
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1.ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సీఎం జగన్‌కు నివేదిక
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై నియమించిన హైపవర్ కమిటీ తన నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ఘటన తీరు, కారణాలపై కమిటీ విచారణ జరిపింది. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులతో కూడిన నివేదికను హైపవర్ కమిటీ సీఎం జగన్‌కు అందజేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. చైనా బలగాలు వెనక్కి..!
గల్వాన్ ఘర్షణ అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం జరిగిన పరిణామాలతో సరిహద్దు ప్రాంతం నుంచి తొలిసారిగా చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. ఇరుదేశాల కోర్ కమాండర్ స్థాయి అధికారులు జరిపిన చర్చలు పురోగతి సాధించడంతో సరిహద్దు నుంచి చైనా బలగాలు కిలోమీటరు మేర వెనక్కి వెళ్లినట్లు సైనికవర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. 'కోటి' దాటిన కొవిడ్ పరీక్షలు!
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో కొవిడ్ పరీక్షలను పెంచడం అనివార్యమయ్యింది. దీనిలో భాగంగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) దేశంలో నిత్యం దాదాపు రెండున్నర లక్షల శాంపిళ్లను సేకరించి కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తోంది. సోమవారం ఉదయం 11గంటల వరకు దేశంలో 1,00,04,101 శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ‘‘రాజధాని రైతుల త్యాగాలు వృథా కానీయం’’
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు చేసే పోరాటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం తెలిపారు. రాజధాని పోరాటం 200 రోజులు దాటిన సందర్భంగా ఆయన రైతుల గురించి మాట్లాడారు. ‘‘రాజధాని కోసం రైతులు 34 వేల ఎకరాలను త్యాగం చేశారు. రాజధాని మార్పుపై ఏకపక్ష నిర్ణయం రైతులను అవమానించడమే. వారికి జనసేన మద్దతు ఉంటుంది. వారి త్యాగాలను వృథా కానీయం’’అని పవన్ కల్యాణ్ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అచ్చెన్న పిటిషన్‌పై తీర్పు వాయిదా
ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెదేపా శాసనసభ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అచ్చెన్నాయుడు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు ప్రకటనను ఎల్లుండికి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కొవిడ్: ఏపీలో కొత్త కేసులు 1,322
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,322 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 20,019కి చేరింది. ఇందులో 17,365 మంది రాష్ట్రానికి చెందినవారు. 2,235 మంది ఇతర రాష్ట్రాలవారు, 419 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు. ఈ రోజు నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 1,263 మందికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 56 మంది. ఇక ఇతర దేశాల నుంచి వచ్చినవారు ముగ్గురు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. చైనాలో బుబోనిక్ ప్లేగు వ్యాప్తి..!
చైనాలో బుబోనిక్ ప్లేగు మహమ్మారి మరోసారి విజృంభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని కేసులను అక్కడి ఆసుపత్రులు నిర్ధరించాయి. ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లోని బైయన్నూరు ప్రాంతంలో ఇద్దరికి ఈ వ్యాధి సోకింది. వీరిని వేర్వురు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. వీరితో సంబంధాలు ఉన్న 146 మందిని ఐసోలేట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. గ్యాస్ లీకేజీ..నివేదికలో ఏం చెప్పారంటే?
విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీకేజీ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో విచారణ జరిగింది. వార్తా కథనాల ఆధారంగా ఎన్జీటీ కేసును సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై ట్రైబ్యునల్‌కు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ స్టేటస్ రిపోర్ట్ సమర్పించారు. నలుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ... సాయినార్ లైఫ్ సైన్సెస్‌లో హైడ్రోజన్ సల్ఫైడ్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని తేల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. టిడ్కో ఇళ్ల విషయంలో ఆందోళన వద్దు: బొత్స
కృష్ణా జిల్లాలోని విజయవాడలో పలు అభివృద్ధి పనులకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రూ. 10 కోట్లతో సింగ్‌నగర్ డంప్ యార్డులో పార్క్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీవీఆర్ స్కూల్ కాంపౌండ్‌లో రూ. కోటిన్నరతో భవన నిర్మాణం, రూ. 90లక్షలతో లెనిన్ పార్కు అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. టిడ్కో ఇళ్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. మార్కెట్లకు ‘రికవరీ’ జోష్
దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్ 465 పాయింట్లు లాభపడి 36,487 వద్ద, నిఫ్టీ 10,763 పాయింట్లు లాభపడి 156 పాయింట్ల వద్ద నేటి ట్రేడింగ్‌ను ముగించాయి. ఐటీఐ, త్రివేణీ టర్బైన్, గోద్రెజ్ ఆగ్రోవెట్, బీహెచ్ఈఎల్, హింద్ కాపర్ లాభపడగా.. హిమత్సిగ్కా సెడీ, ఓమెక్స్, ఫ్యూచర్ రీటైల్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్, రిలయన్స్ క్యాపిటల్ వంటివి నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు రూ.11.5లక్షల కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి