close

ప్ర‌త్యేక క‌థ‌నం

దేవుడా.. ఇదేం పరీక్ష!

ప్రధాన ఆలయాల్లో ఉసూరుమంటున్న భక్తులు 
క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు 
అమలు కాని మాస్టర్‌ప్లాన్‌ 
ఈ దర్శన్‌ సేవలూ గగనం 
ఈనాడు - అమరావతి న్యూస్‌టుడే బృందం

వేసవి సెలవుల్లో దూరాభారాన్ని లెక్కచేయకుండా పిల్లాపాపలతో పుణ్యక్షేత్రాలకు వెళుతున్న భక్తులు సౌకర్యాలు లేక అలమటిస్తున్నారు. దేవదాయశాఖ ఈ దర్శన్‌ విధానాన్ని అమలు చేస్తున్నా కొన్ని ఆలయాలకే పరిమితమవుతోంది. ప్రత్యేక దర్శనాలు, అభిషేకాలు, అర్చనల వంటి వాటికే ఈ సేవలు పరిమితమవుతున్నాయి. సాధారణ దర్శనానికి వెళ్లే భక్తులకు గంటల తరబడి నిలువు కాళ్ల నిరీక్షణే. చంటిపిల్లల తల్లులు, గర్భవతులు, నడివయసు దాటినవారు ఇలా అనేక మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీఐపీ దర్శనాలకు ప్రత్యేక సమయం అంటూ లేకపోవడం, ఎప్పుడు ఎవరు వచ్చినా ఆలయాల్లో వారి మర్యాద, మన్ననలకే ప్రాధాన్యం ఇవ్వడం సాధారణ  భక్తులకు ఇబ్బందులు కలిగిస్తోంది.

రాష్ట్రంలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం వంటి ప్రధాన ఆలయాల్లో నిత్యం రద్దీ ఉంటోంది. ప్రధానంగా తిరుపతికి సమీపంలో ఉండే శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలపై ఆ ప్రభావం బాగా కనిపిస్తుంటుంది. ఈ ఆలయాల్లో కొన్నింటికి ఇప్పటికీ క్యూ కాంప్లెక్సులు లేకపోవడం గమనార్హం. ఇలాంటి చోట ఉచిత దర్శనం త్వరగా పూర్తయ్యేలా సాంకేతికతను ఉపయోగించుకునేవైపు ఆలోచన చేసే ఆస్కారమే కనిపించడం లేదు.

మల్లికార్జున ఆలయం

రద్దీ రోజుల్లో ఉచిత దర్శనానికి సగటున పట్టే సమయం: 6 గంటలు. 
క్యూ కాంప్లెక్సులు: లేవు 
రద్దీ కాలాలు: వేసవి, పర్వదినాలు, కార్తీకమాసం, శ్రావణమాసం రోజులు, వారాంతాలు, సెలవు రోజలు. 
శివరాత్రికి వచ్చే భక్తులు: దాదాపు 10 లక్షలు. 
ఉగాదికి వచ్చే భక్తులు: 6 లక్షలు.

వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం

నిత్యం రద్దీ: సాధారణం. 
వారాంతాల్లో వచ్చే భక్తులు: 50 వేల మంది 
రద్దీకాలం: మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌. 
రద్దీ రోజుల్లో దర్శన సమయం: 3 గంటలు. 
ప్రస్తుత పరిస్థితి: క్యూ కాంప్లెక్సుల నిర్మాణం జరగలేదు. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా వీటి నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా ఇంకా ముందడుగు పడలేదు.

వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయం

రోజూ వచ్చే భక్తులు: 20 వేల నుంచి 25 వేల మంది. 
వారాంతాలు, సెలవు రోజుల్లో: 50 వేల మంది. 
రద్దీ ఉన్నప్పుడు దర్శన సమయం: 2 గంటలు. 
రద్దీకాలం: కార్తీక మాసం.

వేంకటేశ్వరస్వామి ఆలయం

రోజూ వచ్చే భక్తులు: 10 వేల మంది. 
వారాంతంలో: 35 వేల నుంచి 40 వేల మంది. 
రద్దీ ఉన్నప్పుడు దర్శన సమయం: 3 గంటలు. 
ప్రస్తుత పరిస్థితి: తాత్కాలిక క్యూ కాంప్లెక్సులను నిర్మించారు. రద్దీ ఎక్కువగా ఉంటే మంచినీళ్లు, పాలు వంటివి సరఫరా చేస్తుంటారు.

వరసిద్ధి వినాయక ఆలయం

రోజూ వచ్చే భక్తులు: 20 వేల మంది. 
రద్దీ రోజుల్లో: 40 వేల మంది. 
రద్దీకాలం: వేసవి సెలవుల సందర్భంగా మే 15 నుంచి జూన్‌ 15 వరకు. 
అభిషేకాలు: రోజూ 3 సార్లు. దీనివల్ల దర్శనాలు ఆలస్యం. 
ప్రస్తుత పరిస్థితి: క్యూ కాంప్లెక్సులు ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. కూర్చునే వీలు లేదు. మాస్టర్‌ ప్లాన్‌ అమలు కావడం లేదు.

శ్రీకాళహస్తీశ్వర, జ్ఞాన ప్రసూనాంబ ఆలయం

రోజుకు వచ్చేవారు: 30వేల నుంచి 40 వేల మంది. 
వారాంతంలో: 50 వేల మంది. 
ఉచిత దర్శనానికి పట్టే సమయం: 4 గంటలు. 
ప్రత్యేక ప్రవేశ దర్శనానికి: గంటన్నర. 
ప్రస్తుత పరిస్థితి: మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా క్యూ కాంప్లెక్సులను నిర్మించాల్సి ఉన్నా భూసేకరణ అంశం ఇంకా తేలలేదు. కోర్టు కేసుల వల్ల ముందుకు సాగడం లేదు.

దుర్గామల్లేశ్వర ఆలయం

రోజూ వచ్చే భక్తులు: 30 వేల మంది. 
వారాంతంలో: 50 వేల నుంచి 60 వేల మంది. 
రద్దీ కాలం: ప్రతి శుక్ర, ఆదివారాలు. 
రద్దీ వేళల్లో సాధారణ దర్శన సమయం: 2 గంటలు. 
ప్రస్తుత పరిస్థితి: మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించినా ఆ ప్రకారమే పనులు చేస్తున్న దాఖలాలు ఏమీ లేవు. ఆలయానికి వచ్చిన కార్యనిర్వహణాధికారుల నిర్ణయం మేరకు పనులు సాగుతున్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.