కిలోరూ.40 చొప్పున) అమ్మితే కిలోన్నరకు రూ.60 వస్తోంది. మొత్తమ్మీద అన్నీ ఖర్చులు పోను రైతుల ఉత్పత్తుల సంస్థకు లీటరుకు రూ.50 నుంచి 60 దాకా మిగులుతుంది. స్వచ్ఛమైన నూనె అని ధర ఎక్కువైనా ప్రజలు కొంటున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.