Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

తాజా వార్తలు

Published : 28/07/2021 20:56 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

1. దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్‌ 

కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌ స్టేషన్‌ నుంచి భారీ భద్రత మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హనుమాన్‌ జంక్షన్‌ తరలించారు. హనుమాన్‌ జంక్షన్‌ సీఐ ఆఫీసులో జూమ్‌ యాప్‌ ద్వారా వర్చువల్‌గా మైలవరం కోర్టు జడ్జి ఎదుట ఉమాను హాజరుపర్చారు. దేవినేని ఉమాకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. రాజమహేంద్రవరం జైలుకు తరలించాలని ఆదేశించారు.

2. జగన్‌, విజయసాయి వాదనలకు సిద్ధం కావాలి: సీబీఐ కోర్టు

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జగన్‌, విజయసాయిరెడ్డిని కోర్టు ఆదేశించింది. విశ్రాంత ఐఏఎస్‌ శామ్యూల్‌ డిశ్ఛార్జి పిటిషన్‌పై కౌంటరుకు సీబీఐ గడువు కోరింది.

జాతీయ డిజిటల్‌ టూరిజం మిషన్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్య రాష్ట్రంగా ఏపీ

3. శ్రేణులపై వేధింపులు ఆపకపోతే బుద్ధి చెబుతాం: రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని.. ప్రజాస్వామ్యం నిలువునా ఖూనీ అవుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌ కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకోవడం.. ఆయన హక్కులను కాలరాసినట్లేనని ధ్వజమెత్తారు.

4. కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో  జలాశయం నిండుకుండను తలపిస్తోంది. జూరాల, సుంకేసుల నుంచి దాదాపు 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో జలశయంలో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జలాశయం గేటును 10 అడుగుల మేర పైకెత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు.

5. Basavaraj Bommai: వరాలు కురిపించిన బొమ్మై

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే బసవరాజ్‌ బొమ్మై రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రైతు కుటుంబాల పిల్లలకు రూ.1000కోట్లతో ఉపకారవేతనాలు చెల్లించనున్నట్టు ప్రకటించారు. అలాగే, పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు వృద్ధాప్య పింఛన్‌ను రూ.1000 నుంచి రూ.1200లకు పెంచడంతో పాటు వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను రూ.600 నుంచి రూ.800లకు పెంచుతున్నట్టు బొమ్మై తెలిపారు.

WhatsApp: కొత్త ఫీచర్‌తో ఆర్కైవ్‌ కష్టాలకు చెక్‌! 

6. కరోనా మరణమృదంగం.. గత వారంలోనే 21% పెరిగాయ్‌!

ప్రపంచ దేశాల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ఉద్ధృతి ఇటీవల కాస్త తగ్గినట్టు కనబడినప్పటికీ కొత్త రూపాలతో విరుచుకుపడి అనేకమంది ప్రాణాల్ని బలితీసుకుంటోంది. గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా మరణాలు సంఖ్య 21శాతం పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అమెరికా, ఆగ్నేయాసియాలోనే దాదాపు 69 వేలకు పైగా మరణాలు నమోదైనట్టు పేర్కొంది. 

7. బ్యాంకులపై మారటోరియం ఉన్నా.. డిపాజిట్లకు రూ.5లక్షల బీమా

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మారటోరియం విధించినా బ్యాంకు ఖాతాదారులకు కూడా డిపాజిట్‌ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డీఐసీజీసీ(డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌) చట్ట సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

8. ‘ఆకాశ’ మార్గాన బిగ్‌బుల్‌!

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ రూ.వేల కోట్లు ఆర్జిస్తున్న బిగ్‌ బుల్‌, ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా పేరొందిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇకపై నేరుగా ప్రత్యక్ష వ్యాపారంలోకి దిగబోతున్నారు. కొన్ని దశాబ్దాలుగా షేర్‌ మార్కెట్‌పై తనదైన ముద్ర వేసిన ఆయన విమానయాన రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేలా ఓ చౌక విమానయాన సంస్థను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు.

9. ఒలింపిక్‌ నగరంలో కరోనా రికార్డులు..!

ఒలింపిక్ క్రీడల వేదిక టోక్యోలో కరోనా విజృంభిస్తోంది. ఈ నగరంలో తాజాగా 3,177 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి ఆ దేశంలోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి టోక్యో నగరంలో మూడువేలకు పైగా కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. ముందురోజు 2,848 మందికి పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. జనవరి 7న నమోదైన అత్యధిక కేసులు 2,520 కన్నా ఈ రెండురోజులు ఎక్కువ కేసులు వచ్చాయి. 

10.  IND Vs SL: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ ఆరంభమైంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్‌ డాసున్‌ శనక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఇక, మంగళవారం జరగాల్సిన ఈ టీ20‌.. భారత ఆటగాడు కృనాల్‌ పాండ్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఇవాళ్టికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో దేవదత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, నితీశ్‌ రాణా, చేతన్‌ సకారియా టీ20ల్లో అరంగేట్రం చేశారు.

IND Vs SL: లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని