కథనాలు

Published : 10/04/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆఖరి ఐదు..ధోనీ సేనదే జోరు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 14 సీజన్‌‌ ఆరంభమైంది. ‘ధనాధన్‌’ ధోనీ నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, టీమిండియా యువకెరటం, ‘పవర్‌ హిట్టర్‌’ రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌గా  ఉన్న దిల్లీ క్యాపిటల్స్‌.. మధ్య రెండో లీగ్‌ మ్యాచ్‌ శనివారం జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచుల్లో ఏ జట్టు పైచేయి సాధించిందో  చూద్దామా!

 


దంచికొట్టిన ధావన్‌ 

ఈ రెండు జట్లు చివరగా షార్జా వేదికగా 2020 సీజన్‌లో 34వ లీగ్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి. డుప్లెసిస్‌ 58, షేన్ వాట్సన్‌ 36, అంబటి రాయుడు 45 పరుగులతో రాణించడంతో మొదట చెన్నై 179/4తో నిలిచింది. లక్ష్యఛేదనకు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. పృథ్వీ షా మొదటి ఓవర్‌లో రెండో బంతికే బౌలర్‌ దీపక్‌ చాహర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అజింక్యా రహానే (8)కూడా త్వరగా ఔటయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన శిఖర్‌ ధావన్‌ (101*; 58 బంతుల్లో 14×4, 1×6) దంచి కొట్టి దిల్లీకి విజయం అందించాడు.

 

ఆల్‌రౌండ్‌ షోతో దిల్లీ అదుర్స్‌

గతేడాది దుబాయ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు సమష్టిగా రాణించడంతో విక్టరీ సాధించింది.  పృథ్వీ షా 64, ధావన్‌ 35, రిషభ్‌ పంత్ 37 పరుగులతో రాణించడంతో మొదట దిల్లీ క్యాపిటల్స్‌ 175 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లో డుప్లెసిస్‌ 43 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగిలిన అందరూ విఫలమయ్యారు. కేదార్ జాదవ్‌ (26) కాసేపు పోరాడాడు. చెన్నై జట్టులో కీలకమైన డుప్లెసిస్‌, ధోనీ, రవీంద్ర జడేజాలను రబాడ పెవిలియన్‌కు పంపి దిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.


వాట్సన్‌ సిక్స్‌లు..డుప్లెసిస్‌ ఫోర్లు

2020లో చెన్నైపై దిల్లీ క్యాపిటల్స్‌ పూర్తి అధిపత్యం ప్రదరిస్తే.. 2019లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పైచేయి సాధించింది. 2019 సీజన్‌ క్వాలిఫయర్‌-2లో ఇరు జట్లు తలపడ్డాయి. రిషభ్‌ పంత్ 38, మున్రో 27 మినహా దిల్లీ బ్యాట్స్‌మెన్‌ పెద్దగా పరుగులేమీ చేయకపోవడంతో 147 పరుగులతో గౌరవప్రదమైన స్కోరును చేసింది. లక్ష్యఛేదనకు దిగిన చెన్నై ఓపెనర్లు.. డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. డుప్లెసిస్‌ 7 ఫోర్లు, వాట్సన్‌ 4 సిక్స్‌లు బాదాడు. వీరిద్దరూ అర్ధశతకాలు చేసి ఔటయ్యారు. చివర్లో రాయుడు (20) చెన్నైని గెలిపించాడు.


ధోనీ, రైనా మెరుపులు.. తాహిర్‌ బ్రేకులు

చెపాక్‌ స్టేడియం వేదికగా 2019లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. సురేశ్‌ రైనా (59; 37 బంతుల్లో 8×4, 6×1) మెరుపులు మెరిపించగా.. కెప్టెన్‌ ధోనీ (44; 22 బంతుల్లో 4×4, 6×3) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. 180 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌  బ్యాట్స్‌మెన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(44), శిఖర్‌ ధావన్‌(19) మినహా ఎవరూ రెండంకెల స్కోరును చేయలేకపోయారు. దిల్లీ జట్టు 16.2 ఓవర్లకు 99 పరుగులు చేసి ఆలౌటైంది. ఇమ్రాన్‌ తాహిర్‌ 4 వికెట్లు, రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టి దిల్లీ పతనాన్ని శాసించారు.


వాట్సన్‌ వండర్‌.. రైనా రైజింగ్‌

2019లో ఫిరోజ్ షా‌ కోట్ల (ప్రస్తుతం అరుణ్‌ జైట్లీ పేరుగా మార్పు) మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్(51) అర్ధశతకంతో రాణించగా.. రిషభ్‌ పంత్ 25, పృథ్వీ షా 24 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌..షేన్‌ వాట్సన్‌ (44; 26 బంతుల్లో 4×4, 3×6), సురేశ్ రైనా (30; 16 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఆఖర్లో జట్టును ధోనీ  విజయ తీరాలకు చేర్చాడు.


 

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net