Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

రైలు బండి.. ఆలస్యమేనండి!

ఏడాదిలో వెయ్యి పైచిలుకు ఫిర్యాదులు
అన్నిరకాల సమస్యలు కలిపి దాదాపు 10 వేలు
ఇతర ఇబ్బందులు, ఆలస్యంతో ప్రయాణికుల్లో అసహనం
ట్విటర్‌లో రైల్వే మంత్రికి, జీఎంలు, డీఆర్‌ఎంలకు ఫిర్యాదులు
ఈనాడు - హైదరాబాద్‌

* ‘‘మేం ఎక్కిన ప్రత్యేక రైలు నిర్ణీత సమయం కంటే 8 గంటలు ఆలస్యంగా (నం.91497) నడుస్తోందని..అరవింద్‌ అనే ప్రయాణికుడు శుక్రవారం సాయంత్రం రైల్వేమంత్రికి ట్వీట్‌చేశారు.

* సికింద్రాబాద్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాం.. త్రీటైర్‌ ఏసీ బోగీలో పరిస్థితి స్లీపర్‌ బోగీ కంటే అధ్వానంగా ఉంది... ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదని సుదర్శన్‌ అనే ప్రయాణికుడు ట్వీట్‌ చేశారు.

* ‘మేం ఎక్కిన రైలు (నం.12318) బాగా ఆలస్యంగా నడుస్తోంది. పసిపిల్లలు, తల్లులు ఇబ్బంది పడుతున్నారు. ఎండల ప్రభావం ఉంది. స్పందించండి..’ అని సునీల్‌సింగ్‌ అనే ప్రయాణికుడు రైల్వేమంత్రిని ట్విటర్‌లో అభ్యర్థించారు.

మయపాలన విషయంలో రైల్వేలపై ప్రయాణికుల అసహనానికి కొన్ని ఉదాహరణలివి.సురక్షిత ప్రయాణం, సమయపాలన..ఈ రెండు అంశాలు తమ తొలి ప్రాధాన్యాలని రైల్వేశాఖ రెండేళ్లుగా పదేపదే చెబుతోంది. అయితే రైళ్ల ఆలస్యంపై దక్షిణమధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఏడాది వ్యవధిలో వెయ్యికి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి.ఇతర సమస్యలు, ఆహార సంబంధ తదితరాలు కలిపి మొత్తంగా దాదాపు 10 వేల ఫిర్యాదులు నమోదయ్యాయి.

అన్నిచోట్లా అవే సమస్యలు
రైళ్లు ఆలస్యంగా రావడం, ఇతర సమస్యలపై రైల్వేశాఖకు దేశవ్యాప్తంగానూ పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఎస్‌ఎంఎస్‌లు, రైల్వేశాఖ వెబ్‌సైట్లతో పాటు ట్విటర్‌లో రైల్వేమంత్రికి, జీఎంలు, డీఆర్‌ఎంలకు భారీ సంఖ్యలో ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.

ఆ చర్యలు ఏమయ్యాయి?
పీయూష్‌గోయల్‌ రైల్వేమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే భద్రతపై ప్రధాన దృష్టిపెట్టారు. గతంతో పోలిస్తే ప్రమాదాలు కొంత తగ్గుముఖం పట్టాయి. సమయపాలన పాటించడం, ఇతర సమస్యల విషయంలో మాత్రం మార్పురాలేదు. వేల కి.మీ. మార్గాల్లో పాతవి మార్చి కొత్త పట్టాలు వేశారు..ఆర్‌ఆర్‌ఐ వంటి సిగ్నలింగ్‌ టెక్నాలజీ వాడారు.. విజయవాడ వంటి పలు రద్దీ స్టేషన్లకు బైపాస్‌లు వచ్చి కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. అయినా సమయపాలన మెరుగుపడలేదు. ఈ పరిస్థితికి రైల్వేలో వివిధ విభాగాలు, అధికారులు మధ్య సమన్వయ లోపమే కారణమని నిపుణులు విమర్శిస్తున్నారు.

20 రకాల అంశాలపై..
రైళ్లు ఆలస్యంగా రావడం, అపరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతలోపం, అధిక ధరలు, ఏసీలు పనిచేయకపోవడం, చోరీలు తదితరాలు కలిపి మొత్తంగా 20 రకాల అంశాలపై ఫిర్యాదులు సలహాలు రైల్వేశాఖకు అందుతున్నాయి. ఇందులో అత్యధికంగా రైళ్ల ఆలస్యంపైనే. ప్రత్యేక రైళ్ల పరిస్థితి మరీ దారుణం. ఆ తర్వాత బోగీల్లో పరిశుభ్రత, ఫ్యాన్లు, ఏసీలు పనిచేయకపోవడం, ఆహార పదార్థాలకు సంబంధించినవి అధికంగా ఉన్నాయి. ఎక్కడపడితే అక్కడ ఆపడం కారణంగా ఆహారం, మంచినీళ్లు లభించక తాము పడుతున్న ఇబ్బందులపై ట్వీట్లు, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లు ఆలస్యంగా గమ్యస్థానం చేరుతుండటంపై ప్రయాణికుల్లో అసహనం పెరుగుతోంది.

ద.మ.రైల్వే జోన్‌లో ఇదీ పరిస్థితి

* మొత్తం ఫిర్యాదులు : 9,796
* పరిష్కరించినవి : 9,629
* ఇంకా పరిష్కరించాల్సినవి : 167
* అత్యధికంగా సమయపాలనపై : 1,050
(2018 ఏప్రిల్‌ 1 నుంచి వచ్చిన ఫిర్యాదులు)

రైళ్ల రాకపోకల్లో సమయపాలన పాటించకపోవడం తర్వాత బోగీల నిర్వహణ, పరిశుభ్రతపై అత్యధికంగా 510 ఫిర్యాదులు వచ్చాయి. అసాధారణ స్థాయిలో రైళ్లు ఆలస్యంగా నడవడంపై 480, ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడం లేదని 250, రద్దు చేసుకున్న డబ్బులు తిరిగి రాలేదని 240 ఫిర్యాదులు వచ్చాయి. రైళ్లు పొడిగించాలని, అదనపు బోగీలు వేయాలని, ఫలానా స్టేషన్‌లో ఆ రైలు ఆపాలంటూ.. సలహాలు, విజ్ఞప్తులు 730 వరకు వచ్చాయి. కొన్ని స్టేషన్లకు రైళ్లు ఆలస్యంగా వచ్చినప్పటికీ డివిజన్‌ పనితీరు కోసం సమయానికే చేరుకున్నట్లుగా రికార్డు చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

జాతీయ స్థాయిలో అన్ని జోన్లలో కలిపి

* మొత్తం ఫిర్యాదులు : 1,79,402
* పరిష్కరించినవి : 1,73,234
* ఇంకా అపరిష్కృతంగా ఉన్నవి : 6,168
* అత్యధికంగా సమయపాలనపై : 17,700
(2018 ఏప్రిల్‌ 1 నుంచి వచ్చిన ఫిర్యాదులు)

జోన్ల వారీగా చూస్తే..
దిల్లీ కేంద్రంగా ఉన్న ఉత్తర రైల్వే జోన్‌ నుంచి అత్యధికంగా 40,828 ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమ రైల్వేలో 16 వేలు, దక్షిణరైల్వేలో 15,191 ఉన్నాయి. దేశవ్యాప్తంగా 17 రైల్వేజోన్లు ఉండగా.. ఫిర్యాదుల సంఖ్య పరంగా సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణమధ్య రైల్వే ఎనిమిదో స్థానంలో ఉంది. పరిష్కారంలో మాత్రం మిగతా జోన్ల కంటే కొంత మెరుగ్గా  ఉంది. ఇంకా 1.7 శాతం ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.