Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 02/08/2021 20:57 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కృష్ణా జలాలపై ఎవరిది దాదాగిరి..?: సజ్జల

కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి చేస్తోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. ఎవరు దాదాగిరి చేశారో అందరికీ తెలుసన్నారు. దాదాగిరి అంటే విద్యుదుత్పత్తి పేరుతో నీటిని సముద్రానికి వదలడమే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. జలవిద్యుత్‌ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రంపాలు చేశారని విమర్శించారు.

2. వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఘటాన్ని అంబారీపై ఉంచి ఊరేగింపుగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయం వద్దకు తీసుకొచ్చారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు గుమిగూడారు. అమ్మవారి నామస్మరణలతో నృత్యాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

3. ఎంపీ విజయసాయి, జగతి పబ్లికేషన్స్‌కు లీగల్‌ నోటీసులు

పరువునష్టం దావా కేసుకు సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డికి ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు లీగల్‌ నోటీసులు పంపారు. ఆయనతోపాటు జగతి పబ్లికేషన్స్‌ ఎండీ సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి టీవీ ఈడీ వినయ్‌ మహేశ్వరి, సాక్షి పత్రిక ఎడిటర్‌ మురళి, ప్రింటర్‌-పబ్లిషర్‌ రామచంద్రమూర్తికి ఏబీ నోటీసులు ఇచ్చారు. వీరందరికీ జులై 19న పరువునష్టం దావా నోటీసులు పంపారు. 

4. సీఎం సమీక్షలు ఎన్నిక జరగబోయే నియోజకవర్గానికేనా..?

‘కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా... ఉప ఎన్నిక జరగబోయే నియోజకవర్గానికేనా?’ అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సీఎం సమీక్షలు ఉప ఎన్నిక జరగబోయే నియోజకవర్గానికే పరిమితమైతే ఎలా? అని, సుదీర్ఘంగా కేబినెట్‌ భేటీ జరిగినా అధికారిక ప్రకటన కూడా రాలేదని పొన్నాల మండిపడ్డారు.

5. జికా కలకలం.. మహారాష్ట్రకు కేంద్ర బృందం

మహారాష్ట్రలో జికా వైరస్‌ తొలి కేసు నమోదవడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇటీవల పుణె జిల్లాలో తొలి జికా వైరస్‌ కేసు వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో జికా వ్యాప్తికి సంబంధించి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులున్న అత్యున్నత అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ఆ వైరస్‌ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బృందం తోడ్పాటు అందించనున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

6. ‘ఇ-రూపీ’ ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను మరింత విస్తృతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఇ-రూపీ’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగదురహిత లావాదేవీల ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు.

7. మోదీ సలహాదారు అమర్జీత్‌ సిన్హా రాజీనామా!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో  సలహాదారుగా పనిచేస్తున్న మరో సీనియర్‌ అధికారి రాజీనామా చేశారు. పీఎంవోలో సామాజిక సంబంధమైన వ్యవహరాలను చూస్తున్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అమర్జీత్‌ సిన్హా తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. బిహార్‌ క్యాడర్‌కు చెందిన అమర్జీత్‌ సిన్హా 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.

8. Rani Rampal: విరిగిన స్టిక్‌తో.. ఒలింపిక్‌ పతక వేట

ఆమె పేరుకే రాణి.. కానీ జీవితమంతా వెతలే! ఇంట్లో కరెంటు కూడా లేనంతటి పేదరికం... అర లీటరు పాలు కొనలేని దుస్థితి... పైగా అమ్మాయిలకు ఆటలేంటి? అనే సవాళ్లు ఎదుర్కొంది... అయితే ఏంటట? హాకీనే ఊపిరి చేసుకొని అన్నింటికీ ఎదురొడ్డింది... విరిగిన హాకీ స్టిక్‌తో సాధన మొదలు పెట్టింది... కష్టాలన్నీ గోల్‌పోస్ట్‌లోకి నెట్టేసి దేశం గర్వించే క్రీడాకారిణిగా ఎదిగింది..

9. మా’ అధ్యక్షుడు ఏకగ్రీవమైతే తప్పేంటి?: నరేశ్‌

రాబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతు తెలుపుతానో ఇంకా నిర్ణయించుకోలేదని, ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉండటంతో దానిపై స్పందించటం సరికాదని సీనియర్‌ నటుడు, ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ అన్నారు. భాజపాలాంటి జాతీయ పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకునేటప్పుడే ఏకగ్రీవం చేస్తారని, అలాంటప్పుడు ‘మా’ అధ్యక్షుడు ఏకగ్రీవమైతే తప్పేంటని అన్నారు.

10. డిస్కస్‌ త్రోలో విఫలమైన కమల్‌ప్రీత్‌కౌర్‌

ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన డిస్కస్‌ త్రో అథ్లెట్‌ కమల్‌ప్రీత్‌ కౌర్‌ ఫైనల్స్‌లో విఫలమైంది. మొత్తం 12 మంది పోటీపడిన ఈ పోటీల్లో ఆమె ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కమల్‌ప్రీత్‌ శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో 64 మీటర్లతో అత్యద్భుత ప్రదర్శన చేసింది.

మయాంక్‌ అగర్వాల్‌ తలకు గాయం.. తొలి టెస్టుకు దూరం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని