close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. అరకొర నైపుణ్యమే!

యువతలో సగం కన్నా తక్కువ మందిలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఫార్మసీ వంటి ఉపాధి కల్పన కోర్సులు చదువుతున్న వంద మందిలో దాదాపు సగం (46.12) మంది మాత్రమే ఉద్యోగాలు చేసే ప్రతిభ కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంబీఏలో నైపుణ్యాలు గణనీయంగా పెరగగా, ఇంజినీంగ్‌లో మాత్రం బాగా తగ్గాయి. భారత్‌ నైపుణ్య నివేదిక-2020 ఈ కఠోర వాస్తవాలను బయటపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రహదారులకు ఇన్వ్‌ఐటీ

మౌలిక సదుపాయాల పెట్టుబడుల ట్రస్ట్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌-ఇన్వ్‌ఐటీ) నెలకొల్పేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు అధికారం ఇస్తూ బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ‘ఇన్వ్‌ఐటీ’ విషయమై పలు నిర్ణయాలు తీసుకొంది. చిన్న తరహా పొదుపుదార్ల నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ తరహాలో నిధులు సేకరించడం, దాన్ని వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా పెట్టడం ఈ ట్రస్ట్‌ లక్ష్యం. కాలపరిమితి ముగిసిన తరువాత నగదు రూపంలో తిరిగి సొమ్మును చెల్లిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పెద్దలను వేధిస్తే కటకటాల్లోకే

జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులు, ఇతర పెద్దల బాధ్యతలను విస్మరిస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టింది. వయోభారంతో ఉన్న పెద్దల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించే, వేధించే సంతానం, వారి భాగస్వాములపై చర్యలు తీసుకోవడానికి వీలుకల్పించే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ‘తల్లిదండ్రుల సంక్షేమం- సీనియర్‌ సిటిజన్ల చట్టం-2007కు సవరణలు చేసేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రి థావర్‌చంద్‌ గహలోత్‌ బుధవారం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భాజపా ప్రధాన శత్రువు తెరాస

దిశ ఎన్‌కౌంటర్‌లో పోలీసుల కథనం, నిందితుల చరిత్ర చూస్తే పోలీసుల వివరణపై వ్యక్తిగతంగా అనుమానాలు లేవని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. ఈ ఘటనపై విచారణతో వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. మహిళలపై అత్యాచారాలకు మద్యంతో పాటు అశ్లీలచిత్రాలు (పోర్నోగ్రఫీ) కూడా కారణమన్నారు. ఆయన బుధవారమిక్కడ మాజీ ఎమ్మెల్యే రాములు, సుధాకర్‌శర్మ, ఆకుల విజయలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యపానంపై పార్టీలో జాతీయ స్థాయి విధానమేదీ ప్రస్తుతానికి లేదన్నారు. రాష్ట్రంలో భాజపాకు తెరాస ప్రధాన శత్రువు అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మూసీలోకి గోదావరి జలాలు

హైదరాబాద్‌ నగరంలోని కర్మాగారాలు వదిలే కాలుష్య జలాలతో నురగలు కక్కుతూ ప్రవహించే మూసీ నదిలో గోదావరి జలాలు కలుస్తున్నాయి. ఎస్సారెస్సీ రెండో దశ కాల్వల ద్వారా యాభై రోజులుగా సూర్యాపేట జిల్లాలోని చెరువులను గోదావరి జలాలతో నింపుతున్నారు. అందులో భాగంగా జాజిరెడ్డిగూడెం మండలం ఉయ్యాలవాడ చెరువును నింపారు. మూడు రోజులుగా అలుగు పారుతున్న ఈ చెరువు నీళ్లు పక్కనే ఉన్న మూసీలోకి చేరుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జగన్‌ గన్నేరు పప్పు

సీఎం జగన్‌ గన్నేరు పప్పు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. తెలుగు, ఆంగ్లంలోనూ జగన్‌ తప్పులు పలుకుతున్నారని, గణితంలో బలహీనంగా ఉన్నారన్నారు. దిశ ఘటనకు సంబంధించి ‘ఒక అమ్మాయి టోల్‌ కట్టేందుకు ద్విచక్రవాహనం దిగితే’, గుంటూరు నగరాన్ని గుండూరు అని, 24, 14 కలిపితే 39 అని, నిరక్షరాస్యతను నిరారక్షత అని అన్నారని, ‘ఘటన జరిగినప్పుడే బాధితులను అరెస్టు చేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారని, ‘రాష్ట్రానికి జరిగిన అన్యాయంపైన 42 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒకేసారి’ అంటూ జగన్‌ మాట్లాడారంటూ లోకేశ్‌ వీడియోలను ప్రదర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎక్కడో పుట్టి.. ఎక్స్ఛేంజీ గూటికి

49 లక్షల వినియోగదార్లు..552 బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లు..441 ఏటీఎమ్‌లు..24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ..సేవలు అందిస్తూ కనిపిస్తున్న ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ నేటినుంచి స్టాక్‌ ఎక్స్ఛేంజీలోనూ కనిపించనుంది. జనవరి 2020. ఉజ్జీవన్‌ ఎక్స్ఛేంజీలకు రావడానికి ఆర్‌బీఐ పెట్టిన గడువు తేదీ ఇది. కార్యకలాపాలు మొదలుపెట్టిన మూడేళ్లలో స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో లిస్టవ్వాలని.. లైసెన్సులు జారీ చేసే సమయంలో ఆర్‌బీఐ షరతు పెట్టింది. దాని ప్రకారమే ఐపీఓకు వచ్చింది. మదుపర్ల నుంచి భారీ స్పందన లభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉతికి ఆరేశారు

బ్యాటుతో, బంతితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్‌ బుధవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో 67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. కేఎల్‌ రాహుల్‌ (91; 56 బంతుల్లో 9×4, 4×6), రోహిత్‌ శర్మ (71; 34 బంతుల్లో 6×4, 5×6), విరాట్‌ కోహ్లి (70 నాటౌట్‌; 29 బంతుల్లో 4×4, 7×6) చెలరేగడంతో మొదట భారత్‌ 3 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్‌ 8 వికెట్లకు 173 పరుగులే చేయగలిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వాస్తవానికి తెర రూపం ‘అశ్వథ్థామ’

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్‌ నాయిక. రమణతేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఉషా మల్పూరి నిర్మాత. జనవరి 31న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘‘ఛలో’తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ‘అశ్వద్ధామ’తో ఆ పరంపర కొనసాగిస్తాం. శౌర్య చాలా మంచి కథ రాసుకున్నాడు. దాన్ని దర్శకుడు తెరపై చక్కగా చూపిస్తున్నాడ’’న్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 278 కిలోల ఉల్లి చోరీ

ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా ఉల్లి దొంగతనాలు ఎక్కువయ్యాయి. ముంబయిలోని డోంగ్రి పరిసరాల్లో 278 కిలోల ఉల్లిపాయలను చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వడాల వద్ద నివసిస్తున్న అక్బర్‌ షేక్‌కు డోంగ్రి మార్కెట్‌లో ఉల్లిపాయలు, ఆలుగడ్డల దుకాణం ఉంది. ఇటీవల ఈ దుకాణం నుంచి 224 కిలోల ఉల్లిపాయలున్న రెండు బస్తాలు మాయమయ్యాయి. మరో దుకాణంలో 54 కిలోల ఉల్లి బస్తా చోరీకి గురైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.