Black Fungus: కోలుకున్న తర్వాత జాగ్రత్త!
close

తాజా వార్తలు

Updated : 14/05/2021 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Black Fungus: కోలుకున్న తర్వాత జాగ్రత్త!

ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌

విశాఖపట్నం: కొవిడ్‌ కేసుల నుంచి కోలుకున్నవారిలో ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. మరోవైపు హ్యాపీ హైపోక్సియా పొంచి ఉంది. జ్వరం వచ్చిన వెంటనే సీటీ స్కాన్‌ కోసం పరుగులు తీస్తున్న సందర్భాలూ ఎదురవుతున్నాయి. వీటిని ఏ సమయంలో గుర్తించాలి... వైద్య పరంగా ఏరకంగా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి. సుధాకర్‌ ‘ఈటీవీ-న్యూస్‌టుడే’ ముఖాముఖిలో తెలిపారు.

ప్రశ్న : స్టెరాయిడ్స్‌ వల్ల మధుమేహుల్లో షుగర్‌ స్థాయిలు పెరుగుతున్నాయి కదా?

జ: షుగర్‌ లెవల్స్‌ పెరిగితే ఇన్సులిన్‌ వాడాల్సి ఉంటుంది. వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. మ్యూకార్‌ మైకోసిస్‌ నుంచి బయటపడేందుకు కొన్నిసార్లు శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. లేదా ఒక ప్రత్యేక ఔషధం చాలా కాలం వాడాల్సి ఉంటుంది. కొవిడ్‌ చికిత్సలో స్టెరాయిడ్స్‌ ఉపయోగిస్తే మాత్రం దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

ప్రశ్న : బ్లాక్‌ ఫంగస్‌ సమస్య కొత్త సవాలు విసురుతున్న నేపథ్యంలో దీనిని ఎలా గుర్తిస్తారు?

జ: బ్లాక్‌ ఫంగస్‌ను వైద్య పరిభాషలో మ్యూకార్‌ మైకోసిస్‌ అంటారు. ఇది నాసికా రంధ్రాల్లో ఉంటుంది. దానికి చిన్న చిన్న స్పోర్స్‌ ఉంటాయి. అవి మనం గాలి పీల్చినపుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. అది ఫంగస్‌గా మారి ఎక్కువ సంఖ్యలో ఉంటే ప్రమాదం. కొవిడ్‌ వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ సమయంలో మ్యూకార్‌ మైకోసిస్‌ స్పోర్స్‌ ఫంగస్‌ కింద మారి హానికరంగా తయారవుతాయి. స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడేవారు, మధుమేహం ఉన్నవారు, క్యాన్సర్‌ మందులను తీసుకునేవారు ఎక్కువగా దీని బారినపడతారు. కొవిడ్‌ చికిత్సలో స్టెరాయిడ్‌ వాడకం తప్పనందున ఇది ఒక దుష్ప్రభావంగా వస్తోంది. ఈ మ్యూకార్‌ మైకోసిస్‌.. సైనసిస్, ఊపిరితిత్తులు, కంట్లోకి ప్రవేశించి మెదడులోకి వెళ్తాయి. దీనివల్ల పాక్షికంగా దృష్టి కోల్పోవడం, మెదడులోకి వెళ్తే ఫిట్స్‌ రావడం, ఊపిరితిత్తుల్లోకి వెళితే ఊపిరి ఆడని పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ప్రాణాపాయానికే దారితీస్తాయి. అందుకే పరిమితంగా స్టెరాయిడ్‌లను ఉపయోగించాలి.

ప్రశ్న : హ్యాపీ హైపోక్సియాను ఏ రకంగా గుర్తించాలి?

జ: ఆక్సిజన్‌ సరిపడా వెళ్లకపోయినా యువతలో తట్టుకోగల శక్తి ఉంటుంది. వృద్ధుల్లో వెంటనే ఆయాసం వచ్చేస్తుంది. యువత అది గుర్తించలేరు. పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారానే దీన్ని తెలుసుకునేందుకు వీలవుతుంది. 90 కంటే తక్కువ ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి. ఇంటి వద్ద పల్స్‌ ఆక్సీమీటర్‌ పెట్టుకుని చూసుకోవాలి. నడక ముందు, తర్వాత వ్యత్యాసం ఐదు శాతం కంటే ఎక్కువగా ఉంటే అప్రమత్తం కావాల్సిందే. ఇవి ప్రమాద ఘంటికలు. ఆక్సిజన్‌ అవసరంతోపాటు, ఆసుపత్రిలో చేరాలన్నది గుర్తించాలి.

ప్రశ్న : ఇప్పుడు కేసులు పతాక స్థాయికి చేరాయా.. ఇక తగ్గడం మొదలవుతుందా...?

జ: పతాక స్థాయికి ఇంకా చేరుతోంది. మరో పది రోజులు లేదా రెండు వారాల్లో పతాకస్థాయికి చేరి అక్కడి నుంచి సరళరేఖగా మారి, తగ్గుదల నమోదవుతుందని అంచనా. ఈ లోగా వ్యాక్సిన్‌ ప్రక్రియను వేగవంతం చేయగలిగితే మూడో వేవ్‌ నుంచి ఉపశమనం పొందొచ్చు. లేదంటే మళ్లీ ఈ భయంకర దృశ్యాలు పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. 

ప్రశ్న : ఆక్సిజన్‌ అవసరం లేకుండా ఇంటి వద్దే నయమవడానికి ఉన్న అవకాశాలు ఏంటి?
జ: 85 శాతం మంది ఇంటి వద్దనే కోలుకుంటున్నారు. పల్స్‌ ఆక్సీమీటర్‌లో 94 చూపగానే కంగారు పడిపోయి ఏదో అయిపోతోందనే భయం వద్దు. ప్రాణాయామం లాంటి శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఐసొలేషన్‌లో ఉంటూ మందులు వాడడం, బలవర్థకమైన ఆహారం తీసుకోవడం చేయాలి. 90కి తగ్గితే ఆసుపత్రి అవసరమని గుర్తించాలి.

ప్రశ్న : కోలుకున్నాక కూడా హఠాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయి... ఎందుకు?

జ: నెగెటివ్‌ వచ్చిన తర్వాత కూడా రక్తం గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఆసుపత్రిలో చేరిన వారికి డి-డైమర్‌ అనే పరీక్ష చేస్తాం. ఇది బాగా ఎక్కువ ఉంటే వాళ్లలో రక్తం పల్చబడటానికి కొన్ని మందులు దీర్ఘకాలం వాడాలని సూచిస్తాం. ఈ పరీక్ష నిర్వహించని కేసుల్లో, సమస్య గుర్తించని వారికి కొవిడ్‌ తగ్గిపోయి ఇంటికి వెళ్లిన తర్వాత రక్తం గడ్డకట్టి హఠాత్తు మరణానికి దారి తీస్తోంది. రక్తం పల్చబడేందుకు మందులు వాడిన వారికి ఈ పరిస్థితి రాదు.

ప్రశ్న : కేసులు పతాకస్థాయికి చేరితే వైద్యరంగం ఒత్తిడిని తట్టుకోగలదా?
జ: ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. ఒత్తిడి పెరుగుతుందనే అప్రమత్తమయ్యాం. ఆక్సిజన్‌ పడకలు పెంచడానికి, ఆక్సిజన్‌ జనరేటర్‌లు, ప్రాణవాయువు సరఫరా పెంచేందుకు మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. రాబోయే కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు మరింతగా శక్తిని కూడగట్టుకుంటున్నాం.

ప్రశ్న : కొవిడ్‌ చికిత్సలో స్టెరాయిడ్ల వాడకానికి ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా?

జ: కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన మొదటి వారం దాటిన తర్వాత స్టెరాయిడ్‌ వాడతాం. ఆసుపత్రిలో చేరి రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గుతున్న సందర్భంలోనే వినియోగిస్తారు. వారం దాటినా జ్వరం, తీవ్రమైన దగ్గు వచ్చేవారికి ఇవి అవసరం. శ్వాస ఆడనప్పుడు, జ్వరం తగ్గని సందర్భంలోనూ స్టెరాయిడ్‌ వాడడం మూలాన ఇన్ఫెక్షన్‌ తగ్గుతుంది. మ్యూకార్‌ మైకోసిస్‌ వచ్చినా ఆ సమయంలో స్టెరాయిడ్‌ వాడడం తప్పనిసరి. ఎప్పటికప్పుడు సమీక్షించుకొని వాటిని క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. దీనిపై వైద్యులు మరీ అప్రమత్తంగా ఉండాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని