close

ప్ర‌త్యేక క‌థ‌నం

దస్త్రానికో ధర!

రెవెన్యూ శాఖలో వ్యవస్థీకృతమైన అవినీతి
చేతులు తడిపితేనే పరిష్కారం
ఈ జాడ్యాన్ని పారదోలాలని ముఖ్యమంత్రి సంకల్పం
శాఖను పలుచన చేయొద్దంటున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాలు

కథ పాతదే. ఇప్పుడన్నా ముగింపు కొత్తగా ఉంటుందా? రెవెన్యూ శాఖలో రంకెలేస్తున్న అవినీతి కట్టడిపై జనంలో మొదలైన చర్చ ఇది. గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫల ప్రయోగాలుగానే మిగిలాయి. దాంతో లంచం.. సామాన్యుడి వంక చూసి నన్ను ఎవరూ ఏం చేయలేరు తెలుసుకో.. అని మీసం మెలేసి దరహాసం చేస్తుందా అన్న పరిస్థితులున్నాయి. ఈ శాఖ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగడంతో సాధారణ ప్రజానీకం గంపెడు ఆశలు పెట్టుకుంది. రెవెన్యూ శాఖలో ధ్రువపత్రాల నుంచి భూముల దాకా ఏ వ్యవహారమైనా పైసా లేనిదే పత్రం కదలదనే ధోరణికి కాలం చెల్లిపోతుందని అనుకుంటోంది. మేతలో మేటిగా నిలిచి ప్రజలను పీడిస్తున్న ఈ శాఖను జనరంజకం చేయాలని కేసీఆర్‌ గట్టి సంకల్పంతో ముందుకెళ్లడంపై ఆశలు మోసులెత్తుతున్నాయి.

రెండు నెలల పాటు ఎవరికీ లంచం ఇవ్వకండి

ఆయన పేరున ఉన్న భూమి ఈయన పేరున రాయడం... పొద్దుట్నుంచి సాయంత్రానికి ఎంతో కొంత జేబులో వేసుకుని పోవడం... ప్రతి పనికీ లంచం.. రెవెన్యూశాఖలో సర్వసాధారణమై పోయింది. ఆ పనులు వాళ్లొక్కరే చేస్తారన్న బలహీనతే అవినీతికి ఊతం ఇస్తోంది. రైతుల నుంచి లంచాలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అందుకే పకడ్బందీగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తాం. రెండు నెలల పాటు ఎవరికీ లంచం ఇవ్వకండి.
- ఇటీవలి ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌, మెదక్‌: ప్రజలకు అన్ని అవసరాల్లో అనుసంధానమై ఉండే రెవెన్యూ శాఖ అవినీతి కూపంలా మారింది. క్షేత్రస్థాయి నుంచి పైవరకు అక్రమాలు వ్యవస్థీకృతంగా మారాయి. పహాణీకి రూ.వెయ్యి, ధ్రువపత్రాల జారీకి రూ.రెండు నుంచి రూ.మూడు వేలు, భూముల ధరలు బాగా ఉన్న చోట ఎకరానికి రూ.10 వేలు విదిలిస్తే తప్ప వారసత్వ బదిలీ పని పూర్తికావడం.. ఇదీ రెవెన్యూ శాఖలో నిరంతరాయంగా సాగుతున్న తంతు. అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడుతున్న అనేక ఉదంతాలే రుజువులు. కొందరు నిజాయితీపరులైన అధికారులున్నా వారి చుట్టూ వ్యవస్థ కలుషితమై ఉండడంతో అంతా ఇంతేలే అనుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కూడా రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండించింది. ఏళ్లతరబడి నవీకరణకు నోచుకోని భూ దస్త్రాల దుమ్ముదులిపి రైతులకు హక్కులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తే ఈ కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకుని కొన్ని మండలాల్లో సిబ్బంది రెండు చేతులా సంపాదించారని నిఘా వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ప్రజలకు మేలు జరిగేలా ఈ జాడ్యాల్ని పారదోలాలని సీఎం కేసీఆర్‌ గట్టి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

పాసు పుస్తకానికి రూ.5 వేలు
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పాసుపుస్తకం మంజూరుకు ఎకరాకు తక్కువలో తక్కువగా రూ.5 వేలు వసూలు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గిరిజనేతరులకు పాసుపుస్తకాలు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. జయంశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అనర్హులైన గిరిజనేతరులకు పుస్తకాలు జారీచేసినట్లు సమాచారం. అక్కడే ఏళ్లతరబడి ఉంటూ పాత పాసుపుస్తకాలు ఉన్నవారికి మాత్రం మొండిచేయి చూపడంతో ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మెదక్‌, సంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక మండలాల్లో అర్హులైన భూ యజమానులకు నేటికీ పాసుపుస్తకాలు ఇవ్వనేలేదు.

గోవా పర్యటన.. నిఘావర్గాల కూపీ
గతంలో పని చేసిపెట్టినందుకు ఎంతో కొంత ఇవ్వాలని డిమాండ్‌ చేసేవారు. ఇప్పుడు ఒకరి భూములు మరొకరికి మార్చి వసూలు చేయడం కొత్త సంప్రదాయంగా మారింది. ప్రభుత్వం నిర్వహించిన ఎల్‌ఆర్‌యూపీ(ల్యాండ్‌ రికార్డ్స్‌ అప్‌డేషన్‌ ప్రోగ్రాం)ను ఆసరాగా చేసుకుని రెండు చేతులా సంపాదించిన కొందరు విందులు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో కొన్ని మండలాలకు చెందిన దిగువ స్థాయి సిబ్బంది గోవా పర్యటనలకు వెళ్లినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిఘా బృందం నిర్వహించిన సర్వేలో అనేక మండలాల్లో అక్రమాలు ఎలా చోటుచేసుకున్నాయో తేలింది. మొత్తం 36 అంశాల వారీగా నిఘా విభాగం అన్ని మండలాల్లో సమగ్రంగా భూవివరాలు సేకరించింది.

ఆధారం లేకుండా పోయిన భూ రికార్డు
ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకొచ్చేందుకు చేసిన సంస్కరణలు కూడా కొందరు రెవెన్యూ సిబ్బందికి వరంగా మారాయి. ఇన్నాళ్లూ మా భూమి వెబ్‌సైట్‌లో భూములకు సంబంధించిన వివరాలన్నీ అందుబాటులో ఉండేవి. ధరణి పోర్టల్లోకి భూముల వివరాలు మార్చే ప్రక్రియ చేపట్టాక అంతా అయోమయంగా మారింది. ధరణిలో లేని సమాచారాన్ని ప్రశ్నిద్దామంటే ఎటువంటి ఆధారం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణిలోకి చేర్చని సర్వే నెంబర్లు, ఖాతా నెంబర్లలోని సమాచారం పొందాలంటే మీ సేవా కేంద్రాల్లోనూ అందుబాటులో లేకుండా పోయింది. మండల రెవెన్యూ కార్యాలయాల్లో ఈ సమాచారం పొందడం కష్టంగా మారింది. కొందరు సిబ్బంది ఆ పనులు చేసిపెట్టడానికి వసూళ్లకు పాల్పడుతున్నారు.

కోకొల్లలుగా అవినీతి ఆరోపణలు
* రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి భూముల సర్వే చేపట్టలేదు. కాలక్రమంలో అనేక భూముల హద్దులు మారుతూ వచ్చాయి. వారసులు, క్రయవిక్రయాలతో బై నెంబర్లు వచ్చాయి. హద్దులు తేల్చే విషయంలో సర్వే పేరుతో రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు.
* భూ విక్రయాల అనంతరం 1 బి లో పేరు మార్పిడీ (మ్యుటేషన్‌) చేయించుకోవాలి. దీనికోసం కనీసం రూ.10 వేలు చేతిలో పెడితేనే పనిచేస్తున్నారు.
* ప్రభుత్వం పాత పాసుపుస్తకాల స్థానంలో కొత్త పుస్తకాల పంపిణీ చేపట్టింది. కొన్ని జిల్లాల్లో ఒక్కో పుస్తకానికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. తప్పులను సరిచేయడానికీ వసూళ్లు సాగుతున్నాయి.
* రైతులకు వచ్చే రైతుబంధు మొత్తాన్ని అంచనా వేసి కూడా కొందరు డబ్బులు వసూలు చేస్తున్న సందర్భాలున్నాయి.
* ఎల్‌ఆర్‌యూపీ సందర్భంగా తప్పిపోయిన సర్వే నెంబర్లను చేర్చే పేరుతో, తప్పిపోయిన బై నెంబర్లను చేర్చుతామంటూ వసూళ్లపర్వం సాగుతోంది.

ప్రభుత్వం ఏం చేయబోతోంది?
రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలకు రిజిస్ట్రేషన్ల శాఖ, తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు సేవలను తీసుకొస్తోంది. ధరణి పోర్టల్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 72 లక్షల ఖాతాలు నవీకరించి 54.60 లక్షల పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. మరో మూడున్నర లక్షల పుస్తకాల జారీకి కసరత్తు చేస్తున్నారు. మరోవైపు భూముల సమాచారం ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు జరిగేలా (రియల్‌ టైం ఛేంజెస్‌) వ్యవస్థను రూపొందిస్తోంది. ఇప్పటికే భూ దస్త్రాలకు ఆధార్‌ అనుసంధానం చేపట్టగా, ఫోన్‌నంబర్లను జత చేయనున్నారు. భూమి శిస్తు వసూలు కోసం ఏర్పాటు చేసిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళించి పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావాలని కసరత్తు చేస్తున్నారు. కంక్లూజన్‌ ఆఫ్‌ టైటిల్‌ వ్యవస్థను అమలుచేసి భూమిపై హక్కులను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రద్దుకు విముఖత: ఐకాస
రెవెన్యూ శాఖలో ఒకరిద్దరు చేసిన తప్పులకు శాఖను బలిచేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రెవెన్యూ సంఘాల ఐకాస తెలిపింది. సంస్కరణలు చేపట్టి, కొత్త చట్టాలు తేవడాన్ని ఆహ్వానిస్తామని ప్రకటించింది. అయితే అవినీతిని శాఖ మొత్తానికి ఆపాదించడాన్ని ఖండిస్తున్నట్లు ఐకాస ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు. రెవెన్యూ ప్రక్షాళనను ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి చెప్పారు.

14 మంది రైతుల భూమి ఒకరికి రాసిచ్చారు

రీంనగర్‌ జిల్లా రామడుగు మండలం పందికుంట గ్రామంలో 14 మంది రైతులకు చెందిన 15 ఎకరాల పట్టా భూమిని పెద్దరాజయ్య పేరుతో పట్టా చేశారు. అంతేకాదు రెండు విడతల రైతుబంధు సాయం రూ. 3.20 లక్షలను కూడా అతడి ఖాతాలోనే జమచేశారు. రెవెన్యూ అధికారులే డబ్బులు తీసుకుని అతడి పేరుపై పట్టాచేశారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలియని తాము ఇన్నాళ్లూ పాసుపుస్తకాలు, రైతుబంధు రావడం లేదంటూ తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని అంటున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మార్చడం లేదని వారు చెబుతున్నారు.

కంచికి చేరని 13 ఏళ్ల వ్యథ

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన రైతు నంద్యాల వెంకట్రావుకు 329, 330  సర్వే నంబర్‌లలో ఉన్న 9.20 ఎకరాల భూమిలో 5.12 ఎకరాలను ఒక నాయకుడు 2006లో కబ్జా చేశాడు. లంచాలు ఎరవేసి రెవెన్యూ సిబ్బంది సహకారంతో తన అనుచరుల పేర్లను పహాణీల్లో చేర్చి పట్టా పాసుపుస్తకాలను సంపాదించాడు. తన భూమిని ఆక్రమించారని రైతు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 2007లో సమాచార హక్కు చట్టం సహకారంతో పహాణీ వివరాలు సంపాదించిన ఆయన దానిపై అనేక ఫిర్యాదులు చేశారు. దీంతో 2015, 2016లో గ్రామంలో సర్వే చేయించగా దాదాపు 100 ఎకరాలకు సంబంధించి అక్రమాలు ఉన్నట్లు తేలింది. ఈ నివేదిక వెలుగులోకి రాకుండా తొక్కిపట్టారు. గ్రామంలోని భూ అక్రమాలతోపాటు వెంకట్రావు భూ సమస్య పరిష్కారం కాలేదు. భూ దస్త్రాల ప్రక్షాళనలోనూ ఈ సమస్య వెలుగులోకి రాకుండా చేయడం గమనార్హం.

అవినీతిని ‘పట్టా’కెక్కించారు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కిష్టాయపల్లిలో 166 సర్వే నంబర్‌లో 327.16 ఎకరాల భూమి ఉంది. దీనిలోని 140 ఎకరాలను 1970, 1980లలో నిరుపేదలకు అసైన్‌ చేశారు. 2013-14 మధ్యలో ఒక రెవెన్యూ అధికారి, ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ కలిసి ఒక నాయకుడి సాయంతో లబ్ధిదారులను భయాందోళనలకు గురిచేసి వారితో సంతకాలు చేయించుకుని పాసుపుస్తకాలు లాక్కున్నారు. అనంతరం ఖాస్రా పహాణీల్లో పూర్తిగా మార్పులు చేశారు. కొన్ని పేజీలూ చించేశారు. అసైన్డ్‌ అక్రమం వెలుగుచూసినా అక్రమార్కులకు కొమ్ముకాస్తూ రెవెన్యూ యంత్రాంగం మిన్నకుంటోంది.
- న్యూస్‌టుడే, జిన్నారం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.