Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 12/06/2021 20:56 IST

Top Ten News @ 9 PM

1. Covaxin: అమెరికాలో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌

భారత ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ అమెరికాలో కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ మేరకు కంపెనీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. యూఎస్‌లో మార్కెట్‌ అప్లికేషన్‌ కోసం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఏయే ప్రాంతాల్లో ట్రయల్స్‌ చేపట్టనున్నారు? అందులో ఎంతమంది వాలంటీర్లు పాల్గొనున్నారనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కరోనా వ్యాప్తి నివారణ కోసం భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ది చేసింది. ఈ టీకాను విదేశాల్లోనూ మార్కెటింగ్‌ చేయాలని భావిస్తున్న సంస్థ.. ఇందుకోసం ఆక్యుజన్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

2. కేటీఆర్‌ను కలిస్తే తెరాసలో చేరినట్లా?: కౌశిక్‌రెడ్డి

తెరాస తనను ఆహ్వానించిందనటం అవాస్తవమని హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి తెలిపారు. తెరాసలోకి వెళ్లనని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచే పోటీ చేశానని, ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. కేటీఆర్‌ను కలిసినంత మాత్రాన తెరాసలోకి వెళ్లనని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌దే విజయమని కేటీఆర్‌తోనూ చెప్పానని అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ టికెట్‌ తనకే వస్తుందని ఆశిస్తున్నట్టు కౌశిక్‌రెడ్డి తెలిపారు.  తెరాస గురించి ఈటల రెండేళ్లుగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

3. బెజవాడలో భారీ ‘రియల్‌’ మోసం

బెజవాడకు చెందిన నిర్మాణ రంగ సంస్థ ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ బోర్డు తిప్పేసింది. కొనుగోలుదారుల నుంచి సుమారు రూ.6కోట్ల వరకు అడ్వాన్సులు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా మూసేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పట్నాల శ్రీనివాసరావు గతేడాది ఆగస్టులో విజయవాడ కేంద్రంగా ఎంకే కనస్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ఏర్పాటు చేశారు. గురునానక్‌ కాలనీలోని మహానాడులో కార్యాలయాన్ని తెరిచారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలోనూ ఒక బ్రాంచిని ఏర్పాటు చేశారు.

4. బాల్యవివాహాలతో అంధకారంలో ఆడపిల్లల భవిష్యత్

బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలనపై ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మంత్రి వెబినార్ నిర్వహించారు. విద్య, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధిస్తున్నప్పటికీ సమాజంలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరగడం దురదృష్టకరమన్నారు. బాల్యవివాహాలతో ఆడపిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఎక్కువగా గిరిజనులు, పేదవాళ్లు ఉన్న ప్రాంతమని.. ఆడపిల్ల ఇంట్లో ఉంటే భద్రత, పోషణ విషయంలో పేదలకు అనేక ఇబ్బందులు ఉంటాయని మంత్రి అన్నారు.

మధుకాన్‌ సంస్థల్లో రెండో రోజు ఈడీ సోదాలు
TS NEWS: కొత్తగా 1,771 కరోనా కేసులు

5. yellow watermelon: ఐడియా.. అదిరింది గురూ!

పుచ్చకాయ కోస్తే ఏ రంగులో ఉంటుంది.. మరో ఆలోచన లేకుండా ఎరుపు రంగు అని చెప్పేస్తారు. పసుపు పచ్చరంగు పుచ్చకాయని ఎప్పుడైనా చూశారా అని అడిగితే మాత్రం.. సామాజిక మాధ్యమాల్లో.. లేదా విదేశాల్లో చూశామన్న సమాధానమే వినిపిస్తుంది. అదే కర్ణాటకు చెందిన ఓ యువకుడిని ఆలోచనలో పడేసింది. మన దేశంలోనూ ఈ రకం పుచ్చకాయలు పండించవచ్చని నిరూపించేలా చేసింది. అంతేకాదు అమ్మకాల్లో ప్రత్యేకత చాటుతూ.. రైతులకే ఓ సూపర్‌ మోడల్‌గా నిలిచేలా ప్రోత్సహించింది. ఆ యువ రైతు ఎవరో.. పసుపు రంగు పుచ్చకాయల కథేంటో చూద్దమా! కర్ణాటకలోని కోరల్లికి చెందిన ఓ యువరైతు పేరు ఈ వేసవిలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

6. CJI జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన ప్రముఖులు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీజేఐని కలిశారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి దేశ అత్యున్నత పదవిలో నియామకం కావడం యావత్ తెలుగు ప్రజలకు గర్వకారణంగా ఉందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెంచడం, న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలని ఆదేశించడంపై ఉత్తమ్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

7. Vaccine: రాష్ట్రాలకు 25.8కోట్ల డోసులిచ్చాం

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇప్పటివరకు 25.87 కోట్ల కరోనా టీకా డోసులను అందించింది. ఉచితంగా, రాష్ట్రాలు నేరుగా సేకరించుకునే విధానంలో ఈ మొత్తాన్ని పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటివరకు 25,87,41,810 టీకా డోసులను రాష్ట్రాలకు అందించగా.. 24,76,58,855 డోసులను వినియోగించినట్లు తెలిపింది. వాటిలో వృథా అయిన డోసులు కూడా కలిసి ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం 1.12 కోట్లకు పైగా డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది.

8. China Spy: దేశంలో చైనా గూఢచారి

భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడ్డ చైనాకు చెందిన హాన్ జున్‌వే..  ఆ దేశ గూఢచారిగా బీఎస్ఎఫ్ విచారణలో వెల్లడైంది. చైనా ఇంటెలిజెన్స్ సంస్థ కోసం జున్‌వే మనదేశంలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో వందల సిమ్‌కార్డులు సంపాదించి, వాటిని అక్రమంగా చైనాకు తరలించడం సహా.. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. జున్‌వే గురుగ్రామ్‌లో ఓ హోటల్‌ను  సైతం నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. బంగ్లాదేశ్‌ సరిహద్దుల నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ చైనా దేశస్థుడు హాన్‌ జున్‌వే విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. చైనా ఇంటెలిజెన్స్‌ సంస్థ తరఫున జున్‌వే భారత్‌లో గూఢచారిగా పనిచేస్తున్నట్లు సరిహద్దు భద్రతాదళం విచారణలో వెల్లడైంది. 

9. EV: తగ్గనున్న ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ ధరలు

పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ తయారీదారులకు అందించే సబ్సిడీనీ పెంచింది. ఇందుకోసం ఫేమ్‌- 2 (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India Phase II) పథకంలోని కొన్ని సవరణలు చేసింది. ఈ మేరకు భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులకు ప్రస్తుతం 1KWhకు ₹10వేలు చొప్పున ఇస్తున్న సబ్సిడీని ₹15 వేలకు పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది. వాహనం ఖరీదులో గరిష్ఠంగా 40 శాతం వరకూ ఈ ప్రోత్సాహకాలను అందించనున్నారు.

10. ఈ నెల 18న వైద్యుల దేశవ్యాప్త నిరసన: ఐఎంఏ

బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా ‘సేవ్‌ ది సేవియర్‌’ నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఈ నెల 18న ఆందోళన చేపట్టనున్నట్టు ఐఎంఏ వెల్లడించింది. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది నల్లటి వస్త్రాలు, మాస్కులు, బ్యాడ్జీలను ధరించి నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.  శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆ రోజు ఆసుపత్రులు పని చేస్తాయని తెలిపింది. వైద్యులు సహా ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల నియంత్రణకు కఠిన చట్టాలను రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

సాగరతీరంలో కొలువుతీరిన జీ-7 నాయకులు
Video: పెంపుడు కుక్కను పట్టుకెళ్లిన చిరుత


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని