
తాజా వార్తలు
కాంగ్రెస్ ఖాళీ అవుతోంది: డీకే అరుణ
హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని.. ఈ విషయమై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఉత్తమ్‌తోపాటు ఆయన అనుచరులు, సోషల్ మీడియా నిర్వాహకులపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సైదాబాద్ డివిజన్లో నిర్వహించిన రోడ్ షో ఆమె పాల్గొన్నారు. సైదాబాద్ డివిజన్ భాజపా అభ్యర్థి కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
గ్రేటర్లో భాజపా గెలుపు ఖాయమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఫిబ్రవరి వరకు గడువు ఉండగా హడావుడి చేస్తూ నవంబరు, డిసెంబరులో ఎన్నికలు ఎందుకు జరపాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. వరద బాధితులకు న్యాయం చేయకుండా బండి సంజయ్ నకిలీ లెటర్ ప్యాడ్ సృష్టించి ప్రచారం చేశారని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా గెలుపు తథ్యమని.. ప్రజలంతా తమ పార్టీనే కోరుకుంటున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు.