close

ప్ర‌త్యేక క‌థ‌నం

కేసీఆర్‌కు ఎవరూ సాటిరారు 

ఆయన నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం 
16 స్థానాల్లో భారీ ఆధిక్యం తథ్యం 
విపక్షాలు మా దరిదాపుల్లో లేవు 
సార్వత్రికం తర్వాత కేంద్రంలో తెరాసది కీలకపాత్ర 
2023 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధత 
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో తెరాస ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ 
ఈనాడు - హైదరాబాద్‌

సమకాలీన రాజకీయాల్లో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సరితూగే నాయకులెవరూ లేరని.. ఆయన నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయఢంకా  మోగిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తెలిపారు. విపక్ష పార్టీలేవీ తెరాస దరిదాపుల్లో లేవన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో తమ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. 2023 ఎన్నికలకు పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోందని తెలిపారు. కేసీఆర్‌ వెన్నంటి ఉండే అవకాశం రావడం అదృష్టమని.. పార్టీలో తాను సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నానని వివరించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సంతోష్‌కుమార్‌ ‘ఈనాడు’తో మాట్లాడారు. 
లోక్‌సభ ఎన్నికలపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? 
వందకు వంద శాతం మాదే విజయం. ఒక చోట మిత్రపక్షమైన మజ్లిస్‌ గెలుస్తుంది. మిగతా 16 చోట్ల మాదే విజయం. రాష్ట్రంలో ఏ ఎన్నికలు చూసినా ప్రజలు తెరాస వైపే ఉన్నారు. ఇటీవలి శాసనసభ పోరులో అద్భుతంగా గెలిచాం. సర్పంచి ఎన్నికల్లో 90 శాతం సీట్లు సాధించాం. కాంగ్రెస్‌కు వందల్లో, మాకు వేలల్లో స్థానాలు వచ్చాయి. తెదేపా ఉనికి లేదు. శాసనసభ ఎన్నికల్లో అక్కడక్కడా తిరుగుబాటు సమస్యల కారణంగా మా ఓట్లు కొంత మేర చీలాయి. ఇప్పుడు కచ్చితంగా ప్రతి స్థానంలో భారీ మెజారిటీ ఖాయం. 
సార్వత్రిక పోరులో ఏయే అంశాలు ప్రధానం కాబోతున్నాయి ? మీ బలాలు ఏమిటి? 
ఎన్నికల్లో కేసీఆర్‌ మా ప్రధాన బలం. సమకాలీన రాజకీయాల్లో ఆయనకు సరితూగే వారెవరూ లేరు. తెరాసకు ఆయనే కర్త.. కర్మ.. క్రియ.. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఇంటింటికీ చేరాయి. ఇప్పుడవి దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఎక్కడయినా పథకాలు ఎన్నికల సమయంలో వస్తాయి. కానీ, కేసీఆర్‌ తన అనుభవం, ప్రజల అవసరాలను గుర్తించి ఆది నుంచే పథకాలను ప్రవేశపెట్టారు. కోటి ఎకరాల మాగాణం కోసం ఆయన తపిస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు శరవేగంగా నిర్మితమవుతున్నాయి.

విపక్షాల నుంచి పోటీ ఏ విధంగా ఉంటుందని భావిస్తున్నారు? 
ఎంత ప్రయత్నించినా విపక్షాలు తెరాస దారిదాపుల్లోకి కూడా రాలేవు. మేం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రతిపక్షాల పరిధి కుంచించుకుపోయింది. ఇప్పుడు ఎన్నికల్లో ఆయా పార్టీలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. రాజకీయాలెలా ఉన్నా.. రాష్ట్ర అభివృద్ధి కోణంలో అందరూ కృషి చేయాలి. కానీ, మన రాష్ట్రంలోని ఆ పార్టీలకు రాజకీయాలే సర్వస్వంగా మారాయి. తెలంగాణ గురించి మా పార్టీకి ఉన్న శ్రద్ధ వేరే వాళ్లకు ఉండదు. మేం కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దాన్ని కాపాడుకొని ముందుకు తీసుకెళ్తున్నామని ప్రజలు విశ్వసించి మమ్మల్ని ఆదరిస్తున్నారు.

తెరాస సన్నద్ధత ఎలా ఉంది? 
ఎన్నికలకు మేం పూర్తిస్థాయిలో సిద్ధం. ఇప్పటికే ఒక దశ సర్వేలు పూర్తయ్యాయి. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఈ నెల 6 నుంచి 9 వరకు సన్నాహక సమావేశాలు జరిపారు. కేటీఆర్‌ ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 30 వేల మంది చొప్పున మొత్తం రెండు లక్షల మంది కార్యకర్తలను ఎన్నికలకు తయారు చేశారు. 
పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? 
రాష్ట్ర అభివృద్ధితోపాటు పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. రెండేళ్ల కిందటే తెరాసకు 70 లక్షల సభ్యులు ఉన్నారు. దాన్ని మరింత పెంచుతాం. తెరాసను ప్రపంచంలో అతి బలమైన పార్టీగా తీర్చిదిద్దాలనేది మా అధినేత సంకల్పం. కేటీఆర్‌, కవిత, నేను ఇలా.. అందరం సైనికులం. పార్టీకి కార్యకర్తలు ప్రాణప్రదమని సీఎం భావిస్తారు. పార్టీ పరంగా ఆయన చెప్పింది వందకు వంద శాతం అమలు చేస్తే చాలు.. మేం కొత్తగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. తెరాస వందల ఏళ్లు ఉంటుందని పార్టీ ఆవిర్భావ సమయంలోనే చాలా మంది కేసీఆర్‌కు చెప్పారు. తెలంగాణ ఉన్నంత కాలం తెరాస బలంగా ఉంటుంది. మొన్నటి శాసనసభ ఎన్నికల ఫలితాలు రాగానే.. 2023 ఎన్నికలు లక్ష్యంగా పనిచేయాలని సీఎం మాకు దిశానిర్దేశం చేశారు. మేం అలాగే ముందుకు సాగుతున్నాం. 
తెలంగాణకు కేంద్ర సహకారం ఎలా ఉంది? విభజన చట్టం అమలు తీరును మీరెలా విశ్లేషిస్తారు? 
కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ ఇవ్వలేదు. నిధులు కోరితే మోహం చాటేసింది. అభివృద్ధిలో ఏ మాత్రం మద్దతు ఇవ్వలేదు. విభజన చట్టంలోని తొమ్మిదో, పదో షెడ్యూళ్ల అంశాలను అమలు చేయలేదు. సీఎం కేసీఆర్‌ 49 లేఖలు రాశారు, 15 సార్లు ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసి విన్నవించినా వారి నుంచి స్పందనలేదు. తెలంగాణ ఎంపీలు సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించేవారు. తెరాస ఎంపీలు ఏ రోజూ పైరవీలు చేయలేదని ప్రశంసించిన కేంద్ర మంత్రులు.. పనులు మాత్రం చేయలేదు.

సమాఖ్య కూటమికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? 
సమాఖ్య కూటమి అవసరాన్ని సీఎం కేసీఆర్‌ యావత్‌ దేశానికి చాటారు. కాంగ్రెస్‌, భాజపా వల్ల కానివి ఏమేం చేయొచ్చో తెలిపారు. కేసీఆర్‌ ఆలోచనలు, ఆశయాలు దేశప్రజలను ఉద్దేశించినవే. తెలంగాణలో ఆయన అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని ప్రజలు ఆశిస్తున్నారు. సమాఖ్య కూటమికి ఇదే ప్రధాన బలంగా మారుతుంది.

ఎన్నికల అనంతరం కేంద్రంలో తెరాస ఎలాంటి పాత్ర పోషించబోతోంది? 
మేం 16 స్థానాలు గెలిచి దిల్లీకి వెళ్లాక.. మా బలం అంతకు మించి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం కేసీఆర్‌ అంటే తెలియని వారు లేరు. కూటమి ప్రయత్నాల్లో వివిధ రాష్ట్రాలను సందర్శించినప్పుడు ఆయనకు అపూర్వ ఆదరణ లభించింది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తెలంగాణ ఇప్పుడు ఒంటరిగానే ఎంతో అభివృద్ధి చెందుతోంది. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వస్తే రాష్ట్ర అభివృద్ధికి అది మరింతగా దోహదపడుతుంది. 
రాజ్యసభ సభ్యుడిగా మీ అనుభవాలు ఏమిటి? 
సీఎం కేసీఆర్‌ నాకు 40 ఏళ్ల  చిన్న వయసులో పెద్దల సభలో అవకాశం కల్పించారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాజ్యసభలో ఎందరో మహామహులు, కురువృద్ధులున్నారు. సభ్యులుగా వారి అనుభవమంత కూడా నా వయసు లేదు. వారి నుంచి ఎంతో నేర్చుకున్నా. 
కేటీఆర్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు చేపట్టాక పార్టీ ఎలా సాగుతోంది? 
కేటీఆర్‌ మా అన్న. ఆయన మా అందరికీ ఆదర్శం. కేసీఆర్‌ మాదిరిగానే ఆయన ఆలోచనలు, దార్శనికత ఉంటాయి. కేటీఆర్‌ పార్టీకి నూతనోత్సాహాన్ని అందిస్తున్నారు. 
ప్రభుత్వంలో, పార్టీలో మీ పాత్ర? 
ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోను. సీఎం పక్కనే ఉంటున్నా.. పాలనా వ్యవహారాల్లో ఎక్కడా కలగజేసుకోను. పార్టీ తరఫున సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కేసీఆర్‌ ఇచ్చే అసైన్‌మైంట్లను పూర్తి చేస్తుంటాను. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర నేతలకు వచ్చే సందేహాలు, ఇతర అంశాలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి వాటిపై స్పష్టత ఇస్తుంటాను.

ఆయనో లివింగ్‌ ఎన్‌సైక్లోపీడియా 
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నాది 19 ఏళ్ల అనుబంధం. ఉదయం ఆరున్నర నుంచి రాత్రి పడుకునే వరకు వెన్నంటే ఉంటా.  ఆయన లివింగ్‌ ఎన్‌సైక్లోపీడియా. వేలాది పుస్తకాలు చదివారు. కేసీఆర్‌కు తెలియని విషయమంటూ ఉండదు. రాష్ట్రంలో ఏదైనా సమస్య గురించి పత్రికలో వార్త వస్తే వెంటనే దాని గురించి ఆరా తీసి.. పరిష్కరించాలని ఆదేశిస్తారు. ఆయన దినచర్య తెలంగాణ ఆలోచనలతోనే మొదలవుతుంది.. దాంతోనే ముగుస్తుంది. రోజూ ఉదయం లేవగానే రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల పనుల గురించి నివేదికలను పరిశీలించాకే ఆయన ఇతర కార్యాచరణ మొదలవుతుంది. తెలంగాణ కోసం కేసీఆర్‌ పడ్డ కష్టాలపై మూడు భాగాలతో ఒక పుస్తకం రాయాలని భావిస్తున్నా. ఇప్పటికే శీర్షికను ఖరారు చేసుకున్నా.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.