
తాజా వార్తలు
కరోనా నియంత్రణలో మీడియా పాత్ర కీలకం..
న్యూ దిల్లీ: కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించి, నియంత్రించడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. సోమవారం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆయన లేఖ ద్వారా ప్రశంసించారు. ‘ప్రింట్ మాధ్యమం, పీటీఐ మీడియా స్వేచ్ఛకు రక్షణ కవచం లాంటివి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో మీడియా చురుగ్గా పనిచేసింది. ప్రజాస్వామ్య దేశంలో మీడియా పాత్ర చాలా ముఖ్యం’అని ఆయన కొనియాడారు. కరోనా సమయంలో యుద్ధ సైనికుల్లా పని చేసిన మీడియా వ్యక్తులను ప్రశంసించారు. కరోనా వల్ల ప్రపంచం, దేశం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని నియంత్రించడం ఈ సంవత్సరం జాతీయ పత్రికా దినోత్సవం నేపథ్యమన్నారు. భారత్లో ఇప్పటివరకు88,45,127 కరోనా కేసులు నమోదవగా, 1,30,070 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.