close

తాజా వార్తలు

‘అమేఠీ అభివృద్ధిని మోదీ అడ్డుకుంటున్నారు’

అమేఠీ: మోదీ అధికారంలోకి వచ్చాక అమేఠీలో అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేశారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కావాలనే భాజపా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క కార్యక్రమాన్ని కొనసాగించడం లేదన్నారు. ‘‘అమేఠీలో మేం(కాంగ్రెస్) చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ మోదీ నిలిపివేశారు. నియోజకవర్గ పరిధిలో ఆహార శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచించాం. దీని ద్వారా ఈ ప్రాంతంలో పండుతున్న పండ్లు, కూరగాయలు ప్రపంచ దేశాలకు చేరేవి. కానీ దాన్ని మోదీ నిలిపివేశారు. అలాగే ఓ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భాజపా అధికారంలోకి వచ్చాక అది కూడా ఆగిపోయింది’’ అని  రాహుల్‌ అన్నారు. తనకు తాను కాపలాదారుడిగా చెప్పుకుంటున్న మోదీ..దేశంలో ఆయన దోచుకున్నది అమేఠీ ప్రజలనే ఎక్కువ అని వ్యాఖ్యానించారు.

ఇటీవల ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. రాహుల్‌ ఇలాంటి ఆరోపణలే చేశారు. నియోజకవర్గంలో దాదాపు 40 చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని స్థాపించాలని నిర్ణయించామన్నారు. కానీ మోదీ వాటన్నింటినీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన స్పందించడం లేదన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక అమేఠీ అభివృద్ధి మందగించిందన్నారు. 2004 నుంచి అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌ 2019లోనూ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాహుల్‌ నామినేషన్‌ పత్రాలపై వచ్చిన అనుమానాల్ని నివృత్తి చేసిన ఈసీ.. అన్నీ సవ్యంగానే ఉన్నట్లు తెలిపింది. 



మరిన్ని

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net