ప్రధానాంశాలు

Published : 10/04/2021 08:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు

మందకొడి పిచ్‌పై విజయం తేలికేం కాదన్న ఏబీడీ

చెన్నై: గతేడాదీ ఆరంభ పోరులో విజయం సాధించామని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. దిల్లీ నుంచి బదిలీ చేసుకున్న హర్షల్‌ పటేల్‌ తమ డెత్‌ బౌలర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేశాడు. తొలి మ్యాచులో గెలిస్తే బాగుండేదని ముంబయి ఇండియన్స్‌ నాయకుడు రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. తాము కనీసం 20 పరుగులు తక్కువ చేశామన్నాడు. పిచ్‌ అంత అనువుగా లేదని ఏబీ డివిలియర్స్‌ తెలిపాడు. ఐపీఎల్‌ 2021 ఆరంభ పోరులో ముంబయి నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 2 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి ఛేదించిన సంగతి తెలిసిందే.


(Pics: RCB Twitter)

హర్షల్‌ మా డెత్‌ బౌలర్‌: కోహ్లీ

రోహిత్‌ ఔటయ్యాక ముంబయి పుంజుకుంది. మా డెత్‌ ఓవర్లలో ఈ ఆఖరి 6 ఓవర్లే అత్యుత్తమం. హర్షల్ పటేల్‌ స్పష్టమైన ప్రణాళికతో తన బాధ్యతను నిర్వర్తించాడు. మ్యాచులో భిన్నంగా కనిపించాడు. అతడు మా డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా కొనసాగుతాడు. సారథిగా ఆటగాళ్లంతా తమ పాత్రలపై స్పష్టతతో ఉండాలని కోరుకుంటాను. జేమీసన్‌, యూజీ, సిరాజ్‌ చక్కగా బౌలింగ్‌ చేశారు. మాక్సీని నాలుగో స్థానంలో దించాం. 10-15 బంతుల్లోనే అతడి ప్రభావాన్ని మీరు చూశారు. ఏబీ ఆటను చూశాక ప్రత్యర్థి జట్టు కంగారు పడింది. అతడు మా జట్టులోనే అత్యంత  వైవిధ్యమైన బ్యాటర్‌. చాలామంది ఇబ్బంది పడే స్లో పిచ్‌పై అతడు గొప్పగా ఆడాడు. పిచ్‌ సంక్లిష్టంగా అనిపించింది. రెండో అర్ధభాగంలో పాత బంతితో లెంగ్తులు దొరకబుచ్చుకోవడం కష్టమైంది. మేం సమష్టిగా ఆడాం.


ఆ వ్యూహం పారలేదు: రోహిత్‌

టోర్నీలో ఆరంభ మ్యాచ్‌ గెలవడం అత్యంత కీలకం. ఆఖరి వరకు శక్తివంచన లేకుండా పోరాడాం. మాకు లభించిన శుభారంభం ప్రకారం చూస్తే మేం కనీసం మరో 20 పరుగులు చేయాల్సింది. కొన్ని తప్పులు చేశాం. అది సహజమే. మార్కో జాన్సన్‌ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్‌ చేయగల ప్రతిభాశాలి. ఏబీ, క్రిస్టియన్ భాగస్వామ్యం విడదీయడం మాకు కీలకం. అందుకే బుమ్రా, బౌల్ట్‌ను ప్రయోగించాం. కానీ ఆ వ్యూహం పనిచేయలేదు. ఏబీ అద్భుతంగా ఆడాడు. కొత్త ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా ఉండటంతో వారి గురించి తెలుసుకోలేకపోయాం. తటస్థ వేదికల్లో ఆడటం ఎవరికైనా సవాలే. ఏదేమైనా మైదానంలో దిగి అభిమానులను సంతోషపెట్టాం. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మంచి జరగాలని కోరుకుందాం.


తేలికేం కాదు: ఏబీ

గొప్పగా క్రికెట్‌ ఆడాం. ఛేదన అంత తేలిక్కాదని తెలుసు. ఎందుకంటే పిచ్‌ కఠినంగా ఉంది. ఆట సాగే కొద్దీ వికెట్‌  గట్టిగా మారుతోంది. అందుకే చివరి వరకు తీసుకెళ్తే గెలిచే అవకాశాలు ఉంటాయని భావించాం. నేను రనౌటైన బంతిని కృనాల్‌ అద్భుతంగా విసిరాడు. మాక్స్‌వెల్‌తో కలిసి ఆడటం బాగుంది. అలాంటి వారితో ఆడి మ్యాచులు గెలిపించడం నాకిష్టం. మాకు డాన్‌ క్రిస్టియన్‌ సైతం ఉన్నాడు. మా జట్టుది మంచి మేళవింపు. ముంబయి ఐదు ట్రోఫీలు ఎందుకు గెలిచిందో అందరికీ తెలుసు. అలాంటి జట్టుతో పోరు సవాలే. మేం బాగా ఆడి తొలి మ్యాచ్‌ గెలిచాం.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net