close

ప్రధానాంశాలు

ఫిట్‌నెస్‌ మంత్రగాళ్లు..!

ఐపీఎల్‌లో శారీరక దారుఢ్యంపై దృష్టిపెట్టిన క్రికెటర్లు

ప్రతి ఆటగాడికి ప్రాథమిక అవసరం శారీరక దారుఢ్యం. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ లేకుంటే మ్యాచ్‌లో వంద శాతం ప్రదర్శన చేయడం అసాధ్యం. ఒక క్రీడాకారుడు మానసికంగా ఉత్తేజితుడు అవ్వడానికి.. ఆట పట్ల అంకితభావం చూపించడానికి ఇది ఎంతగానో తోడ్పాటునిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ. ఆట పట్ల తనకున్న నిబద్ధతకు కారణం శారీరక దృఢత్వమేనని అతడు చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. అలా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ ఐపీఎల్‌ 12లో అద్భుతంగా రాణిస్తున్న క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం..

ఏడాది దూరమైనా‌..

బాల్‌టాంపరింగ్‌లో అడ్డంగా దొరికిపోయాడు. క్రికెట్‌ ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డాడు. ఏకంగా ఏడాది కాలం ఆటకే దూరమయ్యాడు. చీదరింపులు, అవమానాలు, అసహనానికి గురైన సంఘటనలు ఎన్నో..! కానీ ఇవన్నీ అతని జోరుకు తాత్కాలిక విరామాలే. మైదానంలోకి అడుగుపెట్టడమే ఆలస్యం ఒక్కసారిగా బౌలర్లపై విరుచుకపడ్డాడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. నిషేధానికి గురైనా అతను ఫిట్‌నెస్‌ విషయంలో నిర్లక్ష్యం వహించలేదు. దానికే తొలి ప్రాధాన్యమిస్తూ బరువును నియంత్రణలో ఉంచుకున్నాడు. నిరంతరం ఆటను సాధన చేశాడు. మధ్యలో గాయాలైనా కసరత్తులు కొనసాగించాడు. ఈ ఐపీఎల్‌లో అడుగుపెట్టాక తొలి మ్యాచ్‌లోనే వార్నర్‌ (85; 53బంతుల్లో 9×4, 3×6) అర్ధశతకంతో అలరించాడు. దాంతోనే ప్రమాద ఘంటికలు మోగించాడు. అప్పుడు మొదలైన పరుగుల వరద చివరి మ్యాచ్‌ వరకూ కొనసాగింది. అతడి ఆటను చూసినవారెవరికీ బాల్‌ ట్యాంపరింగ్‌ గుర్తుకు రానేలేదు. 

37 అయితేనేం..

అతడి కెరీర్‌ దాదాపు చరమాంకానికి వచ్చేసిందని ఎంతో మంది విమర్శించారు. దురదృష్టవశాత్తు వరుస మ్యాచ్‌ల్లో వైఫల్యాలు వెంటాడాయి. తన మునుపటి శైలిలో భారీ షాట్లు కొట్టడానికీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ విమర్శకుల నోళ్లు మూయించేలా ధనాధన్‌ ఇన్నింగ్‌లు ఆడుతున్నాడు మహేంద్రసింగ్‌ ధోనీ. తన స్ఫూర్తిదాయక సారథ్యంతో ఈ ఐపీఎల్‌లో మళ్లీ మ్యాచ్‌లను ముగిస్తూ మిస్టర్‌ ఫినిషర్‌ పేరును సార్థకం చేస్తున్నాడు. ఆటకు వయసుతో సంబంధం లేదు ఫిట్‌గా ఉంటే చాలంటున్నాడు మహీ. మైదానంలో వికెట్ల వెనుక.. వికెట్ల మధ్యన చిరుతలా కదలడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఏమాత్రం అలిసిపోకుండా ఉండేందుకు కారణం ఫిట్‌నెస్‌ విషయంలో అతను తీసుకునే జాగ్రత్తలే. అలాగని జిమ్‌లో గంటలు తరబడి శ్రమించడు ధోనీ. టీమిండియాలోని మిగతా ఆటగాళ్లతో పోలిస్తే తన కసరత్తులు సాధారణంగా ఉంటాయి. పవర్‌ లిఫ్టింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడు. బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు మిస్టర్‌ కూల్‌. దాని వల్ల కంటిచూపు, ఫుట్‌ వర్క్‌ పెరుగుతాయట. ఒకేరోజు శరీరాన్ని కష్టపెట్టకుండా పనిని రోజుల వారీగా విభజించుకొని విభిన్న కసరత్తులు చేస్తుంటాడు. ఆ జోరుతో ఈ సారి మెరుపు ఇన్నింగ్‌లతో అదరగొట్టేస్తున్నాడు. ముఖ్యంగా ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ధోనీ (84; 48బంతుల్లో 5×4, 7×6) ఇన్నింగ్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

కేరాఫ్‌ అడ్రస్‌ కోహ్లీ..

పరుగుల యంత్రం. ఛేదన రారాజు. అలసట అనే పదానికి అర్థం తెలియని తత్వం. దూకుడుకు పర్యాయపదం. ఇలా చెప్పుకుంటే పోతే భారత సారథి విరాట్‌ కోహ్లీని పొగిడేందుకు ప్రశంసలు చాలవు. ఆట పట్ల ఎంతో అంకితభావం చూపించే చికూ శారీరక దారుఢ్యంపై అంతకుమించి నిబద్ధత ప్రదర్శిస్తాడు. జిమ్‌లో నిత్యం బరువులు ఎత్తుతూ శరీర పైభాగాన్ని బలంగా ఉంచడానికి అధిక ప్రాధాన్యతనిస్తాడు. చేతుల్లో, మణికట్టు బలం పెంచేందుకు కసరత్తులు చేస్తాడు. పవర్‌లిఫ్టింగ్‌ను ఇష్టపడతాడు. ఆహారం తీసుకోవడంలోనూ కఠినంగానే ఉంటాడు. ఫిట్‌నెస్‌ విషయంలో తాను పెట్టుకున్న నిబంధనలే క్రికెట్‌లో తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయని అంటాడు. ఫిట్‌గా ఉంటే మన లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలమని కోహ్లీ భావిస్తాడు. ఈ ఐపీఎల్‌లో జట్టుగా ఆర్‌సీబీ అభిమానుల్ని నిరాశపరిచినా కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై శతకంతో అలరించాడు విరాట్‌. 

రన్నింగ్‌ రాహుల్‌..

ఐపీఎల్‌లో స్టైలిష్‌ క్రికెటర్ల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు కేఎల్‌ రాహుల్‌. సొగసరి షాట్లతో భారీ సిక్సర్లను సైతం అలవోకగా బాదడంలో గొప్ప నేర్పరి. జాతీయ జట్టుకు ఎంపికైనా బ్యాకప్‌ ఓపెనర్‌గా అవకాశాలు రాలేదు. కొన్నింట్లో విఫలమయ్యాడు. అవకాశం రావడం లేదని అసంతృప్తితో ఉన్నా ఆటపై ఎక్కడా నిబద్ధత కోల్పోలేదు. తనని తాను నిత్యం ఫిట్‌గా ఉంచుకుంటూ గతేడాది ఐపీఎల్‌లో అదరగొట్టేశాడు. తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కినా నిలకడలేమితో చోటు కోల్పోయాడు. దీనికితోడు ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యల కారణంగా బీసీసీఐ కఠిన చర్యలే తీసుకుంది. ఈ కఠిన సమయంలోనే తనకు క్రికెట్‌ కన్నా ఏదీ ముఖ్యం కాదని బలంగా గుర్తించాడు. మానసికంగా దృఢంగా ఉండటానికి ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఎక్కువగా పరిగెత్తడానికే ఇష్టపడతానని రాహుల్‌ పేర్కొన్నాడు. అన్నట్టు కోడికూర, పాలకు సంబంధించిన ఆహారానికి రాహుల్‌ ఆమడ దూరం. 

పవర్‌ఫుల్‌ పాండ్య..

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఆరో స్థానంలో దిగుతాడు. ధనాధన్‌ షాట్లతో ఓడిపోయే మ్యాచ్‌ను సులభంగా గెలిపించేస్తాడు. సహచర బ్యాట్స్‌మెన్‌ షాట్లు కొట్టడానికి ఇబ్బంది పడుతుంటే తాను మాత్రం భారీ సిక్సర్లతో అలరిస్తాడు. చూడటానికి సన్నగా ఉన్నా బంతిని బలంగా కొట్టడంలో అతనిదో ప్రత్యేకత. అతనే ముంబయి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండే పాండ్య గతేడాది ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తూ పడిపోయాడు. వెన్నునొప్పితో దాదాపు జాతీయ జట్టుకు కొంతకాలం దూరమయ్యాడు. తిరిగి ఫిట్‌నెస్‌ సాధించడానికి మాత్రం పాండ్య తీవ్రంగా శ్రమించాడు. ఈ విషయంలో తనకెప్పుడూ కోహ్లీనే ఆదర్శమనే అంటాడు. ఆర్ధిక కారణాల రీత్యా చిన్నతనంలో కేవలం మ్యాగీతోనే కాలం గడిపిన అతడు ఇప్పుడు నిక్కచ్చిగా డైట్‌ పాటిస్తున్నాడు. తాను ఎదుర్కొన్న కష్టాలే తనను గొప్ప క్రికెటర్‌ చేశాయని పాండ్య అంటుంటాడు. సహచర క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌లాగా పాండ్య కూడా ఎక్కువగా పరిగెత్తడానికే ఇష్టపడతాడు. వార్మప్‌ సెషన్‌లో అదొక భాగంగా పరిగణిస్తాడు. 
వీరితో పాటు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బౌలర్‌ మహ్మాద్‌ షమి కూడా గతేడాది తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. ఒకానొక దశలో ఫామ్‌ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. కానీ ఆ సమయంలో మానసికంగా కుదురుకోవడానికి ఫిట్‌నెస్‌పైనే షమి ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. బరువు తగ్గడం, శారీరకంగా దృఢంగా మారడం వల్లే అతను కొన్ని నెలలుగా గాయపడకుండా ఆడుతున్నాడు. గాయాలకు దూరంగా ఉండటంతోనే అతను మెరుగ్గా రాణిస్తున్నాడని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఫిజియో బ్రెట్‌ హరోప్‌ అన్నాడు.మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net