రాష్ట్రంలో 350 బస్తీ దవాఖానాలు:ఈటల

తాజా వార్తలు

Updated : 24/03/2021 14:16 IST

రాష్ట్రంలో 350 బస్తీ దవాఖానాలు:ఈటల

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇతర పెద్ద నగరాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటు ఆలోచన ఉందా? అంటూ పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానమిచ్చారు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర కార్పొరేషన్లలోనూ బస్తీదవాఖానాలు ఏర్పాటు చేస్తామని ఈటల శాసనసభలో వెల్లడించారు. రాష్ట్రంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి అనుమతిచ్చారని, క్రమంగా వాటిని విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్బన్‌ పీహెచ్‌సీలు అందుబాటులో లేని ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల దూరంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన సభకు వెల్లడించారు. వైద్యుడితో పాటు ఇద్దరు సిబ్బందితో ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు సేవలు అందిస్తున్నామని ఈటల తెలిపారు.

కూలీల కొరత తీవ్రంగా ఉంది: నిరంజన్‌రెడ్డి

వ్యవసాయ యాంత్రీకరణకు ఊబర్‌ తరహా విధానాన్ని తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉందన్నారు. దీని వల్ల ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులకు ఏడాదికి 71 లక్షల పని గంటలు అవసరం కాగా.. 16 లక్షల పని గంటల వరకు కొరత ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఈ కొరత అధికమయ్యే అవకాశం ఉన్నందున యాంత్రీకరణ అత్యవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 92.5 శాతం భూమి, చిన్న, సన్నకారు రైతుల వద్ద ఉందని.. అందుకు అనుగుణంగా యాంత్రీకరణ విధానాన్ని రూపొందిస్తున్నామని నిరంజన్‌రెడ్డి వివరించారు. బడ్జెట్‌లో యాంత్రీకరణకు రూ.1500 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం 45 శాతం వరకు ఉన్న యాంత్రీకరణను 95 శాతానికి తీసుకెళ్లాలనేదే ప్రభుత్వ లక్ష్యమని నిరంజన్‌రెడ్డి సభకు వెల్లడించారు.

భాజపాకు ఎర్రబెల్లి చురకలు

రాష్ట్రంలోని పల్లెలన్నీ వరంగల్‌ జిల్లా గంగదేవ్‌ పల్లెలను తలపిస్తున్నాయని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనసభకు తెలిపారు. 8,690 గ్రామ పంచాయతీల ఉండగా.. వాటిని 12,750కి పెంచామన్నారు. పల్లెల్లో వైకుంఠధామాలు 95 శాతం పూర్తి అయ్యాయని.. ఎమ్మెల్యేలందరూ సమీక్షించి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానంగా చెప్పారు. నర్సరీలతో పాటు సర్పంచులు బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. నిధుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ పనితీరును కేంద్రం పురస్కారాలతోనే సరిపెడుతోందని ఆయన భాజపాకు చురకలంటించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు వచ్చేలా చూడాలని భాజపా ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని