
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ - 5 PM
1. ఏపీలో కోరలు చాస్తున్న కరోనా
ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజా వివరాల ప్రకారం ఒక్కరోజు వ్యవధిలో 31,268 నమూనాలను పరీక్షించగా 2,558 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,15,832కి చేరింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
2. హనుమంతుడి జన్మస్థానం తిరుమలే!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల క్షేత్రం ఇకపై హనుమంతుని జన్మస్థానంగానూ గుర్తింపు పొందనుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ విషయాన్ని పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు తితిదే సిద్ధమైంది. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గురువారం ఈ విషయంపై నిపుణుల కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కమిటీలోని పండితులు జ్యోతిష శాస్త్రం, శాసనాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాలతో ఉగాది రోజున ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తారన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
3. బెంగాల్.. గుజరాత్‌లా మారాలా?
పశ్చిమబెంగాల్ నాలుగో విడత ఎన్నికల ప్రచారంలో సీఎం మమతా బెనర్జీ దూసుకెళ్తున్నారు. భాజపాపై పదునైన విమర్శలతో ప్రచారంలో దూకుడు పెంచారు. గురువారం హూగ్లీ జిల్లా బాలాగఢ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దీదీ.. భాజపా, కేంద్ర బలగాలపై మరోసారి విమర్శలు గుప్పించారు. పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు భాజపా, కేంద్ర బలగాల భయాలకు ఓటర్లు తలొగ్గొద్దని విజ్ఞప్తి చేశారు. భాజపా పాలనలో యావత్ దేశం కన్నీరు పెడుతోందని ఆరోపించారు. భాజపా గూండాయిజానికి పాల్పడుతోందని మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
4. ‘పరీక్షలు రద్దు’పై CBSE ఏమందంటే..
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో సీబీఎస్ఈ 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన సీబీఎస్ఈ.. విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా మే నెలలో జరగబోయే బోర్డు పరీక్షలు రద్దు చేయాలని, లేదా వాటిని ఆన్లైన్లో నిర్వహించాలని సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు దాదాపు లక్షమందికి పైగా విద్యార్థులు ఆన్లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
5. అంబానీ సోదరులకు రూ.25 కోట్ల జరిమానా
ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, మరికొందరు వ్యక్తులు, సంస్థలపై మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ రూ.25 కోట్ల అపరాధ రుసుము విధించింది. 2000 సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలను పాటించని కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. ముకేశ్ భార్య నీతా, అనిల్ భార్య టీనాలపైనా అపరాధ రుసుము విధించారు. ఆర్ఐఎల్ ప్రమోటర్లు, పర్సన్స్ యాక్టింగ్ ఇన్ కాన్సర్ట్(పీఏసీ)లు 2000 సంవత్సరంలో సంస్థలో 5 శాతం వాటా కంటే ఎక్కువ కొనుగోలు అంశాన్ని బయటకు వెల్లడించడంలో విఫలమయ్యారని సెబీ తన 85 పేజీల ఆదేశంలో పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
6. ఇప్పుడు వెళ్తేనే మంచిది: సొంతూళ్లకు కూలీలు
కరోనా మహమ్మారి వివిధ రాష్ట్రాలను వణికిస్తోంది. చాప కింద నీరులా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో పొట్ట చేతపట్టుకుని కూలి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారి పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పూర్తి లాక్డౌన్ విధిస్తారన్న భయాలతో సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు వలస కూలీలు. ఇప్పటికే పలువురు తిరిగి స్వరాష్ట్రాలకు పయనమవుతున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
7. 6 సినిమాల తర్వాత అదే నెలలో.. పవన్ చిత్రం
ఇంటర్నెట్‌డెస్క్: ఆకలి తీర్చుకునేందుకు సింహం అడవిలోని జంతువులను ఎలా వేటాడుతుందో అదే మాదిరిగా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టడానికి సిద్ధమవుతున్నారు అగ్రకథానాయకుడు పవన్‌కల్యాణ్. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆయన వెండితెర వేదికగా ప్రేక్షకుల్ని మెప్పించడానికి ‘వకీల్‌సాబ్’గా వచ్చేస్తున్నారు. కథలో కమర్షియల్ హంగులు లేనప్పటికీ ఆయన స్టార్డమ్కు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ‘వకీల్‌సాబ్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’ విశేషాలు మీకోసం.. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
8. ‘వాజే’కీయ ప్రకంపనలు
అంబానీకి బెదిరింపులు- మన్సుఖ్ హిరేన్ హత్య కేసు చినికి చినికి గాలివానగా మారుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ కేసును విచారించే కొద్దీ దిగ్ర్భాంతి గొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇవి మహారాష్ట్ర పోలీసుశాఖకు అప్రతిష్ఠ తేవడంతో పాటు, రాజకీయంగా కూడా సర్కారును ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కేసు కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వరకూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సచిన్ వాజే న్యాయస్థానానికి ఓ లేఖ ఇవ్వబోవడం.. ఆ లేఖలో మరికొందరు రాజకీయ ప్రముఖుల పేర్లను కీలకంగా ప్రస్తావించడంతో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
9. దేశ్‌ముఖ్‌పై సీబీఐ దర్యాప్తు.. అవసరమే
మహారాష్ట్రలో రూ.100కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు వ్యవహారంలో మహారాష్ట్ర సర్కారు, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ దేశ్‌ముఖ్, ప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినందున వాటిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమేనని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
10. ఆయన తన కొడుకులా చూసుకుంటాడు: సిరాజ్
టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తనను సొంత కొడుకులా చూసుకుంటాడని ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. బెంగళూరు టీమ్ గురువారం విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడిన సిరాజ్ తన కెరీర్ గురించి అనేక అంశాలు పంచుకున్నాడు. టీమ్ ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీయడమే తన కోరికని చెప్పాడు. ‘టీమ్ ఇండియాకు నేను బౌలింగ్ చేసినప్పుడల్లా జస్ప్రీత్ బుమ్రా నా పక్కనే ఉండేవాడు. ప్రాథమిక అంశాలకు లోబడి బౌలింగ్ చేయమని, అనవసర విషయాలపై దృష్టి పెట్టొద్దని చెప్పాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి