close

తాజా వార్తలు

Published : 29/01/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. కమీషన్లు కొట్టేసే దొంగమామ

బడుల నిర్వహణ ఖర్చు పేరిట పిల్లల దగ్గర కమీషన్లు కొట్టేసే దొంగమామలను ఇప్పుడే చూస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘బిడ్డలూ.. అమ్మలూ కాస్త జాగ్రత్త. చివరికి బడిలోనూ రౌడీ వసూళ్లేనా? అమ్మలను బెదిరించి రూ.వెయ్యి వసూళ్లు చేయడం ఏమిటి? ఇవ్వకపోతే మొత్తం రూ.15వేలు ఆపేస్తాం అని బెదిరిస్తారా? వసూలు చేసే రూ.వెయ్యి మొత్తానికి రశీదు ఇవ్వడం లేదు. లెక్కాపత్రం లేదంటే అవి చేరేది వైకాపా నేతల జేబుల్లోకేనని జనమే అంటున్నారు...’ అని ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ముందే వచ్చిన వేసవి!

చలికి జడిసి దుప్పటి తన్నే రోజులకు ఇక సెలవు. శివరాత్రి జాగారంతో శివ శివా అంటూ పోవాల్సిన చలి ముందే పారిపోయినట్లుంది. చల్లని పవనాల రాక తగ్గిపోవడంతో రాష్ట్రంలో శీతాకాలం కేవలం రెండు రోజులే తీవ్రత చూపింది. గత డిసెంబరు 28, 29వ తేదీలే ఈ కాలానికి చలి రోజులు. 2018లో 13 రోజులపాటు శీతల గాలుల తీవ్రత నమోదైంది. మారుతున్న వాతావరణంతో ఉష్ణోగ్రత నమోదయ్యే దినాలు రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణంగా హైదరాబాద్‌లో 10-11 డిగ్రీల కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. ఈ శీతాకాలంలో మాత్రం నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలే (డిసెంబర్‌ 29) కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అబ్బురపరిచేలా ‘మేడారం’ ఆహ్వాన పత్రిక

మేడారం జాతరకు ప్రముఖులను ఆహ్వానించేందుకు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వాన పత్రిక ఆకట్టుకునేలా ఉంది. ఈ పత్రికలో మేడారం జాతర చరిత్ర, గిరిజనుల సంప్రదాయాలను తెలియజేసే విశేషాలతో కూడిన పుస్తకం, గిరిజనులు గీసిన బొమ్మ, లక్ష్మీదేవరగా పిలువబడే చెక్కతో తయారు చేసిన గుర్రం తల, సమ్మక్క-సారలమ్మ ప్రతిరూపంగా పిలువబడే కర్రతో తయారు చేసిన కుంకుమభరణి ఉంది. ఇందులో అమ్మవార్ల పసుపు, కుంకుమ సైతం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పిశాచంతో పోరాడుతున్నాం

కరోనా కొత్త రకం వైరస్‌ను చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పిశాచంతో పోల్చారు. దీన్ని నియంత్రణలోకి తెచ్చే విషయమై చర్చించేందుకు ఆయన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టేడ్రోస్‌ అధనామ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టేడ్రోస్‌ మాట్లాడుతూ.. వుహాన్‌ నగరం నుంచి వివిధ దేశాల పౌరులను తరలించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించడం లేదని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం అతిగా స్పందించకుండా ప్రశాంతంగా ఉండాలని కోరారు. మరోవైపు, చైనాలో ఇప్పటివరకు 4,515 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఒక్క మంగళవారమే 24 మంది మరణించారు. దీంతో చైనాలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 106కు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నీతీశ్‌, ప్రశాంత్‌ కిశోర్‌ మాటల యుద్ధం

ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్‌ కిశోర్‌కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌కు మధ్య మంగళవారం తీవ్ర మాటల యుద్ధం జరిగింది. పార్టీలో కొనసాగాలా.. వద్దా.. అన్నది ప్రశాంత్‌ తేల్చుకోవాలని నీతీశ్‌ వ్యాఖ్యానించారు. ప్రశాంత్‌ కిశోర్‌ 2018 సెప్టెంబర్‌లో జేడీయూలో చేరారు. నీతీశ్‌ కుమార్‌ ఆయనను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే జేడీయూ మిత్రపక్షమైన భాజపాపై ప్రశాంత్‌ కిశోర్‌ కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో ఆ పార్టీని సమర్థించాలన్న జేడీయూ నిర్ణయాన్ని కిశోర్‌ తప్పుపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సౌర ‘ధ్రువ తార’!

సూర్యుడి ఉత్తర, దక్షిణ ధ్రువాలను తొలిసారిగా చిత్రీకరించేందుకు అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా ‘సోలార్‌ ఆర్బిటర్‌’ అనే వ్యోమనౌకను ప్రయోగించనున్నాయి. వచ్చే నెల 7న దీన్ని ప్రయోగించనున్నట్లు అమెరికా రోదసి సంస్థ ‘నాసా’ ఒక ప్రకటనలో పేర్కొంది. సూర్యుడి మధ్యరేఖా ప్రాంతానికి సమాంతరంగా విస్తరించి ఉన్న ప్రదేశాన్ని ‘ఎక్లిప్టిక్‌ ప్లేన్‌’గా పేర్కొంటారు. గ్రహాలన్నీ ఇందులోనే పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడి వద్దకు ఇప్పటివరకూ ప్రయోగించిన వ్యోమనౌకలన్నీ ఈ ఎక్లిప్టిక్‌ ప్లేన్‌లోనో.. దానికి దగ్గర్లోనో ఉన్నాయి. సోలార్‌ ఆర్బిటర్‌ మాత్రం దాన్ని దాటి వెళుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఝున్‌ఝున్‌వాలాపై సెబీ కన్ను

దిగ్గజ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కన్నేసింది. ఆప్‌టెక్‌ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై సెబీ నోటీసులు జారీ చేసింది. ఆప్‌టెక్‌లో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆయన కుటుంబ సభ్యులకు మెజారిటీ వాటా ఉంది. ఆప్‌టెక్‌ వాటాదార్లుగా ఉన్న ఇతర కుటుంబ సభ్యులు, మదుపరి రమేశ్‌ దమానీ, డైరెక్టర్‌ మధు జయకుమార్‌ సహా కొంత మంది బోర్డు సభ్యుల పాత్రపై సెబీ విచారిస్తోంది. అయితే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిన సమయం, ఎటువంటి సమాచారం బయటకు వెళ్లింది అన్న విషయాలు తెలియాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇక రెండడుగులే..

ఇంకా రెండడుగులే. ప్రపంచకప్‌ను నిలబెట్టుకోవడానికి భారత యువసేన వేయాల్సింది ఇక రెండడుగులే. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ప్రియమ్‌ గార్గ్‌ నేతృత్వంలోని భారత జట్టు అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పేస్‌ బౌలర్‌ కార్తీక్‌ సంచలన బౌలింగ్‌తో విజృంభించిన వేళ.. భారత్‌ క్వార్టర్స్‌లో కంగారూలను చిత్తుగా ఓడించింది. జైస్వాల్‌, అంకోలేకర్‌ విలువైన అర్ధశతకాలు చేశారు. భారత యువ జట్టు అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో 74 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘వి’లన్‌ వచ్చాడు

‘అష్టాచమ్మా’తో నానిని కథానాయకుడిగా పరిచయం చేశారు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఆ తర్వాత ‘జెంటిల్‌మేన్‌’గా చూపించారు. ఉగాదికి రాబోతున్న ‘వి’ చిత్రంతో నాని నటనలో మరో కోణాన్ని చూపించబోతున్నారు. నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్‌, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వి’. దిల్‌రాజు, శిరీష్‌, హర్షిత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. నాని లుక్‌ని విడుదల చేశారు. ఇప్పటిదాకా క్లాస్‌, మాస్‌ పాత్రలతో ఆకట్టుకున్న నాని తొలిసారి ఒక రాక్షసుడి తరహా పాత్రని పోషిస్తున్నారు. విలనిజంతో కూడుకున్న ఆ పాత్రకి తగ్గట్టుగానే నాని లుక్‌ కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సరదాగా ఉరి..ప్రమాదవశాత్తూ భర్త మృతి!

భార్యకు ఉరేసుకోవడం గురించి చెబుతూ ప్రమాదవశాత్తూ గొంతుకు తాడు బిగుసుకుని నూతన వరుడు మృతి చెందారు.  తమిళనాడులోని మదురై జిల్లా చోళైయళగుపురానికి చెందిన మహ్మద్‌ అలీ(22)కి రెండు నెలల క్రితం వివాహమైంది. దంపతులు ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో తాడుతో ఉరేసుకోవడం గురించి చెబుతూ... అలా చేసి చూపించేందుకు అలీ యత్నించినట్లు సమాచారం. ఆ సమయంలో అతడు నిల్చున్న కుర్చీ జారి కిందపడింది. గొంతుకు ఉన్న తాడు బిగుసుకుంది. దిగ్భ్రాంతికి గురైన భార్య కేకలు వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.