Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఎన్నికల సమరాంగణంలో వీరులెవరో?

ఈనాడు, దిల్లీ

భారతావని మరోమారు కీలక కూడలిలో నిలిచింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల పండుగకు తెరలేచింది. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రణాళికలు రచిస్తుండగా.. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 
2014తో పోలిస్తే ప్రస్తుతం దేశ రాజకీయ ముఖచిత్రం చాలా మారింది. నాటి ఎన్నికల్లో మోదీ హవా నడిచింది. భాజపా ప్రభంజనం సృష్టించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కుదేలైంది. పదేళ్ల యూపీఏ పాలనపై విసిగి వేసారిన ప్రజానీకం.. రాబోయేవన్నీ మంచి రోజులేనంటూ మోదీ ఇచ్చిన హామీపై నమ్మకముంచింది. ఎన్డీయేకు తిరుగులేని మెజారిటీని కట్టబెట్టింది. మోదీ చేతిలో పాలనాపగ్గాలు పెట్టింది. దేశానికి కాపలాదారుగా, సామాన్యుడిగా తనను తాను చెప్పుకున్న ఆయన పాలన కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే, ఐదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వానికి ఎన్నెన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలు తొలుత ఇబ్బంది పెట్టాయి. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాల ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ మోదీ ప్రభుత్వం పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటోంది.

భాజపా: హిందీ రాష్ట్రాలపైనే ఆశ

హిందీ బెల్ట్‌గా పిలుచుకునే ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో ఐదేళ్ల క్రితం భాజపా ఓట్ల సునామీ సృష్టించింది. మరోసారి ఈ బెల్ట్‌ తమను గట్టెక్కిస్తుందని ఎన్డీయే విశ్వసిస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో 2014లో మోదీ హవా పెద్దగా కనిపించలేదు. ఆ పరిస్థితిలో ఈ దఫా కూడా పెద్దగా మార్పు కనిపించబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇతర పక్షాలు: ప్రాంతీయమే కీలకం

 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, వైకాపా, తెలంగాణలో తెరాస, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ బలంగా ఉన్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌లో భాజపాకు వ్యతిరేకంగా ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టాయి. ప్రభుత్వ ఏర్పాటులో వీటి మద్దతు కీలకం కానుంది. భాజపాను గద్దె దించేందుకుగాను కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారు. ఎస్పీ-బీఎస్పీ ఉత్తర్‌ ప్రదేశ్‌లో తమ కూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోకున్నా.. ఎన్నికల తర్వాత అవి కాంగ్రెస్‌తో కలిసే అవకాశాలే ఎక్కువ. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ భాజపాకు బద్ధ విరోధి. జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ పార్టీ, మహారాష్ట్రలో ఎన్సీపీ మద్దతు కాంగ్రెస్‌కేఅనడంలో సందేహాలక్కర్లేదు! ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ సైతం కాంగ్రెస్‌ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. కేసీఆర్‌ నేతృత్వంలోని తెరాస, వై.ఎస్‌.జగన్‌ నేతృత్వంలోని వైకాపా, నవీన్‌ పట్నాయక్‌ పార్టీ బిజూ జనతాదళ్‌ ఎన్నికల తర్వాతే తమ మద్దతుపై నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

కూటముల్లోని ప్రధాన పార్టీలు

ఎన్డీయే: భాజపా, శివసేన, అకాలీదళ్‌, జేడీయూ, అన్నాడీఎంకే, ఎల్‌జేపీ, అప్నాదళ్‌  
యూపీఏ: కాంగ్రెస్‌, ఆర్జేడీ, డీఎంకే, జేడీఎస్‌  
యూపీఏకు మద్దతు పలికే అవకాశమున్నవి: తెదేపా, ఎస్పీ, బీఎస్పీ, ఆప్‌, పీడీపీ, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌  
ఎన్డీయే, యూపీఏలకు సమాన దూరంలో ఉంటున్నవి: తెరాస, బీజేడీ, వైకాపా  

ఎన్నికల్లో అటు ఎన్డీయేకుగానీ, ఇటు యూపీఏకుగానీ స్పష్టమైన మెజారిటీ దక్కకపోతే మిగతా పార్టీలు కింగ్‌ మేకర్లుగా మారే అవకాశాలున్నాయి.

ఎన్డీయే సానుకూలతలు

మోదీ నాయకత్వం  
అభివృద్ధి నినాదం 
ఐదేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు అంతగా లేకపోవడం 
భాజపా శ్రేణులు  
ఎన్నికల నిర్వహణపై సూక్ష్మస్థాయి దృష్టి 
మిత్రులతో సర్దుబాట్లు 
ఇటీవల పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై జరిపిన వైమానిక దాడులు  
అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు  
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం 

కాంగ్రెస్‌: కనిపించని ధీమా 

2014లో మోదీ హవాలో కొట్టుకుపోయిన కాంగ్రెస్‌.. ఇటీవల పుంజుకుంది. గతేడాది మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించింది. ఇతర రాష్ట్రాల్లోనూ బలం పెంచుకుంది. అయితే, ఈసారి అధికారం తమదేనన్న ధీమా మాత్రం ఇప్పటికీ యూపీఏలో కనిపించట్లేదు! రాహుల్‌ ప్రభావం పెరిగినా కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసం అంతగా తొణికిసలాడట్లేదు. కర్ణాటక, కేరళ, అసోం, పంజాబ్‌లో కాంగ్రెస్‌ బలం పెరగొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పొత్తులు: భేషజాలు వదిలి..

ప్రాంతీయ పార్టీల మద్దతు ఆవశ్యకతను గుర్తించిన భాజపా, కాంగ్రెస్‌ భేషజాలు లేకుండా వ్యవహరిస్తున్నాయి. మహారాష్ట్రలో ఇన్నాళ్లూ తమపై కత్తులు దూసిన శివసేనను కమలదళం బుజ్జగించి తమతో చేర్చుకుంది. అసోంలో తమను కాదనుకొని వెళ్లిన ఏజీపీతో తిరిగి చేతులు కలిపింది. అప్నాదళ్‌ వంటి ఉప ప్రాంతీయ పార్టీల డిమాండ్లకూ విలువనిస్తోంది. జయలలిత లేని అన్నాడీఎంకే ప్రభావం తమిళనాడులో అంతంతమాత్రమేనని తెలిసినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్‌ది కూడా ఇదే పరిస్థితి. బిహార్‌, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో బెట్టుచేయకుండా సీట్ల సర్దుబాటు చేసుకుంటోంది. బద్ధ శత్రువైన ఆప్‌తో కలిసి వెళ్లడానికి సిద్ధమవుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎస్పీ-బీఎస్పీ ముందస్తు పొత్తులకు నిరాకరించినా వాటితో దూకుడుగా వ్యవహరించట్లేదు. ఎన్నికల తర్వాత చేతులు కలిపినా చాలన్న ధోరణితో వ్యవహరిస్తోంది.

విపక్ష కూటమికి కలిసొచ్చే అంశాలు

రాజకీయంగా సంఘటితమవ్వడం  
రాష్ట్ర స్థాయి పొత్తులు 
రఫేల్‌ కుంభకోణం  
పెద్ద నోట్ల రద్దు వైఫల్యాలు  
నల్లధనం వెలికితీతలో ప్రభుత్వ వైఫల్యం  
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య  
అన్నదాతల ఇక్కట్లు  
సమాజంలోని కొన్ని వర్గాల్లో అభద్రతాభావం  
రిజర్వు బ్యాంకు, సీబీఐ వంటి వ్యవస్థల విధ్వంసానికి ప్రభుత్వం పాల్పడుతోందన్న ఆరోపణలు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.