ప్రధానాంశాలు

Published : 29/04/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక్కడే ఓడించాడు

ఆల్‌రౌండ్‌ సత్తాచాటిన జడేజా
చెన్నై సూపర్‌ కింగ్స్‌ గెలుపు
బెంగళూరుకు తొలి ఓటమి
ముంబయి

బ్యాటింగ్‌లో జడేజానే.. బౌలింగ్‌లోనూ అతనే! అరె.. ఫీల్డింగ్‌లో కూడా అతనే.. ఇలా ఎక్కడ చూసినా జడ్డూనే. నిఖార్సైన ఆల్‌రౌండర్‌కు నిర్వచనంలా.. అసలైన క్రికెటర్‌కు పర్యాయపదంలా అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన అతను.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఐపీఎల్‌-14లో అజేయంగా సాగుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి ఓటమి రుచి చూపించాడు. అవును.. తన విశ్వరూపంతో అతనొక్కడే ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. మొదట సంచలన బ్యాటింగ్‌తో జట్టుకు అనూహ్యమైన స్కోరు అందించి.. ఆనక బౌలింగ్‌లో కీలక వికెట్లు తీసి.. ఆపై ఫీల్డింగ్‌లో మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు జడ్డూ. వరుసగా నాలుగో విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్సీబీకి టోర్నీలో ఇదే తొలి పరాజయం.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జైత్రయాత్రకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ చెక్‌ పెట్టింది. ఆదివారం మధ్యాహ్న పోరులో ఆ జట్టుపై సీఎస్కే 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌ రెండు జట్ల మధ్యనే అయినప్పటికీ.. అది పూర్తిగా ‘‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’’ జడేజా (62 నాటౌట్‌; 28 బంతుల్లో 4×4, 5×6; 3/13), ఆర్సీబీ పోరుగా మారిపోయింది.  మొదట సీఎస్కే 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (50; 41 బంతుల్లో 5×4, 1×6) సాధికారికంగా ఆడగా.. జడేజా సంచలన బ్యాటింగ్‌తో చెలరేగాడు. హర్షల్‌ పటేల్‌ (3/51) చక్కగా బౌలింగ్‌ చేసినా.. ఆఖర్లో తన జట్టును నిరాశపరిచాడు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 9 వికెట్లకు 122 పరుగులకే పరిమితమైంది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (34; 15 బంతుల్లో 4×4, 2×6) టాప్‌స్కోరర్‌. జడేజాతో పాటు ఇమ్రాన్‌ తాహిర్‌ (2/16) కూడా బంతితో రాణించాడు.
బంతితోనూ అతడే..: భారీ లక్ష్య ఛేదనలో మెరుపు ఆరంభాన్ని ఆర్సీబీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. బ్యాట్‌తో నష్టం చేసిన జడేజా.. బంతితోనూ ఆ జట్టును దెబ్బకొట్టాడు. గత మ్యాచ్‌ సెంచరీ హీరో పడిక్కల్‌ మొదటి నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడడంతో 3 ఓవర్లకే జట్టు స్కోరు 44. కానీ వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్‌ చేర్చిన సీఎస్కే ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట కోహ్లీ (8)ని ఓ స్లో డెలివరీతో కరన్‌ బోల్తా కొట్టించగా.. ఆ తర్వాతి ఓవర్లో షార్ట్‌పిచ్‌ బంతితో పడిక్కల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు శార్దూల్‌ ముగింపు పలికాడు. ఆ తర్వాత జడేజా మాయ మొదలైంది. ఆశ్చర్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్‌ (7)తో పాటు కీలక ఆటగాళ్లు మ్యాక్స్‌వెల్‌ (22), డివిలియర్స్‌ (4)ను అతనే ఔట్‌ చేశాడు. వరుస ఓవర్లలో మ్యాక్సీ, డివిలియర్స్‌ను బౌల్డ్‌ చేసిన అతను.. మధ్యలో స్టంప్స్‌కు నేరుగా త్రో విసిరి క్రిస్టియన్‌ (1)ను రనౌట్‌ చేశాడు. దీంతో 11 ఓవర్లకు 83/6తో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది. మరో స్పిన్నర్‌ తాహిర్‌  లోయర్‌ఆర్డర్‌ పనిపట్టాడు. బౌలింగ్‌లో రాణించడమే కాకుండా ఓ అద్భుతమైన త్రోతో అతను.. జేమీసన్‌ (16)ను రనౌట్‌ చేయడం విశేషం. ఆలౌట్‌ కాకూడదనే లక్ష్యంతో చాహల్‌ (8 నాటౌట్‌), సిరాజ్‌ (12 నాటౌట్‌) చివరివరకూ బ్యాటింగ్‌ చేశారు.
ఆరంభం అదిరె..: సీఎస్కేకు అదిరే ఆరంభం.. మెరుపు ముగింపు లభించింది. ఓపెనర్లు రుతురాజ్‌ (33; 25 బంతుల్లో 4×4, 1×6), డుప్లెసిస్‌ తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. గత మ్యాచ్‌ (కేకేఆర్‌తో)లో ఫామ్‌ అందుకున్న ఈ ఇద్దరూ.. ఆర్సీబీతో పోరులోనూ జోరు కొనసాగించారు. అయితే పదో ఓవర్‌ తొలి బంతికి రుతురాజ్‌ను ఔట్‌ చేసిన చాహల్‌  (1/24) ఆర్సీబీకి తొలి వికెట్‌ అందించాడు. వస్తూనే రైనా (24) భారీ షాట్లు ఆడడంతో పాటు డుప్లెసిస్‌ కూడా అర్ధసెంచరీ అందుకోవడంతో జట్టు 13 ఓవర్లలో 110/1తో భారీ స్కోరు దిశగా సాగేలా కనిపించింది. కానీ ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న హర్షల్‌ వరుస బంతుల్లో వాళ్లిద్దరినీ పెవిలియన్‌ చేర్చి బెంగళూరును తిరిగి పోటీలోకి తెచ్చాడు. అంబటి రాయుడు (14)తో కలిసి జడేజా ఇన్నింగ్స్‌ వేగం తగ్గకుండా చూడడంతో 16 ఓవర్లకు జట్టు 134/3తో నిలిచింది. కానీ ఆ తర్వాతి మూడు ఓవర్లలో గొప్పగా బంతులేసిన ఆర్సీబీ పేసర్లు ఒక్క బౌండరీ సహా 20 పరుగులు మాత్రమే ఇచ్చి.. రాయుణ్ని ఔట్‌ చేశారు. కానీ ప్రత్యర్థిని కట్టడి చేసినట్లేనని భావించిన బెంగళూరుకు జడేజా.. విధ్వంసంతో పెద్ద షాకిచ్చాడు. హర్షల్‌ వేసిన చివరి ఓవర్లో విశ్వరూపం  ప్రదర్శించాడు. ఏకంగా అయిదు సిక్సర్లు, ఓ ఫోర్‌ కొట్డాడు. ఓ నోబాల్‌ కూడా వేసిన హర్షల్‌ మొత్తంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో చెన్నై స్కోరు 190 దాటింది. అదే క్రమంలో జడేజా 25 బంతుల్లోనే అర్ధశతకం చేరుకున్నాడు. ధోని (2 నాటౌట్‌)తో కలిసి అతడు అయిదో వికెట్‌కు అజేయంగా 49 పరుగులు జోడించాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) జేమీసన్‌ (బి) చాహల్‌ 33; డుప్లెసిస్‌ (సి) క్రిస్టియన్‌ (బి) హర్షల్‌ 50; రైనా (సి) పడిక్కల్‌ (బి) హర్షల్‌ 24; అంబటి రాయుడు (సి) జేమీసన్‌ (బి) హర్షల్‌ 14; జడేజా నాటౌట్‌ 62; ధోని నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 4  వికెట్లకు) 191; వికెట్ల పతనం: 1-74, 2-111, 3-111, 4-142; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-32-0; జేమీసన్‌ 3-0-31-0; చాహల్‌ 3-0-24-1; సైని 2-0-27-0; హర్షల్‌ 4-0-51-3; క్రిస్టియన్‌ 2-0-12-0; సుందర్‌ 2-0-13-0
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) ధోని (బి) కరన్‌ 8; పడిక్కల్‌ (సి) రైనా (బి) శార్దూల్‌ 34; సుందర్‌ (సి) రుతురాజ్‌ (బి) జడేజా 7; మ్యాక్స్‌వెల్‌ (బి) జడేజా 22; డివిలియర్స్‌ (బి) జడేజా 4; క్రిస్టియన్‌ రనౌట్‌ 1; జేమీసన్‌ రనౌట్‌ 16; హర్షల్‌ (బి) తాహిర్‌ 0; సైని (సి) రైనా (బి) తాహిర్‌ 2; చాహల్‌ నాటౌట్‌ 8; సిరాజ్‌ నాటౌట్‌ 12;  ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 122; వికెట్ల పతనం: 1-44, 2-54, 3-65, 4-79, 5-81, 6-83, 7-89, 8-94, 9-103; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 2-0-25-0; కరన్‌ 4-0-35-1; శార్దూల్‌ 4-0-11-1; జడేజా  4-1-13-3; తాహిర్‌ 4-0-16-2; బ్రావో 2-0-19-0

‘‘జడేజా సత్తా ఏమిటో అందరికీ తెలుసు. బ్యాట్‌, బంతితో పాటు ఫీల్డింగ్‌లోనూ అతను రాణించినందుకు సంతోషంగా ఉంది. రెండు నెలల తర్వాత అతను తిరిగి భారత్‌కు ఆడతాడు. జట్టు అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ ఇలా బ్యాట్‌తో చెలరేగితే చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది. అతను ఉత్తమ ప్రదర్శన చేస్తే జట్టుకు ఎన్నో అవకాశాలుంటాయి. హర్షల్‌ బాగానే బౌలింగ్‌ చేశాడు. అతనికి మేం మద్దతుగా నిలుస్తూనే ఉంటాం. లీగ్‌ తొలి దశలోనే ఇలాంటి ఓటమి ఎదురవడం మంచిదే. ఒక్క ఆటగాడు మమ్మల్ని ఓడించాడు’’

- కోహ్లి

సూపర్‌ జడ్డూ..
గేల్‌ రికార్డు సమం
ఒకే ఓవర్లో 37

19 ఓవర్లకు సీఎస్కే స్కోరు 154/4. అప్పటివరకూ (3 ఓవర్లలో  3/14) గొప్పగా బంతులేసిన హర్షల్‌ చివరి ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. అప్పటిదాకా చెన్నై బ్యాటింగ్‌ చూస్తే.. ఆఖరి ఓవర్లోనూ ఆ జట్టుకు ఎక్కువ పరుగులేమీ రావనిపించింది. కానీ సూపర్‌ బ్యాటింగ్‌తో జడేజా కథ మొత్తం మార్చేశాడు. వీర బాదుడుతో సంచలనం సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ ఓవర్లో అయిదు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదాడు. డీప్‌ మిడ్‌వికెట్‌, లాంగాన్‌ మీదుగా బంతులను స్టాండ్స్‌లో పడేశాడు. 6, 6, 6 (నోబాల్‌), 6, 2, 6, 4.. ఇదీ 20వ ఓవర్లో జడ్డూ ఊచకోత. ఈ సీజన్‌లో గొప్పగా రాణిస్తూ.. వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న హర్షల్‌ను అసలే మాత్రం లెక్క చేయకుండా అతను సాగించిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి బంతినీ స్టాండ్స్‌లో పడేయాలన్న కసితో.. పూర్తి నియంత్రణతో వీరబాదాడు. నిజానికి జడేజా ఖాతా తెరవకుండానే ఔటవాల్సింది. సుందర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ అయిదో బంతికి అతనిచ్చిన సులువైన క్యాచ్‌ను డీప్‌ మిడ్‌వికెట్లో క్రిస్టియన్‌ వదిలేశాడు. దీంతో ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. చివరి ఓవర్లో 36 (నోబాల్‌ కలిపితే 37) పరుగులు పిండేసిన జడ్డూ.. ఐపీఎల్‌లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌తో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. 2011లో అప్పటి కొచ్చి టస్కర్స్‌ కేరళతో మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున గేల్‌ ఒకే ఓవర్లో (6, 6+నోబాల్‌, 4, 4, 6, 6, 4) 36 పరుగులు (నోబాల్‌ కలిపితే 37) రాబట్టాడు. గేల్‌ బాధితుడు పరమేశ్వరన్‌. మొత్తంగా టీ20ల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగుల చేసిన ఘనత స్కాట్‌ స్టైరిస్‌ది. 2012లో కౌంటీ క్రికెట్లో ససెక్స్‌ తరపున అతను ఒకే ఓవర్లో (6+నోబాల్‌, 6+నోబాల్‌, 6, 6, 4, 0, 4, 6) 38 పరుగులు సాధించాడు.

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net