Hyd: షోరూం మొదటి అంతస్తు నుంచి కారు పల్టీ

తాజా వార్తలు

Updated : 20/07/2021 09:54 IST

Hyd: షోరూం మొదటి అంతస్తు నుంచి కారు పల్టీ

రెండు కార్లు ధ్వంసం, ఒకరికి గాయాలు 

నాగోలు, న్యూస్‌టుడే: కార్ల షోరూంలోని మొదటి అంతస్తు నుంచి అప్పుడే కొన్న ఓ కారు అమాంతం నేలపైకి దూకి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కిందనున్న షోరూం మేనేజర్‌ కారుపై పడటంతో అది కూడా తుక్కుతుక్కైంది.  మరో ద్విచక్రవాహనం ధ్వంసమైంది. ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి కథనం ప్రకారం..

మేడిపల్లికి చెందిన పెద్దపల్లి భగవంత్‌(59) ఎల్‌ఐసీ సంస్థలో ఉద్యోగి. సోమవారం అలకాపురి చౌరస్తాలోని టాటా షోరూంలో భార్యా పిల్లలతో సహా వెళ్లి ఓ కొత్త టియాగో కారును కొనుగోలు చేశాడు. షోరూం మొదటి అంతస్తులో నిలిపిన కారును ఓసారి నడిపి చూస్తానని కారులో కూర్చుని కాసేపయ్యాక ఇంజిన్‌ను స్టార్ట్‌ చేసిన భగవంత్‌ హఠాత్తుగా ఆ కారును ముందుకు ఉరికించాడు. మొదటి అంతస్తు నుంచి కారును కిందకి దింపేందుకు ఉపయోగించే హైడ్రాలిక్‌ లిఫ్టు మీదుగా కారు అమాంతం ఎగిరి అలకాపురి చౌరస్తాలోని ఇన్నర్‌ రింగు రోడ్డుపైకి దూకింది. షోరూం మేనేజర్‌కు చెందిన ఓక్స్‌వ్యాగన్‌ కారుపై పడి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండుకార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. భగవంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదాన్ని నివ్వెరపోయి చూస్తున్న ప్రయాణికులతో  ఇన్నర్‌రింగు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరు మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఏసీపీ శ్రీధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. శిక్షణ పొందిన సిబ్బందితో కారును కిందకి దించి ఇవ్వాల్సిందిపోయి అతన్ని ప్రోత్సహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాలిక్‌ లిఫ్టుకు సైతం రక్షణ కోసం రెయిలింగ్‌ లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేందర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని