close

ప్ర‌త్యేక క‌థ‌నం

అందరికీ తెలిసిందే...ఎవ్వరికీ పట్టనిదే

 రామవరప్పాడు నుంచి బెంజ్‌ సర్కిల్‌ వెళ్లాలంటే గంట
 పట్టాలెక్కని ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ వ్యవస్థ
 ప్రతిపాదనలకే పరిమితమైన బైపాస్‌ మార్గం
కంభంపాటి జగదీష్‌
ఈనాడు - విజయవాడ

బెజవాడలో ట్రాఫిక్‌ దాటడం కంటే సప్త సముద్రాలను ఈదడం చాలా సులభమేమో! రాష్ట్ర విభజన తర్వాత సమస్య మరింత తీవ్రమైంది. చాలా వరకు ప్రభుత్వ, ప్రభుత్వేతర శాఖలు ఇక్కడ కొలువుదీరాయి. ఉద్యోగులు తరలివచ్చారు. సందర్శకుల సంఖ్య రెట్టింపైంది. పరిపాలనతో పాటు వాణిజ్య కేంద్రంగా బెజవాడ ఎదిగింది. వాహనాలు కూడా అదే రీతిలో రోడ్లపైకి వస్తున్నాయి. వీఐపీల రాకపోకలతో సమస్య మరింత జటిలమవుతోంది. జనాభా దాదాపు 15 లక్షలకు చేరింది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేక రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపు, సిగ్నళ్ల మరమ్మతుల విషయంలో జాప్యం జరుగుతోంది. పెరిగిన స్థాయిలో మౌలిక వసతులను అభివృద్ధి చేయలేదు. ఆసియాలోనే పెద్దదైన ఆటోనగర్‌కు.. మరమ్మతులు, ఇతర అవసరాల నిమిత్తం నిత్యం 3,000 లారీలు వస్తుంటాయి. దీనికితోడు నగరం నుంచి వెళ్లే ఎన్‌హెచ్‌ 16, 65, 30 సుమారు 111 కి.మీ మేర నిడివి ఉన్నాయి. రాష్ట్ర రహదారులు నెం. 110, 111, 15, 45లు 51.91 కి.మీ మేర వెళ్తున్నాయి.

సవాలక్ష కారణాలు
* స్క్రూ బ్రిడ్జి నుంచి రమేష్‌ ఆసుపత్రి కూడలి వరకు నిర్మిస్తున్న బెంజి సర్కిల్‌ పైవంతెన పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
* నగరం మధ్య నుంచి ఎన్‌హెచ్‌ 16 (చెన్నై - కోల్‌కతా) వెళ్తుంది. విజయవాడలోకి వివిధ మార్గాల ద్వారా రోజుకు 37 వేల వాహనాలు ప్రవేశిస్తాయి. ఇందులో కీలకమైన బెంజి సర్కిల్‌ మీదుగా వెళ్లేవి అత్యధికం. ఈ మార్గంలో గుంటూరు వైపు నుంచి 13 వేలు, ఏలూరు వైపు నుంచి 10 వేలు చొప్పున నిత్యం వస్తుంటాయి.

* ఈ రహదారి వెంబడి రెండు వైపులా జనావాసాలు బాగా విస్తరించాయి.  రామవరప్పాడు నుంచి ఏలూరుకేసి ఎనికేపాడు వరకు రెండు వైపులా సర్వీసు రోడ్లు లేకపోవడంతో స్థానిక వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి వస్తున్నాయి.
* బైపాస్‌ మార్గం ప్రతిపాదనలకే పరిమితమైంది.
* కొత్త రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదు.
* ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. దీనికి గాను గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో పోతున్నారు. ఆయన కాన్వాయ్‌ బెంజి సర్కిల్‌ మార్గంలో వెళ్లాల్సిందే. భద్రత దృష్ట్యా ఈ మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నారు.
* మంత్రులు, ఇతర వీఐపీలకు జంక్షన్‌ క్లియరెన్స్‌ ఇస్తున్నారు. వారి వాహన శ్రేణి ముందు కూడళ్లల్లో ఉన్నప్పుడు ఆపుతున్నారు.

* సమీకృత ఇంటెలిజెంట్‌ సిగ్నల్‌ వ్యవస్థతోనే చాలా వరకు సమస్యలు తీరతాయి. విజయవాడలోని ఎఫ్‌ట్రానిక్స్‌ ఎండీ, ట్రాఫిక్‌ రంగ నిపుణులు రామకృష్ణ కూడా ఈ వ్యవస్థతోనే అత్యుత్తమ పరిష్కారం లభిస్తుందని నొక్కివక్కాణిస్తున్నారు. ఈ పద్ధతిలో సిగ్నళ్ల వ్యవస్థను ఆధునికీకరించి ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారు. వీటికి ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. సిగ్నళ్లు అన్నీ సమన్వయంతో సౌరశక్తి ఆధారంగా పనిచేస్తాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎఫ్‌ట్రానిక్స్‌ సంస్థతో ఈ వ్యవస్థపై అంచనాలు రూపొందించారు. రూ.14.5 కోట్లు అవుతుందని అంచనా వేశారు. వీటిని పోలీసులు విజయవాడ నగరపాలక కమిషనర్‌కు అందజేశారు. నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదంటోంది.

ఎక్కడెక్కడ ఉంది..? ఎలా అమలవుతోంది..?

ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ సిస్టమ్‌ పుణె, జైపూర్‌, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో ఇప్పటికే అమలవుతోంది. గాంధీనగర్‌లో మొదటి దశ నిర్మాణంలో ఉంది. పుణె నగరంలో రెండు దశలలో 68 కూడళ్లల్లో, జైపూర్‌లో మూడు దశలలో 25 కూడళ్లు, కోల్‌కతాలో మొత్తం 95 కూడళ్లల్లో, అహ్మదాబాద్‌లో 93 కూడళ్లల్లో నడుస్తోంది. ప్రస్తుతం గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఏర్పాటు చేస్తున్నారు.

ఫలితాలపైన అధ్యయనం ఏం చెబుతోంది..
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సి-డాక్‌ పుణెలో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీని అధ్యయనంలో సగటు ప్రయాణ వేగం 2 నుంచి 12 శాతం పెరిగింది. వార్షిక సగటు ఇంధన ఆదా రూ. 0.83 కోట్లు. వాహనదారులకు ఏడాదికి రూ.5.60 కోట్ల వరకు ఆదా.

సమూల మార్పులు రావాలి
ఆటోనగర్‌ నగర్‌ చుట్టూ నగరం అభివృద్ధి చెందింది. మరమ్మతుల కోసం భారీ వాహనాలు ఇక్కడికి వస్తున్నాయి. దీనిని నగరం వెలుపలికి తరలిస్తే మేలు. బైపాస్‌ రోడ్డును నిర్మిస్తే నగరంలోకి భారీ వాహనాలు రాకుండా బయట నుంచి వెలుపలకే వెళ్తాయి.

- రవిశంకర్‌ రెడ్డి, డీసీపీ (ట్రాఫిక్‌), విజయవాడ

 

 చురుగ్గా పరిశీలిస్తున్నాం..
విజయవాడ నగర పోలీసుల నుంచి ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ వ్యవస్థకు సంబంధించి రూ.14.5 కోట్లతో ప్రతిపాదనలు అందాయి. ప్రతిపాదనలను చురుగ్గా పరిశీలిస్తున్నాం. నిధుల కొరత బాగా వేధిస్తోంది. 

- రామకృష్ణ, పర్యవేక్షక ఇంజినీరు, విజయవాడ నగరపాలక సంస్థ

 

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.